close

కథనాలు

సలామ్‌ కారీ! నీ పోరాటంతో కుంబ్లేను గుర్తుకుతెచ్చావ్‌

దేశం కోసం యుద్ధభూమిలో సైనికుడు ప్రాణాలు ఎదురొడ్డి మరీ పోరాడతాడు. శత్రువుల నుంచి దూసుకొస్తున్న బుల్లెట్లను లెక్క చేయకుండా మాతృభూమి రక్షణే ముందు తర్వాతే ఏదైనా అంటూ తెగువ చూపిస్తాడు. ఒకవేళ అసువులు బాస్తున్నా సొంతగడ్డ రుణం తీర్చుకోవడానికే కదా ఈ జీవితం ఉందని భావిస్తాడు. క్రీడల్లోనూ ఇలాంటి సందర్భాల్ని అప్పుడప్పుడూ చూస్తుంటాం. దేశం తరఫున ఆడాలని ప్రతి ఆటగాడు ఎన్నో కలలు కంటాడు. దానికోసం కఠోర శ్రమ చేస్తాడు. మైదానంలోకి దిగాక గొప్ప పోరాటంతో ఆకట్టుకుంటాడు. ఆ సమయంలో గాయాలను లెక్క చేయరు. ప్రత్యర్థి ముందు తలవంచకూడదనే తపనతో చెలరేగిపోతారు. విలువైన ప్రదర్శనతో తమ దేశభక్తిని చాటుకుంటారు. ప్రస్తుత ప్రపంచకప్‌లోనూ ఇలాంటి సన్నివేశం ఒకటి చోటుచేసుకుంది. అదీ సెమీస్‌లో కావడం గమనార్హం. 


 

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ అలెక్స్‌ కారీ కూడా అచ్చం ఇదే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్మిత్‌తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మిస్తున్న సమయంలో ఎనిమిదో ఓవర్‌లో అతను గాయపడ్డాడు. ఆర్చర్‌ బౌలింగ్‌లో ఆఖరి బంతి నేరుగా అతని దవడను బలంగా తాకింది. అక్కడ చీలిక ఏర్పడి రక్తం కారడంతో ఆటగాళ్లంతా కంగారు పడ్డారు. నొప్పి వేధిస్తున్నా అతను మాత్రం మైదానాన్ని వీడలేదు. కష్టాల్లో ఉన్న జట్టును ఎలాగైనా ఆదుకోవాలనుకున్నాడు. రక్తం కారుతున్నా గాయాన్ని లెక్కచేయలేదు. వెంటనే ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నా తల చుట్టూ బ్యాండేజ్‌తో చిరునవ్వులు చిందిస్తూ తన పోరాటాన్ని సాగించాడు. తర్వాతి ఓవర్‌లోనే వోక్స్‌ బౌలింగ్‌లో ఆఖరి బంతిని అద్భుతంగా బౌండరీకి తరలించాడు. అప్పటి నుంచి అతను వెనుదిరిగి చూడలేదు. స్మిత్‌తో కలిసి ఇంగ్లిష్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టాడు. మరో వికెట్‌ పడకుండా స్మిత్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పుతూ స్కోరుబోర్డును 100 పరుగులు దాటించాడు. అర్ధశతకానికి మరో నాలుగు పరుగుల దూరంలో రషీద్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి కారీ (46; 70బంతుల్లో 4×4) జేమ్స్‌విన్స్‌ చేతికి చిక్కాడు. బ్యాండేజ్‌తో అతను చూపిన స్ఫూర్తిదాయక పోరాటం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కారీ క్రీజులోకి వచ్చే ముందు జట్టు స్కోరు మూడు వికెట్ల నష్టానికి 14 పరుగులు కాగా అతను ఔట్‌ అయ్యే సమయానికి స్కోరుబోర్డు 117తో ఉంది. అతడి పోరాట పటిమ ఒకప్పటి అనిల్‌ కుంబ్లేను తలపించింది. 

అప్పట్లో కుంబ్లే
2002లో వెస్టిండీస్‌తో టెస్టు మ్యాచ్‌లో భారత మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే కూడా ఇలాగే గాయంతోనే స్ఫూర్తిదాయక పోరాటం చేశాడు. ఆ మ్యాచ్‌లో విండీస్‌ బౌలర్‌ డిల్లాన్‌ విసిరిన బౌన్సర్‌ కుంబ్లే దవడను గట్టిగా తగిలింది. రక్తం కారుతున్నా జంబో అలాగే బ్యాటింగ్‌ కొనసాగించాడు. అనంతరం ప్రాథమిక చికిత్స చేయించుకొని మళ్లీ బ్యాండేజ్‌తోనే ఫీల్డింగ్ కోసమని మైదానంలోకి అడుగుపెట్టాడు. బంతితోనూ మాయ చేసి కీలకమైన లారా (4) వికెట్‌ పడగొట్టాడు. నాటి అతని ప్రదర్శన ప్రతి క్రికెట్‌ అభిమానికి ఇప్పటికీ జ్ఞాపకమే. మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net