close

వార్తలు / కథనాలు

సమవుజ్జీల సమరంలో హెలికాప్టర్ల విధ్వంసం

ధోనీసేన విశ్వవిజేతగా అవతరించిన క్షణాలు గుర్తున్నాయా

చరిత్ర.. ఎంత విస్తృతి ఉందీ పదానికి! ఓ గొప్ప సంఘటనను వర్ణించేందుకు వేల పదాలు సరిపోనప్పుడు ‘చరిత్ర’ ఆ లోటు తీరుస్తుంది. దానికో ఖ్యాతి అద్దుతుంది. అసాధ్యం సుసాధ్యమైందని ఘనంగా చాటుతుంది. ఏదైనా గొప్ప పని చేపడితే చరిత్ర సృష్టించాలని చెప్తారు. అంతకు ముందే సృష్టిస్తే తిరగరాయాలని సూచిస్తారు. 1983లో ‘కపిల్‌ డెవిల్స్‌’ భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ అందించి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత ఎందరో ప్రయత్నించినా 2011లో ‘ధోనీ డైనమైట్స్‌’ మాత్రమే దానిని తిరగరాసింది. ఇప్పుడు కోహ్లీసేన వంతు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆనాడు శ్రీలంకతో అంతిమ సమరంలో హెలికాప్టర్‌ షాట్ల విధ్వంసాన్ని గుర్తుచేసుకుందామా!!

ప్రత్యర్థి ‘ఒత్తిడి’

క్వార్టర్స్‌లో నాలుగు సార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియాను ఓడించేశాం. భావోద్వేగం నిండిన సెమీస్‌లో దాయాది పాక్‌ను చిత్తుచేసేశాం. ఇక మిగిలింది సమవుజ్జీ శ్రీలంక. ఇటు టీమిండియా నాయకుడు ఎంఎస్‌ ధోనీ, అటు లంక సారథి సంగక్కర ప్రశాంత స్వభావులే. ఇద్దరూ కీపర్లే. మనకు బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ అండగా ఉంటే ప్రత్యర్థికి బౌలింగ్‌ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ ఉన్నాడు. బ్యాటింగ్‌లో అటు దిల్షాన్‌, జయవర్దనె, ఉపుల్‌ తరంగ ఉంటే ఇటు సెహ్వాగ్‌, కోహ్లీ, యువీ ఉన్నారు. లంకలో మలింగ, కులశేఖర, పెరీరా ఉంటే భారత్‌లో జహీర్‌, భజ్జీ, మునాఫ్‌ ఉన్నారు. ఇక ఫీల్డింగ్‌లోనూ సమానమే. అందుకే విశ్వవిజేతలెవరో తేల్చుకొనేందుకు ఈ సమవుజ్జీలు ఒకే ప్రత్యర్థితో పోరాడాయి. దానిపేరే ‘ఒత్తిడి’.

ఆఖర్లో విధ్వంసం

ఈ మ్యాచ్‌లో టాస్‌ వివాదాస్పదంగా మారింది. రెండోసారి టాస్‌ నెగ్గిన సంగక్కర బౌన్సీ పిచ్‌ కావడంతో బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే జహీర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో సెగ పుట్టించాడు. దాంతో తొలి 5 ఓవర్లలో లంకేయులు చేసింది 9 పరుగులే. అతడు వేసిన 6.1వ బంతికి తరంగ (2) వెనుదిరిగాడు. జహీర్‌ 5-3-6-1తో వణికించడంతో శ్రీలంక వ్యూహం మార్చింది. శ్రీశాంత్‌ను లక్ష్యంగా ఎంచుకొని స్వల్ప భాగస్వామ్యాలు సాధించింది. దాంతో 16వ ఓవర్‌లో 60 వద్ద గానీ భారత్‌కు దిల్షాన్‌ (33) వికెట్‌ దక్కలేదు. ఈ క్రమంలో సారథి సంగక్కర (48)తో కలిసి మహేళా జయవర్దనె (103*; 88 బంతుల్లో 13×4) చెలరేగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా జయవర్దనె శతకం వైపు సాగాడు. అనూహ్యంగా చివరి 5 ఓవర్లలో లంకేయులు చెలరేగాడు. కట్టుదిట్టంగా బంతులు వేస్తున్న జహీర్‌ బౌలింగ్‌నూ ఊచకోత కోశారు. ఆఖరి పవర్‌ప్లేలో అతడు వేసిన 3 ఓవర్లలో 44 పరుగులు దంచారు. 48వ ఓవర్ మొదలుపెట్టినప్పుడు 8-3-25-2తో ఉన్న అతడి గణాంకాలను చివరికి 10-3-60-2గా మార్చేశారు. ఇక భజ్జీ పరిస్థితీ అంతే. ఆఖర్లో పెరీరా 9 బంతుల్లోనే 22 పరుగులు చేయడంతో 40వ ఓవర్‌కు 183/5గా ఉన్న స్కోరు చివరికి 274/6గా మారింది. కులశేఖర (32) ఫర్వాలేదనిపించాడు.

ధీర గంభీరం

వాంఖడేలో 275 పరుగుల ఛేదన. సులభమేమీ కాదు. గతంలో అక్కడ ఛేదించిన భారీ లక్ష్యం 229. పిచ్‌ బౌన్స్‌కు సహకరిస్తోంది. లసిత్‌ మలింగ యార్కర్లకు నిలవడం గగనమే! మరోవైపు లంకలో మురళీధరన్‌ ఉన్నాడు. 121 కోట్ల భారతీయుల హృదయ స్పందన సర్రున పెరిగిపోయింది. గుండెల్లో ఏదో తెలియని గుబులు. ఛేదన సాధ్యమేనా? సచిన్‌ వందో శతకం అందుకుంటాడా? ప్రపంచకప్‌ ముద్దాడాలన్న చిరకాల వాంఛ నెరవేర్చుకుంటాడా? ఇంతలోనే మలింగ ఇన్నింగ్స్‌ తొలి బంతిని వీరేంద్ర సెహ్వాగ్‌ ఆడాడు. పరుగు రాలేదు. రెండో బంతికి ఎల్బీ. భారత్‌కు, అభిమానులకు దిమ్మదిరిగే షాక్‌! జట్టు స్కోరు 31 వద్ద సచిన్‌ (18; 14 బంతుల్లో 2×4) కీపర్‌ సంగకు క్యాచ్‌ ఇచ్చాడు. మళ్లీ బౌలర్‌ మలింగానే. అభిమానుల్లో ముఖాల్లో ఆందోళన ఆవరించింది. అయితే విరాట్‌ కోహ్లీ (35; 49 బంతుల్లో 4×4) సహకారంతో గౌతమ్ గంభీర్‌ (97; 122 బంతుల్లో 9×4) అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. విజయానికి పునాదులు పడ్డాయనుకున్న శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆడిన తొలి బంతిని బౌండరీకి పంపించి హెచ్చరికలు పంపించాడు. 3వ వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం అందించాడు. లక్ష్యం చిన్నది చేస్తున్న ఈ జోడీని కోహ్లీని ఔట్‌ చేయడం ద్వారా దిల్షాన్‌ విడదీశాడు. అప్పుడు టీమిండియా స్కోరు 114.

హెలికాప్టర్ల ప్రవేశం

అప్పటికే ఫామ్‌లో ఉన్న యువరాజ్‌ (21*; 24 బంతుల్లో 2×4)ను కాదని టీమిండియా సారథి ఎంఎస్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. టోర్నీలో బ్యాటింగ్‌ పరంగా అతడిది విఫల గాథే! ఒక్క మ్యాచ్‌లోనూ భారీ స్కోరు చేయలేదు. తనను తాను నిరూపించుకొనేందుకు ఇదో చక్కటి అవకాశంగా భావించాడు. గంభీర్‌ క్రీజులో ఉండటంతో కుడి-ఎడమ కూర్పు బాగుంటుందని ఆలోచించాడు. పైగా లంకలో సీనియర్‌ స్పిన్నర్లు ఉండటంతో ఆవేశంగా మైదానంలోకి వచ్చేశాడు. అప్పుడు మొదలైంది అసలు ఆట. గంభీర్‌తో కలిసి చకచకా పరుగులు తీశాడు. క్రీజులో కుదురుకొనేందుకు సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత చక్కని బౌండరీలతో చెలరేగాడు. అర్ధశతకం సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 109 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ను  విజయానికి దగ్గర చేశారు. కాగా శతకానికి 3 పరుగుల దూరంలో గంభీర్‌ అనవసరంగా ఔటయ్యాడు. అప్పటికి భారత్‌ 41.2 ఓవర్లకు 223తో నిలిచింది.

గౌతీ పెవిలియన్‌ వెళ్లినా ధోనీ అప్పటికే ప్రమాదకరంగా మారిపోయాడు. యువీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఐదో వికెట్‌కు 54 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. మొదట 61 బంతుల్లో 60 చేసిన మహీ ఆ తర్వాత హెలికాప్టర్‌ షాట్లతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 18 బంతుల్లో 31 పరుగులు సాధించాడు. ఆరంభంలో భయపెట్టిన మలింగను 47వ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో బెదరగొట్టాడు. కులశేఖర వేసిన 48.2వ బంతిని హెలికాప్టర్‌తో భారీ సిక్సర్‌గా మలిచి భారత్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. రెండో సారి ప్రపంచకప్‌ను అందించాడు. చరిత్రను తిరగరాశాడు. ఆ క్షణాన యువీ మైదానంలో ఆనందంతో గర్జించాడు. ధోనీ మీదికి దూకి ఆలింగనం చేసుకొన్నాడు. సచిన్‌, హర్భజన్‌ ఆనంద బాష్పాలు కార్చారు. ఆ తర్వాత సచిన్‌ను భుజాలపై వాంఖడే మొత్తం తిప్పిన సంగతి తెలిసిందే.

-ఈనాడు.నెట్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని