విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయ్‌?

వార్తలు / కథనాలు

విమానాలు తెలుపు రంగులోనే ఎందుకుంటాయ్‌?

ఏ వస్తువులైనా రంగు రంగుల్లో ఉంటే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే బొమ్మల నుంచి వాహనాల వరకు అన్ని వివిధ రంగుల్లో మనకు అందుబాటులో ఉంటాయి. కానీ, ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసే ఎయిర్‌లైన్‌ సంస్థలు తమ విమానాలకు తెలుపు రంగునే వేస్తాయి. బ్రాండ్‌పేరు, లోగోలో తప్ప విమానమంతా తెలుపు రంగులోనే కనిపిస్తుంది. ఎందుకలా?విమానానికి ఆకర్షణీయ రంగుల్ని వేయకుండా తెలుపు రంగునే ఎందుకు వేస్తారు అంటే.. దీనికి చాలా కారణాలున్నాయండోయ్‌. విమానం నిర్వహణ దగ్గర నుంచి.. పునర్విక్రయం వరకు అన్నింట్లోనూ తెలుపు రంగు ఎంతో లాభాదాయకంగా ఉంటుందట. ఎలాగో తెలుసుకుందాం పదండి..!

ధర తక్కువ.. మన్నిక ఎక్కువ

ఎయిర్‌లైన్‌ సంస్థను స్థాపించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. విమానాలు కొనుగోలు చేయడానికి రూ. కోట్లు ఖర్చు చేస్తారు. అంతటితో సరిపోతుందా..? తరచూ విమానాలకు మరమతులు చేసి, రంగులు వేస్తూ ఉండాలి. ఈ అదనపు ఆర్థిక భారం ఉండకూడదనే ఎయిర్‌లైన్‌ సంస్థలు విమానాలకు తెలుపు రంగు వేస్తుంటాయి. రంగుల్లో తెలుపు రంగు ధర తక్కువగా ఉంటుంది. ఒక విమానానికి అటుఇటుగా 245 లీటర్ల తెలుపు రంగు సరిపోతుంది. తొందరగా పెయింట్‌ వేయొచ్చు.. ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. అందుకే సంస్థలు తెలుపు రంగును ఎంచుకుంటాయి.

విమానం లోపల ఉష్ణోగ్రత పెరగదు

విమానాల్లో ఉష్ణోగ్రత పెరగకుండా తెలుపు రంగు ఉపయోగపడుతుంది. గాల్లో ప్రయాణిస్తున్న విమానంపై సూర్యకాంతి ఎక్కువగా పడుతుంటుంది. అయితే.. విమానం వెలుపల వేసిన తెలుపు రంగు సూర్యకాంతిని శోషించదు. దీంతో లోపల భాగంలో ఉష్ణోగ్రత పెరగదు. దీని వల్ల కూలింగ్‌ వ్యవస్థపై భారం పడదు. తద్వారా ఇంధనం కూడా ఆదా అవుతుంది. అలాగే, విమానంలో ఉండే ప్లాస్టిక్‌ భాగాలు సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల వల్ల పాడవుతుంటాయి. అలా జరగకుండా తెలుపు రంగు కాపాడుతుంది. 

రన్‌వేపై ప్రమాదం జరగకుండా..

విమాన ప్రమాదాలు ఎక్కువగా ఎయిర్‌పోర్టు రన్‌వేపై నుంచి టేకాఫ్‌ అవుతున్నప్పుడు లేదా లాండ్‌ అవుతున్నప్పుడు జరుగుతుంటాయి. అందుకే ఆ సమయంలో విమాన సిబ్బంది ప్రయాణికులను కిటికి తెర తెరిచి విమాన వెలుపల భాగాలను చూడమంటారు. విమాన వెలుపలి భాగాల్లో ఏమైనా పగుళ్లు ఉన్నా.. విమాన రెక్కల భాగంలో ఉండే యంత్రాల్లో లోపం తలెత్తి మంటలు చెలరేగినా గుర్తించి చెబితే.. ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు. విమానం ఇతర రంగుల్లో ఉంటే పగుళ్లు.. మంటలు సరిగా కనిపించకపోవచ్చు. అదే తెలుపు రంగులో అయితే స్పష్టంగా కనిపిస్తుంది.

పక్షులు ఢీకొట్టవు

గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు పక్షులు ఎక్కడ ఢీకొడతాయోనని ఎయిర్‌లైన్‌ సంస్థలు భయపడుతుంటాయి. విమానరంగంలో ఇది అతి పెద్ద సమస్య ఇది. అయితే, ఇతర రంగులతో పోలిస్తే తెలుపు రంగు విమానాలను పక్షులు ఢీకొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తేలింది. పక్షులు తెలుపు రంగు విమానాన్ని చూసి అది కూడా పక్షే అనుకుంటాయని, పట్టించుకోకుండా పక్కకి వెళ్లిపోతాయని పరిశోధకులు తెలిపారు.

పునర్విక్రయంలో మంచి ధర

ఎయిర్‌లైన్స్‌ సంస్థలు చాలా వరకు నేరుగా విమాన తయారీ సంస్థల నుంచి విమానాలను కొనుగోలు చేయవు. తోటి సంస్థలు వాడిన విమానాలను లీజుకు తీసుకోవడం లేదా తక్కువ ధరకు కొనుగోలు చేయడం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో తెలుపు రంగు విమానాలకే సంస్థలు మొదటి ప్రాధాన్యమిస్తాయి. ఎందుకంటే, వాటిపై తిరిగి పెయింగ్‌ వేసే ఖర్చు ఉండదు. నచ్చిన విధంగా విమానాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కారణాలతోనే విమానాలకు తెలుపు రంగు వేయడానికి ఎయిర్‌లైన్స్‌ సంస్థలు మొగ్గు చూపుతుంటాయి. కొన్ని సంస్థలు ఈ లెక్కలేమి చూడకుండా.. ఖర్చుకు వెనకాడకుండా ఎరుపు, నీలి రంగులు వేస్తుంటాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న