ఆ నగరమంతా ఒకే భవనంలో..!

వార్తలు / కథనాలు

ఆ నగరమంతా ఒకే భవనంలో..!


(ఫొటో: బెగిచ్‌టవర్స్‌.కామ్‌ వెబ్‌సైట్‌)

ఇంటర్నెట్‌ డెస్క్‌: నగరంలో.. ఆస్పత్రులు, పోలీస్‌స్టేషన్లు‌, అన్ని రకాల దుకాణాలు, పోస్ట్‌ ఆఫీసులు‌, హోటళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, గుడి, బడి ఇలా అన్ని సదుపాయాలు ఉంటాయి. మరి అలాంటి నగరం ఒక్క భవనంలోనే ఉంటే? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? నిజంగానే అలాంటి ఓ భవనం యూఎస్‌లో అలస్కా రాష్ట్రంలోని విట్టియర్‌ అనే నగరంలో ఉంది. అక్కడి జనాభాలో అధిక శాతం ఆ భవనంలోనే నివసిస్తున్నారు. సమస్త సేవలు అందులోనే లభిస్తున్నాయి. ఆ భవనం విశేషాలేంటో తెలుసుకుందామా..

విట్టియర్‌‌.. సముద్రం, ఓడరేవు, పర్వతాలు, హిమపాతం, జలపాతాలతో ఎంతో సుందరంగా కనిపించే మారుమూల ప్రాంతం. పర్యటకుల తాకిడి తక్కువగానే ఉన్నా.. ఆహ్లాదకరమైన ప్రదేశంగా పేరుంది. ఇక్కడే బెగిచ్‌ టవర్స్‌ అనే పద్నాలుగు అంతస్తుల భవనం ఉంది. మరికొన్ని చిన్న చిన్న భవనాలు, కార్యాలయాలూ ఉన్నాయి. కానీ, ఇక్కడి జనాభాలో అధికశాతం బెగిచ్‌ టవర్స్‌లోనే నివసిస్తున్నారు. కొంతమంది సొంతిల్లు కలిగిన స్థానికులే ఉండగా.. మరికొందరు అద్దెకుంటున్నారు. ఇంకొంతమంది సీజనల్‌గా కొన్ని నెలలు ఉండిపోవడం కోసం గదులను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఈ భవనంలోనే పోస్టాఫీస్‌, జనరల్‌ స్టోర్‌, ఆస్పత్రి, పోలీస్‌ స్టేషన్‌, మేయర్‌ కార్యాలయం, చర్చి, బడి, లాండ్రీ, హోటల్‌ వంటి అన్ని సదుపాయాలు ఉన్నాయి. పర్యటకుల కోసం పద్నాలుగో అంతస్తులో, టెర్రస్‌పై ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. పండగలైనా, సమావేశాలైనా, ప్రజలంతా ఏకమై ఈ భవనంలోనే నిర్వహిస్తారు. అసలు ఈ భవన నిర్మాణం.. ఈ ప్రాంతం నగరంగా మారడానికి వెనుక పెద్ద కథే ఉంది..

రెండో ప్రపంచయుద్ధం సమయంలో అమెరికా సైన్యం విట్టియర్‌ ప్రాంతాన్ని మిలటరీ క్యాంప్‌గా మార్చుకుంది. యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడే సైన్యం కోసం పెద్ద భవన సముదాయం నిర్మించాలని సైన్యాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 1953లో మొదట యూఎస్‌ ఆర్మీ ఇంజినీర్స్‌ ప్రధాన కార్యాలయం నిర్మాణం ప్రారంభించి 1957లో పూర్తిచేశారు. మొదట దీన్ని ‘హోగ్డే బిల్డింగ్‌’ అనేవారు. దీంతోపాటు మరొక చిన్న భవనం కూడా నిర్మించారు. కానీ, అనుకున్న ప్రణాళిక ప్రకారం భవన సముదాయం నిర్మించలేకపోయారు. ఈ రెండు భవనాల్నే 1960 వరకు ఉపయోగించి అక్కడి నుంచి సైన్యం మకాం మార్చేసింది. 1964లో భూకంపం వచ్చి ఆ ప్రాంతం కాస్త దెబ్బతింది. అయినా 196 ఫ్లాట్‌లున్న ఈ భవనం చెక్కు చెదరలేదు. నెమ్మదిగా ఇక్కడికి ప్రజల రాకపోకలు మొదలై.. ఈ భవనంలో గదులను కొనుగోలు చేసి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. అలా జనసంచారం పెరిగి నగరంగా మారింది. 1972లో ఈ భవనానికి అలస్కా నాయకుడు నిక్‌ బెగిచ్‌ పేరు మీద ‘బెగిచ్‌ టవర్స్‌’ అని నామకరణం చేశారు. ప్రస్తుతం కొవిడ్‌ కారణంగా ఈ భవనంలోని ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ.. ఎక్కువశాతం ఇంటికే పరిమితమవుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న