close

వార్తలు / కథనాలు

ముక్కు తెచ్చిన ముప్పు..!

బోయింగ్‌ మార్కెట్‌ను కూల్చేస్తున్న 737మాక్స్‌8

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలో విమానయాన రంగాన్ని శాసిస్తోంది రెండే రెండు సంస్థలు. ఒకటి ఎయిర్‌బస్‌.. రెండోది బోయింగ్‌.  ఏ380 మోడల్‌ విఫలం కావడంతో దాని తయారీని నిలిపేస్తున్నట్లు ఇటీవలే ఎయిర్‌బస్‌ ప్రకటించింది. ఈ నిర్ణయం ఆర్థికంగా ఎయిర్‌బస్‌ను కొంత దెబ్బతీసింది. ఇప్పుడు బోయింగ్‌ వంతు వచ్చింది.. బోయింగ్‌ 737 మాక్స్‌8 విమానాలు ఇప్పుడు సంక్షోభానికి కారణమయ్యాయి. ఇటీవల ఇథియోపియా ఎయిర్స్‌ లైన్స్‌ విమానం గాల్లోకి ఎగిరిన 8 నిమిషాల్లోనే నేలకూలింది. ప్రమాదానికి గురైంది సరికొత్త విమానం. అంతకు ముందు ఆరునెలల క్రితం ఇండోనేషియాకు చెందిన లయన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఒక విమానం కూడా గాల్లోకి ఎగిరిన 10నిమిషాల్లోపే జావా సముద్రంలో పడిపోయింది. ఇది కూడా సరికొత్త విమానమే. రెండూ బోయింగ్‌ 737మాక్స్‌8 మోడల్‌కు చెందినవే. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమైపోయాయి. తమ దేశ గగనతలాల్లో 737మాక్స్‌ విమానాలు ఎగరడాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. 

737 మాక్స్‌లను నిలిపివేసిన దేశాలు ఇవే..

ప్రపంచ వ్యాప్తంగా 54 విమానయాన సంస్థలు మొత్తం 350కు పైగా బోయింగ్‌ 737  మాక్స్‌8 రకం విమానాలను వినియోగిస్తున్నాయి. ఈ ప్రమాదం తర్వాత పలు దేశాల ప్రభుత్వాలకు ఈ మోడల్‌ విమానం భద్రతపై అనుమానాలు పుట్టుకొచ్చాయి. దీంతో చాలా దేశాలు ఈమోడల్‌ విమానాల వినియోగాన్ని సస్పెండ్‌ చేయడం గానీ, లేక నిలిపివేయాలని ఆదేశించడంగానీ చేశాయి. 
‘బోయింగ్‌ 737 మాక్స్‌’లను పక్కన పెట్టిన జాబితాలో మంగళవారం భారత్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ కూడా చేరాయి. ‘‘ఈ విమానాలను తక్షణమే విమానాశ్రయాలకు పరిమితం చేయాలని డీజీసీఏ నిర్ణయించింది. ప్రయాణికుల భద్రతే అతిముఖ్యం. భద్రతాపరంగా అన్నీ పరిశీలించే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుంది’’ అని కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది. మనదేశంలో స్పైస్‌జెట్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ రకం విమానాలను కలిగి ఉన్నాయి. మరోవైపు తమ దేశంలోగానీ, తమ పరిధిలోని గగనతలంలో గానీ స్వదేశీ, విదేశీ విమానయాన సంస్థలకు చెందిన 737 మాక్స్‌ విమానాలు ఎగరడానికి వీల్లేదని బ్రిటన్‌ పౌర విమానయాన సంస్థ ఆదేశించింది. ఐరోపా సమాఖ్య కూడా తమ గగనతలంలో ఈ శ్రేణి విమానాలను నిషేధించింది. సింగపూర్‌, చైనా, మలేసియా, ఇథియోపియా, ఆస్ట్రేలియాలూ వీటిని సోమవారం నుంచి తాత్కాలికంగా విమానాశ్రయాలకే పరిమితం చేశాయి. నేడు యూఏఈ కూడా తమ గగనతలంలో బోయింగ్‌ విమానాలను నడపకూడదని ఆదేశించింది. 

కుప్పకూలిన బోయింగ్‌ షేరు 
ప్రపంచ దేశాలు 737 మాక్స్‌ మోడల్‌ విమానాలను నిషేధిస్తుండటంతో మార్చి 11 తర్వాత నుంచి బోయింగ్‌ షేరు దాదాపు 10శాతం విలువ కోల్పోయింది. ఈ కంపెనీ షేరు గత రెండు దశాబ్దాల్లో ఇంతగా కుంగిన దాఖలాలు లేవు. దీంతో బోయింగ్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మిన్‌స్ట్రేషన్‌ ఈ విమానాలను ఉపయోగించొద్దని ఎక్కడా పేర్కొనలేదని బోయింగ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

బోయింగ్‌ మార్కెట్‌కు దెబ్బ..
2019లో బోయింగ్‌ డెలివరీ చేయాల్సిన విమానాల్లో దాదాపు 90శాతం 737 మోడల్‌కు చెందినవే. అత్యాధునిక ఇంజిన్‌, ఇంధన పొదుపు విషయంలో ఇది మార్కెట్‌ లీడర్‌గా నిలిచింది. దీంతో ఆర్డర్లు వెల్లువెత్తాయి. దాదాపు 900 విమానాలను ఈ ఏడాదిలో డెలివరీ చేయాలని బోయింగ్‌ లక్ష్యంగాపెట్టుకొంది. దాదాపు 2,900కు పైగా విమానాలకు ఆర్డర్లు కూడా సంపాదించింది. దీనికి చైనా, జర్మనీ, యూఏఈ, ఇండోనేషియాలు అతిపెద్ద కస్టమర్లు. ఇప్పుడు అదే మోడల్‌ వివాదంలో చిక్కుకోవడంతో ఆ మార్కెట్‌  ఎయిర్‌బస్‌ వైపు మళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు 200 విమానాల కోసం ఆర్డర్‌ చేసిన ఇండోనేషియా.. లయన్‌ ఎయిర్‌ ప్రమాదంతో ఎయిర్‌బస్‌ వైపు మళ్లినట్లు సమాచారం. 
సమస్యకు కారణం ఇదీ..
ఈ ప్రమాదాలకు ప్రధానంగా ది మనూవరింగ్‌ కేరెక్టరిస్టిక్‌  అగ్మెంటేషన్‌ సిస్టమ్‌(ఎంసీఏఎస్‌) వ్యవస్థ ప్రాధాన కారణమని అనుమానిస్తున్నారు. పైలట్లకు సాయం చేసేందుకు పలు ఆటోమేటిక్‌ సాఫ్ట్‌వేర్లు ఇప్పుడ విమానాల్లో ఉంటున్నాయి.అటువంటిదే ఇది కూడా. విమానం ప్రయాణించేటప్పుడు కొన్ని సందర్భాల్లో తోకభాగం మరీ కిందకు వెళ్లి.. ముక్కు భాగం పైకి లేచి ప్రయాణిస్తుంటాయి. దీనిని స్టాలింగ్‌ అంటారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ సమయంలో పైలట్లు చాకచక్యంగా ముక్కు భాగాన్ని కిందకు దించుతారు. అప్పుడు తోకభాగం కూడా పైకి లేచి విమానానికి స్థిరత్వం లభిస్తుంది. ఇదే పనిని ఆటోమేటిక్‌గా చేసేందుకు బోయింగ్‌ సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. అదే ఎంసీఏఎస్‌. విమానం పరిస్థితిని అర్థం చేసుకొని ఇది ఆటోమేటిక్‌గా ముక్కు భాగాన్ని కిందకు దించి తోకభాగాన్ని పైకి లేపుతుంది. కానీ ఈ అప్‌డేషన్‌ గురించి పైలట్లకు పూర్తిగా అవగాహన లేదు. స్టాలింగ్‌ సమయంలో సాఫ్ట్‌వేర్‌ దానంతట అదే విమానం ముక్కును కిందకు దింపుతుంది. ఈ విషయం తెలియక పైలట్లు కూడా మాన్యూవల్‌గా ముక్కును కిందకు దించడంతో విమానం ఒక్కసారిగా భూమివైపు దూసుకెళుతుంది. దీంతో పైలట్లు కంగారుపడి పరిస్థితిని చక్కదిద్దేలోపే ప్రమాదం చోటు చేసుకొంటోంది. లయన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం విషయంలో ఇదే జరిగింది. 
 ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేషన్‌ గురించి ఎఫ్‌ఏఏ పలు విమాన నియంత్రణ సంస్థలకు అందజేసింది. కానీ ఆయా విమాన నియంత్రణ సంస్థలు ఈ సమాచారాన్ని తమ దేశంలోని ఎయిర్‌లైన్స్‌కు ఎంతవరకు తెలియజేశాయనేది ప్రశ్నార్థకంగా మారింది. గతంతో భారత్‌కు చెందిన డీజీసీఏ కూడా దీనిపై విమానయాన సంస్థలను అప్రమత్తం చేసింది. 
ప్రాథమిక దర్యాప్తు నివేదికపైనే..
ప్రస్తుతం ఇథోయోపియా విమాన దర్ఘటన దర్యాప్తు ప్రాథమిక నివేదిక వెలువడితేగానీ బోయింగ్‌ భవితవ్యంపై స్పష్టత రాదు. ఎందుకంటే మార్కెట్లో ఎయిర్‌బస్‌ ఏ320తో పోటీపడే విమానం బోయింగ్‌ 737మాక్స్‌ మాత్రమే. బోయింగ్‌ చరిత్రలో ఇదే అత్యంత వేగంగా అమ్ముడు పోయిన మోడల్‌. ఇప్పుడు అదే మోడల్‌ ఆరు నెలల వ్యవధిలో 346 మంది ప్రాణాలు తీయడంతో దాని భవితవ్యం ప్రమాదంలో పడింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు