close

ప్రధానాంశాలు

వానా వానా వద్దప్పా..

ఈనాడు క్రీడావిభాగం

కసిగా తలపడే జట్లు.. ఉత్కంఠభరిత పోరాటాలు.. ఆటగాళ్ల అద్భుత విన్యాసాలు.. వికెట్ల వేట.. పరుగుల వరద.. సెంచరీల హోరు! ప్రపంచకప్‌ అనగానే గుర్తొచ్చేవి ఇవే. ప్రపంచకప్‌లో వారం రోజుల పాటు ఈ దృశ్యాలే కనిపించాయి. కానీ అనుకోని అతిథిలా వచ్చేస్తున్న వరుణుడు మ్యాచ్‌ల్ని ముంచేస్తున్నాడు. వర్షం దెబ్బకు కొన్ని జట్ల భవితవ్యం తారుమారు అవుతుండగా.. మొత్తంగా ప్రపంచకప్‌ సమీకరణాలే మారిపోతున్నాయి.

ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు వర్షార్పణమయ్యాయి. అందులో రెండు శ్రీలంక మ్యాచ్‌లే. బ్రిస్టల్‌లో శ్రీలంకతో పాకిస్థాన్‌ మ్యాచ్‌ రద్దయింది. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికాతో వెస్టిండీస్‌ పోరులో ఫలితం తేలలేదు. బ్రిస్టల్‌లో శ్రీలంకతో బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ రద్దయింది. బ్రిస్టల్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్క బంతి కూడా పడలేదు. సౌథాంప్టన్‌లో దక్షిణాఫ్రికా  7.3 ఓవర్లాడి 2 వికెట్లకు 29 పరుగులు చేశాక మ్యాచ్‌ నిలిచిపోయింది. మ్యాచ్‌ల రద్దు ప్రభావం శ్రీలంక, పాక్‌, వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై పడింది. ప్రపంచకప్‌లో లంకపై పాక్‌ది అజేయమైన రికార్డు. ఇప్పటిదాకా ఏడు మ్యాచ్‌లాడగా.. ఏడింట్లోనూ విజయం సాధించింది. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం లంకతో పోరులో ఆ జట్టే ఫేవరెట్‌. దీంతో గెలిచే మ్యాచ్‌లో పాక్‌ ఒక పాయింటుతో సరిపెట్టుకున్నట్లయింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిన దక్షిణాఫ్రికా.. సోమవారం విండీస్‌తో మ్యాచ్‌ ఆరంభంలోనే  2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఈ లెక్కన మ్యాచ్‌ విండీస్‌ పక్షానే ఉన్నట్లు! వరుణుడి ప్రవేశంతో విండీస్‌ ఒక పాయింటుతో సర్దుకుంది. నాలుగు మ్యాచ్‌లాడిన దక్షిణాఫ్రికా ఒక పాయింటుతో ఖాతా తెరిచింది. మంగళవారం శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మ్యాచ్‌లో ఇరు జట్లకు సమాన విజయావకాశాలు ఉండగా.. వర్షం కారణంగా చెరో పాయింటుతో సరిపెట్టుకున్నాయి. బంగ్లాదేశ్‌ సెమీఫైనల్‌ చేరుతుందన్న నమ్మకం లేకపోయినా.. ప్రస్తుత ఫామ్‌ ప్రకారం సంచలనాలు నమోదు చేసే సత్తా ఆ జట్టుకుంది కాబట్టి అవకాశాల్ని కొట్టిపారేయలేం.

దక్షిణాఫ్రికా పనైపోయినట్లేనా!

వరుసగా 2 మ్యాచ్‌లు రద్దవడం శ్రీలంకకు కొంచెం లాభమే! 2 మ్యాచ్‌ల ద్వారా లంకకు 2 పాయింట్లు వచ్చాయి. అంటే ఒక మ్యాచ్‌లో నెగ్గినట్లే! దక్షిణాఫ్రికా పరిస్థితే అగమ్యగోచరంగా తయారైంది. 1992 నుంచి ప్రపంచకప్‌లలో ఆ జట్టుది మెరుగైన ప్రదర్శనే. బలమైన జట్టుగానే బరిలో దిగి నాకౌట్‌ వరకు తిరుగులేకుండా కనిపించేది. ఈసారి మాత్రం పేలవమైన ప్రదర్శనతో అభిమానుల్ని నిరాశ పరుస్తోంది. తొలి  3 మ్యాచ్‌ల్లో ఓడిన దక్షిణాఫ్రికాకు నాలుగో మ్యాచ్‌ రద్దవడం శరాఘాతమే. లీగ్‌ దశలో 9 మ్యాచ్‌ల్లో 6 గెలిస్తే నాకౌట్‌కు చేరుకునే అవకాశముంది!  4 మ్యాచ్‌ల తర్వాత దక్షిణాఫ్రికా ఖాతాలో ఉన్నది ఒకే ఒక్క పాయింటు. అది కూడా వర్షం వల్ల వచ్చిందే. మిగతా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గినా దక్షిణాఫ్రికా ముందుకెళ్తుందన్న నమ్మకం లేదు.

అన్ని కప్‌లు జూన్‌లోనే

ప్రపంచకప్‌ చరిత్రలో మూడు మ్యాచ్‌లు వర్షార్పణం కావడం ఇదే తొలిసారి. దీంతో మెగా టోర్నీ నిర్వహణకు ఇది సరైన సమయమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి ఇంగ్లాండ్‌లో ఇప్పుడు వేసవి కాలం! అందుకే ప్రపంచకప్‌కు ఇదే సరైన సమయమని ఐసీసీ భావించింది. ఇంగ్లాండ్‌లో ఇప్పటిదాకా 4 ప్రపంచకప్‌లు జరిగాయి. 1975 (జూన్‌ 7 నుంచి 21), 1979 (జూన్‌ 9 నుంచి 23), 1983 (జూన్‌ 9 నుంచి 25), 1999 (మే 14 నుంచి జూన్‌ 20) ప్రపంచకప్‌లు జూన్‌లోనే జరగడం విశేషం.

నాకౌట్‌కే రిజర్వ్‌ డే

ప్రపంచకప్‌లో లీగ్‌ దశలో మ్యాచ్‌లకు రిజర్వ్‌ డే లేదు. గ్రూప్‌ దశలో వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు 75 నిమిషాలు మ్యాచ్‌ సమయాన్ని పొడిగించొచ్చు. గరిష్ఠంగా మరో గంట పొడిగించే అధికారం మ్యాచ్‌ రిఫరీకి ఉంటుంది. సెమీఫైనల్స్‌, ఫైనల్‌కు రిజర్వ్‌ డే ఉంది. మ్యాచ్‌ రోజు ఆట మధ్యలో వర్షం పడితే.. తర్వాతి రోజు అక్కడి నుంచే మ్యాచ్‌ కొనసాగుతుంది. మళ్లీ కొత్తగా ప్రారంభించరు.
* మ్యాచ్‌లు తుడిచిపెట్టుకుపోవడంలో ఈ ప్రపంచకప్‌దే రికార్డు. 1992, 2003 ప్రపంచకప్‌లలో రెండేసి మ్యాచ్‌ల్లో వర్షార్పణమయ్యాయి. ఈసారి ఆ సంఖ్య ఇప్పటికే మూడుకు చేరింది. అందులో రెండు మ్యాచ్‌ల్లో కనీసం టాస్‌ కూడా పడలేదు.


Tags :

మరిన్ని

నేటి మ్యాచులు

దేవతార్చన

రుచులు

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net