అక్కడ మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌

వార్తలు / కథనాలు

అక్కడ మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌

జపాన్‌లోని ఓ బార్‌ వినూత్న ప్రయత్నం

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రెస్టారెంట్లు, బార్లు దాదాపు మూతపడ్డాయి. అయితే ఇటీవల వాటిని తెరిచినా.. వ్యాపారం మునపటిలా సాగట్లేదు. కానీ జపాన్‌లోని ఓ బార్‌ మాత్రం కస్టమర్లకు కరోనా భయం లేకుండా చేయాలని వినూత్న విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆ బార్‌కి కస్టమర్లు క్యూ కట్టేస్తున్నారట. 

టోక్యోలోని కబుచికో ప్రాంతంలో పెద్దలకు మాత్రమే వినోదం పంచే అనేక వ్యాపారాలు నడుస్తుంటాయి. అంటే రెస్టారెంట్లు, పబ్స్‌, క్లబ్స్‌, బార్లు, అర్ధరాత్రి తినుబండారాలు ఉంటాయి. నిత్యం కస్టమర్లతో కళకళలాడే ఈ ప్రాంతం కరోనా వల్ల కొంతకాలం నిర్మానుష్యంగా మారింది. అయితే గత నెలలో దుకాణాలు తెరుచుకున్నా కస్టమర్లు కరోనా భయంతో పెద్దగా రావట్లేదు. అయితే ఇదే ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న ‘బుక్‌ కేఫ్‌ అండ్‌ బార్‌’ కస్టమర్లకు కరోనా సోకకుండా ఉండేలా వినూత్న విధానం తీసుకొచ్చింది. ఈ బార్‌లో ఎవరూ మాట్లాడకూడదు. కస్టమర్లు వచ్చి మాట్లాడకుండా తిని లేదా తాగేసి వెళ్లిపోవాలి.

మరి ఆర్డర్‌ చేయడం ఎలా?తోటి వారితో మాట్లాడాలంటే ఎలా అంటారా? బార్‌లో ప్రతి టేబుల్‌ వద్ద కొన్ని నోట్‌ బుక్స్‌.. శానిటైజర్స్‌ ఉంటాయి. బార్‌ సిబ్బంది టేబుల్‌ వద్దకు రాగానే కస్టమర్‌ తనకు కావాల్సిన ఫుడ్‌, డ్రింక్స్‌ను బుక్‌లో రాసి చూపించాలి. దానికి ప్రతిగా బార్‌ సిబ్బంది వారి వద్ద ఉన్న బుక్‌లో ఎంత మొత్తంలో కావాలి? ఇంకేమైనా కావాలా వంటి ప్రశ్నలను రాసి చూపిస్తారు. అలా కేవలం రాతపూర్వకంగానే సంభాషణలు కొనసాగించాలి. ఆర్డర్‌ పూర్తయిన తర్వాత చేతుల్ని టేబుల్‌పై ఉన్న శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే సరి. ఇక కస్టమర్‌ వెంట మరెవరైనా వచ్చినా.. బుక్‌లో రాతపూర్వకంగా మాట్లాడుకోవాల్సిందే. భలే ఉంది కదా ఆలోచన!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న