
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: లక్షల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి ముకేశ్ అంబానీ. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన సంస్థను అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచంలోనే రిలయన్స్‌కు గొప్ప పేరు సాధించిపెట్టారు. కంపెనీ వ్యవహారాలతో బిజీగా ఉండే ముకేశ్ అంబానీకి కార్లు అంటే కూడా ఎంతో మక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రసిద్ధిగాంచిన మోడళ్లు ఆయన గ్యారేజీలోకి వచ్చి చేరిపోతుంటాయి. మరి సూపర్ కార్లకు పెట్టిందిపేరైన ఫెరారీపై అంబానీ దృష్టి పడదంటే మనం నమ్మలేం. అలాంటి ఫెరారీకి చెందిన ‘SF90 స్ట్రాడల్’ సూపర్ కారును తన గ్యారేజీలో పెట్టేసుకున్నారు. అది సరే.. రిలయన్స్ అధినేత కార్ల గ్యారేజీ పేరేంటో తెలుసా...? ‘జియో గ్యారేజీ’. ఇందులో ఉండే ప్రతి కారూ ప్రత్యేకమైనదే. మరి ఫెరారీ SF90 స్ట్రాడల్ సూపర్ కార్ గురించి తెలుసుకుందామా...
ప్రత్యేక డిజైన్‌లో..
ఫెరారీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన కార్లలో SF90 స్ట్రాడల్ సూపర్ కార్ ఒకటి. ‘రేసింగ్ రెడ్’గా పిలవబడే రొస్సో కోర్సా రంగుకలిగిన కారును ముకేశ్ అంబానీ ఎంచుకున్నట్లు సమాచారం. రొస్సో కోర్సా రంగుతోనే ప్రతి రేసింగ్ కారు ఫినిషింగ్‌ను ఫెరారీ చేయడం విశేషం. ప్రస్తుతం ఫెరారీకి చెందిన మోడళ్లలో SF90 స్ట్రాడల్ కారునే టాప్. ఫెరారీ రేసింగ్ బృందం 90వ వార్షికోత్సవం సందర్భంగా 2019లో ఫెరారీ ప్రత్యేకంగా SF90 స్ట్రాడల్ కార్లను తయారు చేయించింది.
కేవలం మూడు సెకన్ల లోపే..
ఫెరారీ కార్లను ఎక్కువగా v12 పవర్ ఇంజిన్‌తో తయారు చేస్తుంటుంది. అయితే SF 90 సూపర్ కార్‌ను v8 ఇంజిన్‌తో 4.0 లీటర్ కెపాసిటీతో శక్తివంతంగా రూపొందించినట్లు ఫెరారీ పేర్కొంది. మూడు ఎలక్ట్రిక్ మోటార్లను బిగించింది. దీంతో 1000 PS పవర్ అవుట్‌పుట్‌తో కారు పరుగులు తీస్తుంది. అలానే 8 స్పీడ్ డూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వినియోగంతో గత మోడల్ కంటే 30 శాతం వేగంగా వెళ్తుందని ఫెరారీ వెల్లడించింది. 7.9kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీతో 26 కి.మీ వెళ్లే అవకాశం ఉంది. SF90 స్ట్రాడల్ సూపర్ కారు నాలుగు రకాల మోడ్లు ఉన్నాయి. ఈ-డ్రైవ్, హైబ్రిడ్, పర్ఫార్మనెన్స్, క్వాలిఫై మోడ్. సూపర్ కారు ధర దాదాపు రూ. 7.5 కోట్లు (ఎక్స్ షోరూం). SF90 సూపర్ కార్ కేవలం 2.5 సెకన్లలో 62 మైళ్ల (100km/h) మార్కును అందుకోగలుగుతుంది. కారు 0 నుంచి 200 km/h అందుకోవాలంటే 6.7 సెకన్లు మాత్రమే పడుతుంది. కారు అత్యధిక వేగం 340 km/h.