close

ప్రధానాంశాలు

ఫైనల్లో ఇంగ్లాండ్‌.. ఆసీస్‌పై విజయం

ఎడ్జ్‌బాస్టన్‌: ప్రపంచకప్‌-2019 ఫైనల్‌ జట్లు ఏవో తేలిపోయాయి. గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి ఇంగ్లాండ్‌ దర్జాగా ఫైనల్‌కు చేరుకుంది. లార్డ్స్‌ వేదికగా ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దీంతో ఈసారి వన్డే ప్రపంచకప్‌ ఛాంపియన్‌గా కొత్త జట్టు అవతరించనుంది.

అచ్చొచ్చిన మైదానంలో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. ముందు బంతితో వోక్స్‌(3/20), రషీద్‌(3/54), ఆర్చర్‌(2/32) రెచ్చిపోవడంతో ఆస్ట్రేలియా పోరాటం 49 ఓవర్లలోనే 223 పరుగుల వద్దే ముగిసింది. స్టీవ్‌స్మిత్‌ (85; 119 బంతుల్లో 6×4) ఒంటరి పోరాటం చేశాడు. అలెక్స్‌ కారీ (46; 70 బంతుల్లో 4×4) సమయోచిత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దవడకు గాయమైనా బ్యాండేజ్‌ వేసుకొని స్ఫూర్తి ప్రదర్శించాడు. మాక్స్‌వెల్‌ (22; 23 బంతుల్లో 2×4, 1×6), మిచెల్‌ స్టార్క్‌ (29; 36 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. 
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెనర్లు జేసన్‌ రాయ్‌(85; 65 బంతుల్లో 9×4, 5×6), బెయిర్‌స్టో(34; 43 బంతుల్లో 5×4) మెరుపు ఆరంభం ఇవ్వగా.. జో రూట్‌(49; 46 బంతుల్లో 8×4), మోర్గాన్‌(45; 39 బంతుల్లో 8×4) లాంఛనాన్ని పూర్తి చేశారు. దీంతో లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ 32.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. మరో 107 బంతులు మిగిలి ఉండగానే ఇంగ్లాండ్‌ ఘనవిజయం సాధించింది. 1992 తర్వాత ఇంగ్లాండ్‌ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 

ఓపెనర్లు బాదేశారు..
లక్ష్యం చిన్నది కావడంతో ఇంగ్లాండ్‌ ఓపెనర్లు తొలుత నిదానంగా ఛేదన ఆరంభించారు. కాస్త కుదురుకున్నాక ఒక్కసారిగా దూకుడు పెంచారు. దీంతో 10 ఓవర్లకే స్కోరుబోర్డుపై 50 పరుగులు వచ్చాయి. తర్వాత జోరు పెంచిన రాయ్‌ భారీ షాట్లతో అలరించాడు. 15వ ఓవర్‌లో స్టార్క్‌ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాది అర్ధశతకం అందుకున్నాడు. స్మిత్‌  వేసిన తర్వాతి ఓవర్లో ఏకంగా మూడు సిక్స్‌లు బాది జట్టు స్కోరుబోర్డును 100 దాటించాడు. కానీ అనూహ్యంగా 18వ ఓవర్‌లో స్టార్క్‌ బౌలింగ్‌లో మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో(34) ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో 124 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాసేపటికే రాయ్‌(85) కూడా కమిన్స్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరుకున్నాడు. రాయ్‌ ఆడిన బంతి.. బ్యాట్‌కు తాకకున్నా ఆసీస్‌ ఆటగాళ్లు అప్పీలు చేయడంతో ఫీల్డ్‌ అంపైర్‌ అప్పటికే వేలు ఎత్తాడు. రిప్లేలోనూ రాయ్‌ నాటౌట్‌ అని తేలింది. కానీ అప్పటికే ఇంగ్లాండ్‌కు సమీక్ష అవకాశం లేకపోవడంతో రాయ్‌ అసహనంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మైదానంలో ఆసీస్‌ ఆటగాళ్లు చివరగా చేసుకున్న సంబరాలు అవే. తర్వాత సారథి మోర్గాన్‌, రూట్‌తో కలిసి స్కోరుబోర్డును ముందుండి నడిపించాడు. వీరిద్దరూ మరో వికెట్‌ పడకుండా జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 30వ ఓవర్‌లోనే ఇంగ్లాండ్‌ స్కోరుబోర్డు 200 దాటింది. మరో రెండు ఓవర్లలోనే మిగతా లక్ష్యాన్ని కూడా అందుకొని ఇంగ్లాండ్‌ ఫైనల్‌కు చేరింది. 



మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net