close

ప్రధానాంశాలు

ఎదురు దెబ్బ

ధావన్‌ వేలికి గాయం
కనీసం మూడు మ్యాచ్‌లకు దూరం
నాటింగ్‌హామ్‌

రెండు పెద్ద జట్లపై వరుసగా రెండు విజయాలొచ్చాయి. అందులోనూ గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించారు. ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అంతా ఫామ్‌ చాటుకున్నారు. బౌలర్ల ప్రదర్శనా బాగుంది. టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ ప్రయాణం సాఫీగా సాగిపోతోందని అభిమానులు సంతోషంగా ఉండగా.. ఒక చేదు వార్త. ఆస్ట్రేలియాపై చక్కటి శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన శిఖర్‌ ధావన్‌.. గాయపడ్డాడు. వేలి గాయం వల్ల అతను కనీసం మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ధావన్‌ స్థానంలో మరో ఆటగాడిని ఎంపిక చేస్తారా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.

ప్రపంచకప్‌లో కీలక సమరాల ముంగిట టీమ్‌ఇండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాపై సూపర్‌సెంచరీతో ఫామ్‌ చాటుకున్న ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. అదే మ్యాచ్‌లో వేలి గాయానికి గురి కావడంతో తాత్కాలికంగా ఆటకు దూరమయ్యాడు. కమిన్స్‌ విసిరిన బౌన్సర్‌ను ధావన్‌ డిఫెన్స్‌ ఆడబోగా అది అతడి ఎడమ చేతి వేలికి బలంగా తాకింది. ఫిజియోతో ప్రథమ చికిత్స చేయించుకున్నాక ధావన్‌ బ్యాటింగ్‌ కొనసాగించాడు. అయితే నొప్పి ఎక్కువగా ఉండటంతో భారత్‌ ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో ధావన్‌ మైదానానికే రాలేదు. అతడి స్థానంలో జడేజా ఫీల్డింగ్‌ చేశాడు. వేలిలో చీలిక వచ్చినట్లు పరీక్షల్లో తేలడంతో కొన్ని రోజుల పాటు ధావన్‌ బ్యాట్‌ పట్టడానికి వీల్లేదని వైద్యులు తేల్చారు. అతను కచ్చితంగా ఎన్ని రోజులు ఆటకు దూరమవుతాడన్న విషయంలో స్పష్టత లేదు. కనీసం మూడు మ్యాచ్‌లకు అతను దూరమవుతాడని సమాచారం. భారత్‌.. గురువారం న్యూజిలాండ్‌తో, ఆదివారం పాకిస్థాన్‌తో, ఈ నెల 22న అఫ్గానిస్థాన్‌తో తలపడనుంది. కప్పుపై ఎన్నో ఆశలతో ఉన్న భారత్‌కు ధావన్‌ గాయం కచ్చితంగా పెద్ద ఎదురుదెబ్బే. ఐసీసీ టోర్నీల్లో అతడికి గొప్ప రికార్డుంది. ప్రపంచకప్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో కలిపి 20 మ్యాచ్‌లాడిన అతను 65.15 సగటుతో 1238 పరుగులు చేయడం విశేషం. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో విఫలమైనా.. ఆస్ట్రేలియాపై సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతను ఫామ్‌ అందుకోగానే గాయంతో దూరం కావడం భారత్‌కు మింగుడు పడని విషయమే. మరో ఓపెనర్‌ రోహిత్‌తో ధావన్‌కు చక్కటి సమన్వయం ఉంది. చాలా ఏళ్లుగా ఈ జోడీ వన్డేల్లో భారత విజయాల్లో కీలకంగా ఉంటోంది. ప్రపంచకప్‌ ముంగిట ఓపెనర్ల ఫామ్‌ ఆందోళన రేకెత్తించినా.. టోర్నీలో ఒకరి తర్వాత ఒకరు శతకాలు బాదడంతో సమస్య తీరినట్లయింది. ఓపెనింగ్‌లో కుడి, ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ ఉండటం ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద తలనొప్పే. బ్యాటింగ్‌ ఆర్డర్లో మరో లెఫ్ట్‌ హ్యాండర్‌ లేని నేపథ్యంలో ధావన్‌ జట్టులో ఉండటం అవసరం. అందుకే సాధ్యమైనంత త్వరగా అతను కోలుకుని తుది జట్టులోకి రావాలని టీమ్‌ఇండియా ఆశిస్తోంది.

నొప్పిని భరిస్తూ 93

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ధావన్‌ చేసిన గొప్ప పోరాటం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడీ మ్యాచ్‌లో 117 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఐతే 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడి వేలికి గాయమైంది. అయినా ఇంకో 93 పరుగులు చేశాడు. వేలికి పై భాగంలో చీలిక వచ్చేంత గాయం అయినా.. ధావన్‌ ప్రథమ చికిత్స తీసుకుని బ్యాటింగ్‌ కొనసాగించాడు. గాయమైంది అతడి ఎడమ చేతి వేలికి. ధావన్‌ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్‌ కాబట్టి.. బంతి నేరుగా మళ్లీ ఆ వేలికి తగిలే ప్రమాదం ఉంటుంది. ఒకసారి గాయమైన వేలికి మళ్లీ దెబ్బ తాకుతుందనే భయం వెంటాడుతుంది. కానీ ధావన్‌ అదేమీ పట్టించుకోకుండా నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్‌ కొనసాగించాడు. దానిపై అప్పుడెవరూ అంతగా దృష్టిసారించలేదు. ఇప్పుడు గాయం తీవ్రత వెల్లడయ్యేసరికి.. ధావన్‌ జట్టు కోసం ఎలా పోరాడాడో అర్థమవుతోంది.

మరో ఆటగాడిని ఎందుకు తీసుకోలేదంటే..?

గాయపడ్డ ధావన్‌ స్థానంలో ప్రస్తుతానికి ప్రత్యామ్నాయ ఆటగాడిని భారత జట్టు ఎంచుకోలేదు. ప్రపంచకప్‌ సందర్భంగా గాయపడ్డ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకుంటే.. ఆ ఆటగాడు మళ్లీ కోలుకుంటే నేరుగా జట్టులోకి తిరిగి రావడానికి వీల్లేదు. మరో ఆటగాడు గాయపడితేనే అతడికి అవకాశం దక్కుతుంది. గాయపడ్డ ఆటగాడి స్థానంలో ఎంపికైన ఆటగాడిని తప్పించి.. పాత ఆటగాడిని ఎంచుకోవడానికి ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవు. ఓపెనింగ్‌లో ధావన్‌ కీలకం కావడంతో పంత్‌నో, మరొకరినో ఎంపిక చేసి అతడికి దారులు మూసేయాలని జట్టు యాజమాన్యం భావించడం లేదు. ఈ నెల 27న వెస్టిండీస్‌తో, 30న ఇంగ్లాండ్‌తో భారత్‌ మ్యాచ్‌లు ఆడనుంది. అవి కీలక మ్యాచ్‌లు కావడంతో అప్పటికైనా ధావన్‌ కోలుకుంటే వెంటనే తుది జట్టులోకి తీసుకోవాలని భారత్‌ భావిస్తోంది. ధావన్‌ కోలుకోని పక్షంలో రిషబ్‌ పంత్‌ను ఎంపిక చేయడం ఖాయం. కొన్ని రోజుల పాటు ధావన్‌ను గమనించి ఆ తర్వాత తప్పదనుకుంటే పంత్‌ను పిలిచే అవకాశముంది.

ఇంకొకరు గాయపడితే..?

ధావన్‌ అవసరం జట్టుకు చాలానే ఉండటంతో అతను ఎప్పుడు కోలుకుంటే అప్పుడు తుది జట్టులోకి తీసుకుందామనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంచుకోలేదు. అయితే ఇప్పుడు మరో ఆటగాడు గాయపడితే పరిస్థితేంటన్నది సందేహం. అప్పుడు కచ్చితంగా ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకోవాల్సిందే. ఆ స్థితిలో అప్పటికప్పుడు పంత్‌ను రప్పించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో పంత్‌ను ముందు జాగ్రత్తగా ఇంగ్లాండ్‌కు రిషబ్‌ పంత్‌ను పంపే అవకాశాలున్నాయి. ధావన్‌ త్వరగా కోలుకునే అవకాశం లేదని తెలిసినా.. లేదా మరో ఆటగాడు ఎవరైనా గాయపడ్డా వెంటనే పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవడానికి అవకాశముంటుంది.

ఓపెనర్‌గా రాహుల్‌.. 

ధావన్‌ దూరమైన నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌లకు కేఎల్‌ రాహుల్‌.. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేయడం ఖాయం. నాలుగో స్థానానికి ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ రేసులో ఉన్నారు. కొంతమేర బౌలింగ్‌కు కూడా అవసరమనుకుంటే శంకర్‌ను.. బ్యాటింగ్‌ చాలనుకుంటే కార్తీక్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశముంది.


Tags :

మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net