close

వార్తలు / కథనాలు

లేక్‌ కోమో ప్రత్యేకతలివే!

అందుకే దీపిక, రణ్‌వీర్‌ దీన్ని ఎంచుకున్నారు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లేక్‌ కోమో..గత కొద్దిరోజులుగా ఈ పదం మీడియాలో మార్మోగిపోతోంది. దీనికి కారణం ఇది ‘బెస్ట్‌ వెడ్డింగ్‌ డెస్టినేషన్‌’గా పేరు తెచ్చుకోవడం. బాలీవుడ్‌ ప్రేమ జంట దీపికా పదుకొణె, రణవీర్‌ సింగ్‌ ల వివాహం ఈనెలలో ఇక్కడే జరగనుంది. కొన్ని నెలల క్రితం జరిగిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్‌ అంబానీ కుమార్తె ఈశా అంబానీ నిశ్చితార్థ మహోత్సవానికీ లేక్‌ కోమో వేదికైంది. మధుర జ్ఞాపకమైన వివాహఘట్టానికి వేదికగా ప్రముఖులు ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అంతలా అక్కడ సౌకర్యాలు ఏమున్నాయి? అక్కడి ప్రత్యేకతలేంటి..పరిస్థితులేంటి? అందమైన కట్టడాలకు, ప్రకృతి సౌందర్యాలకు నెలవైన భారత్‌ను వదిలి అక్కడెందుకు పయనమవుతున్నారో చూద్దాం...

ప్రకృతి అందాలకు నెలవు: ఇటలీలోని అందమైన సరస్సుల్లో లేక్‌ కోమ్‌ ఒకటి. ‘వై’ ఆకారంలో ఉండే ఈ సరస్సు పొడవునా పచ్చదనం పరుచుకున్నట్లు మైదానాలు, దట్టమైన కొండలు ఉంటాయి. అదే విధంగా సరస్సు పొడవునా విడిది గృహాలుంటాయి. కొన్నేళ్ల క్రితం ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పార్కులే ఇక్కడి ప్రధాన ఆకర్షణ. అయితే కాలంతో పాటుగా కొన్ని కృత్రిమ పార్కులు కూడా పుట్టుకొచ్చాయి. ఇక్కడ వాతావరణం వేడుకలకు అనుకూలంగా ఉంటుంది. చుట్టూ కొండలున్నప్పటికీ ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. ఏ కాలంలోనైనా స్వల్పంగా మంచు పడుతూ ఉంటుంది. తెల్లవారు జామున మంచు పడే వేళల్లో ఈ సరస్సు అందాలను చూడటానికి వేల సంఖ్యలో అక్కడికి పర్యాటకులు చేరుకుంటారట. ఇక్కడ కాలుష్యం తక్కువే.

కట్టుదిట్టమైన భద్రత: సుమారు 50 కి.మీ. పొడవున్న ఈ సరస్సు, దాని ఒడ్డున ఉండే విశాలమైన రిసార్టులతో ప్రశాంత వాతావరణంతో నిండి ఉండటం దాని ప్రత్యేకత. ప్రతి రిసార్టు ముందూ పెద్ద పెద్ద పార్కులుంటాయి. విశాలమైన గదులు, అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. స్పా, స్విమ్మింగ్‌ పూల్‌ వంటి సౌకర్యాలుంటాయి. అత్యంత విలాసవంతమైన వసతులతో పాటు భద్రత కూడా అదే స్థాయిలో ఉంటుంది. ప్రతి రిసార్టులోనూ వేల సంఖ్యలో అత్యాధునిక కెమెరాలుంటాయి. కొన్ని రిసార్టులను బుల్లెట్‌ ప్రూఫ్‌తో నిర్మించి ఉంటారు. విదేశాల నుంచి లేక్ కోమోకు వెళ్లే వారు ఇలాంటి రిసార్టుల్లోనే నివాసం ఉంటారని సమాచారం. అక్కడకు మీడియా చేరుకోవాలంటే సంబంధిత పర్యాటక శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి.ఈ కారణంగానే మనదేశ ప్రముఖులు ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటారని తెలుస్తోంది.

విలాస వేడులకు పుట్టినిల్లు: లేక్‌ కోమోలోని రిసార్టుల్లో వసతుల మాదిరిగానే ధరలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. సరస్సు సమీపంలో లభించే తేనె, ఆలివ్‌ నూనె, గోధుమలు వంటి పదార్థాలతో అక్కడి ఆహారపదార్థాలు తయారవుతాయి. ఆయా దేశాల సంప్రదాయాలను బట్టి ఆహార పదార్థాల్లో మార్పులుండవచ్చు. కోమో సంప్రదాయ వంటకమైన ‘పోలెంటా’ను అక్కడికి వచ్చిన అతిథులకు తప్పని సరిగా వడ్డిస్తారు.

దీపిక, రణ్‌వీర్‌ వివాహం ఇక్కడే: లేక్‌ కోమోలోని ప్రఖ్యాత డెల్‌ బాల్బియానెల్లో విల్లాలో దీపికా రణ్‌వీర్‌ల వివాహం జరగనుంది. విశాలమైన పార్కులు, అత్యాధునిక భద్రతా సౌకర్యాలు అక్కడి ప్రత్యేకత. ఎత్తైన కొండల చివరన సరస్సుకు అత్యంత సమీపంలో ఉంటుందీ విల్లా. అత్యాధునిక సాంకేతికతో ఈ విల్లాను నిర్మించారు. ఇటాలియన్‌ చిత్రాల షూటింగ్‌కు ఈ విల్లాను ఎక్కువగా ఉపయోగిస్తారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకునేందుకు ఇక్కడ అవకాశం తక్కువ. ఆటోమేటిక్‌ ఫైర్‌ ప్రివెన్షన్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ జెనరేటెడ్‌ ఇమేజరీ వంటి టెక్నాలజీలు ఈ విల్లాలోని ప్రత్యేకతలు. ఈ కారణంగా అనేకమంది వీఐపీలు ఈ విల్లాను వేడుకలకు వేదికగా ఎంచుకుంటారని సమాచారం.


Tags :

మరిన్ని