close

వార్తలు / కథనాలు

పోయాయ్‌.. మళ్లీ దక్కలేదు

ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం భారత్‌కు చెందిన కోహినూర్‌. 106 క్యారెట్లు ఉండే ఈ వజ్రం దేశంలో అనేకసార్లు దోపిడీకి గురైంది. చివరికి బ్రిటీష్‌ మహారాణి కిరీటంలో చేరింది. 1849లో లాహోర్‌ ఒప్పందంలో భాగంగా పంజాబ్‌ రాజు దీన్ని బ్రిటీష్‌ వారికి అప్పగించారు. దీంతో భారత్‌ ఓ విలువైన వస్తువును కోల్పోయింది. దాన్ని తిరిగి పొందడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలూ ఫలించలేదు. అలా చరిత్రలో ఎన్నో విలువైన వస్తువులు, సంపదలు ఒకరి దగ్గరి నుంచి చేజారి.. ఇప్పటికి తిరిగి రాలేదు. మరి అవేంటో చూడండి..


కంటైనర్‌ బంగారం ఇంకా దొరకట్లేదు 

1865లో అమెరికాలో సివిల్‌ వార్‌ జరుగుతున్న సమయమది. అప్పట్లో సౌత్‌ కరోలినా, మిసిసిపీ, అలబామా, ఫ్లోరిడా, జార్జియా, లూసియానా, టెక్సాస్‌ కలిసి కాన్ఫెడెరేట్‌ స్టేట్స్‌ ఆఫ్ అమెరికా ఉండేవి. దానికి అధ్యక్షుడిగా జఫర్సన్‌ డేవిస్‌ ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న మొత్తం బంగారాన్ని యూనియన్‌ సైనికులు ఎత్తుకెళ్లారు. ఆ బంగారం విలువ వెయ్యి కోట్లకుపైగా ఉంటుంది. దోచుకెళ్లిన బంగారాన్ని ఓ కంటైనర్‌లో నింపిన యూనియన్‌ సైనికులు మిచిగాన్‌ సరస్సును దాటించాలనుకున్నారట. అయితే పడవలో వెళ్తుండగా బంగారం ఉన్న కంటైనర్‌ను మిచిగాన్‌ సరస్సులో పడేశారని ఇద్దరు పరిశోధకులు కనుగొన్నారు. అయితే ఇప్పటివరకు ఆ బంగారాన్ని ఎవరూ బయటకు తీసుకురాలేకపోయారు.


బంగారు గది ఏమైపోయిందో..

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు దౌర్జన్యంగా లాక్కున్న విలువైన వస్తువుల్లో ‘అంబర్‌ రూం’ఒకటి. మైనంతో చేసిన గోడలకు బంగారు తాపడం, కళాకారులు చెక్కిన అద్భుతమైన అద్దాలతో ఎంతో ఆకట్టుకుంటుందీ గది. దీని విలువ దాదాపు ₹2,150 కోట్లు. 1701లో దీన్ని బెర్లిన్‌లోని ఛార్లొటెన్‌బర్గ్‌ ప్యాలెస్‌లో ఏర్పాటు చేయాలని భావించి.. అనివార్య కారణాలతో బెర్లిస్‌ సిటీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేశారు. 1716లో దీన్ని రష్యాకు చెందిన రాజు సార్‌ పీటర్‌ ది గ్రేట్‌కు బహుమతిగా ఇచ్చారు. ముక్కలుగా తీసుకొచ్చిన ఈ గదిని కొన్నేళ్ల తర్వాత కాథరిన్‌ ప్యాలెస్‌లో పునర్‌ నిర్మించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు ఈ ప్యాలెస్‌పై దాడి చేసి అంబర్‌ గదిని ఎత్తుకెళ్లారు. జర్మనీలోని కొంగ్స్‌బర్గ్‌ ప్యాలెస్‌లో దాన్ని ఏర్పాటు చేసి ప్రజల సందర్శనకు ఉంచారు.

యుద్ధం సమయంలో బ్రిటీష్‌ వైమానిక దళాలు ఆ ప్యాలెస్‌పై బాంబు దాడులు జరపడంతో ప్యాలెస్‌ మొత్తం ధ్వంసమైంది. అందులో ఉన్న అంబర్‌ గది కూడా పూర్తిగా ధ్వంసమైందని అంతా భావిస్తున్నారు. అయితే చరిత్రకారుల్లో కొందరు మాత్రం నాజీ అధికారులు ఆ అంబర్‌ గదిని ఎక్కడో దాచిపెట్టారని చెబుతున్నారు. మరికొందరు.. అంబర్‌ గది ముక్కలైపోయిందని భూమిలో కూరుకుపోయిందని అంటున్నారు.  దీని ఆచూకీ కనుగొనడానికి ఇప్పటి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ విఫలమయ్యారు. అసలు అది ఉందో లేదో ఇప్పటికి ఎవరికీ తెలియదు. అయితే దానికి గుర్తుగా అచ్చం అంబర్‌ గదిలా ఉండే మరో గదిని నిర్మించి సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లోని కేథరిన్‌ ప్యాలెస్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇప్పటికీ ఆ డూప్లికేట్‌ గదిని మనం చూడొచ్చు. 


సొరంగంలో దాగున్న బంగారు రైలు

రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నాజీలు ఓ రైలులో బంగారం, విలువైన వజ్రాలు నింపి పోలాండ్‌లోని వాల్‌బ్రెక్‌ సమీపంలో ఉన్న ఓ సొరంగంలో దాచారని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత కాలంలో అది భూమిలో కూరుకుపోయిందని ప్రచారం జరిగింది. దాన్ని వెలికితీసేందుకు చాలా మంది ప్రయత్నించారు. కానీ లభించలేదు. ఒకవేళ నిజంగానే ఆ రైలు బయటపడితే అందులో ఉన్న బంగారం, వజ్రాల విలువ రూ.లక్షల కోట్లలో ఉంటుందని అంచనా.


భారత్‌లో మాయమై ఎక్కడెక్కడో ప్రత్యక్షమై..

1928లో ఓ పర్షియన్‌ స్వర్ణకారుడు పటియాలా రాజు భూపిందర్‌సింగ్‌కు మూడు వేల వజ్రాలతో కూడిన ఓ ప్లాటినమ్‌ నెక్లెస్‌ను తయారు చేసి ఇచ్చాడు. వజ్రాలతో పాటు బర్మీస్‌ రూబీస్‌ తదితర విలువైన రాళ్లతో ఆకట్టుకునే ఆకృతిలో ఉంటుందా నెక్లెస్‌. అయితే 1948లో రాజ్య ఖజానాలో భద్రంగా దాచిపెట్టిన ఆ నెక్లెస్‌ మాయమైంది. 34 ఏళ్ల తర్వాత ఆ నెక్లెస్‌లోని కొంత భాగాన్ని స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో వేలం పాటకు పెట్టారు. ఆ తర్వాత 16 ఏళ్లకు ఆ ప్లాటినమ్‌ నెక్లెస్‌ను కొందరు స్వర్ణకారులు లండన్‌లోని సెకండ్‌ హ్యాండ్‌ జువెలరీ స్టోర్‌లో గుర్తించారు. కానీ, ఆ నెక్లెస్‌లోని వజ్రాలు, విలువైన రాళ్లు లేవు. అవి ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. 


బందిపోటు దోచుకున్న బంగారం ఎక్కడుందో

19వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా దారి దోపిడీలు అధికంగా జరిగేవి. కెనడాలో జెస్సె జేమ్స్‌ అనే బందిపోటు దొంగ దారి దోపిడీలకు పాల్పడేవాడు. పెద్ద మొత్తంలో దోపిడీలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవాడు. 1870లో ఓ సారి వెల్స్‌ఫార్గో సంస్థకు చెందిన బంగారం, నగదు తరలిస్తుండగా.. జేమ్స్‌, అతడి బృందం దారికాచి దోపిడీ చేసింది. పోలీసులు వెంటబడటంతో పారిపోయారు. ఈ క్రమంలో దోచుకున్న భారీ సొత్తును ఒంటారియోలోని ముల్‌ముర్‌లో దాచిపెట్టినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. 1958లో ఓ పరిశోధకుడు అక్కడి వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. బందిపోటు జేమ్స్‌ బృందం సొత్తును దాచాలని భావించి ఉంటే ఇదే సరైన ప్రాంతమని పేర్కొన్నాడు. కానీ, సొత్తు మాత్రం లభించలేదు. అసలు బందిపోటు దొంగలు సొత్తు దాచారా? దాస్తే.. ఇప్పుడు లభించలేదు కాబట్టి ఇది వరకే ఎవరైనా తీసుకెళ్లారా? ఇలాంటి సందేహాలు మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగానే మిగిలిపోయింది. 


కోట్లు విలువ చేసే పెయింటింగ్స్‌ మాయం

ప్రముఖ చిత్రకారుడు జోహన్నెస్‌ వెర్మీర్‌ వేసిన చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. మధ్యతరగతి కుటుంబాలే నేపథ్యంగా చక్కటి పెయింటింగ్స్‌ వేసేవారాయన. దీంతో ఆయన వేసే పెయింటింగ్స్‌ను కళాభిమానులు పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించి తీసుకుంటుంటారు. 1990 మార్చిలో వెర్మీర్‌ వేసిన పెయింటింగ్స్‌ను బోస్టన్‌లోని ఇసబెల్లా స్టీవర్ట్‌ గార్డెన్‌లో ప్రదర్శనకు పెట్టగా.. 10 పెయింటింగ్స్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. వాటిలో ఒక అద్భుతమైన పెయింటింగ్‌ను ఫ్రేమ్‌ చేసినా.. కత్తిరించి ఎత్తుకెళ్లారు. వీటి విలువ దాదాపు ₹15 వేల కోట్లు ఉంటుందట. ఆ గార్డెన్‌లో పెట్టే వస్తువులకు ఇన్సూరెన్స్‌ లేకపోవడంతో తీవ్ర నష్టం జరిగింది. అయితే 2000 సంవత్సరంలో కొందరు దుండగులు ఈ పెయింటింగ్స్‌ను అమ్మాలని ప్రయత్నించారట. కానీ పోలీసులు వారిని పట్టుకోలేకపోయారు. దీంతో ఆ పెయింటింగ్స్‌ ఎక్కడున్నాయో ఇప్పటికి తెలియట్లేదు. ఇవే కాదు, చరిత్రలో ఇలాంటివెన్నో అత్యంత విలువైన వస్తువులు దోపికీ గురై.. ఇప్పటికీ దొరకక్కుండాపోయాయ్‌.


ఐర్లాండ్‌ రాజుల ఆభరణాలు ఎత్తుకెళ్లారు

దేశాన్ని ఏలుతున్న రాజుల ఖజానాలో ఎన్నో విలువైన ఆభరణాలుంటాయి. ఆ ఖజానాకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినా ఖజానాలో చొరబడి కొన్ని విలువైన ఆరభణాలను ఎత్తుకెళ్లారు దొంగలు. 1907లో డబ్లిన్‌లో ఉన్న రాజ భవనంలోని ఖజానాలో ఆభరణాలను ఉంచారు. వాటిల్లో వజ్రాలు, కెంపులు, పచ్చ తదితర విలువైన రాళ్లు పొదిగిన నగలు, ఇతరత్ర ఆభరణాలు ఉన్నాయి. వాటి విలువ దాదాపు ₹150 కోట్లు ఉంటుందట. దొంగలకు పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. చివరికి ఆ ఆభరణాలను దొంగలు విక్లా పర్వతాల్లో పాతిపెట్టారన్న సమాచారాన్ని తెలుసుకోగలిగారు. కొన్నేళ్లపాటు పోలీసులు ఆ పర్వత ప్రాంతంలో ఆభరణాల కోసం వెతికారు. కానీ, వారికి శూన్యహస్తాలే మిగిలాయి. ఇప్పటికీ ఆ ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టలేకపోతున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు