సింహాల మలం అమ్ముతున్న జర్మన్‌ సర్కస్‌

వార్తలు / కథనాలు

సింహాల మలం అమ్ముతున్న జర్మన్‌ సర్కస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అనేక రంగాలు చతికిలపడ్డాయి. సందర్శకులు లేక పర్యటక ప్రాంతాలు, సర్కస్‌లు ఏకంగా మూతపడ్డాయి. దీంతో ఆదాయం లేక సర్కస్‌లో ఉండే జంతువులకు సరిగా ఆహారం పెట్టలేకపోతున్నారు. అలాంటి ఇబ్బందులే పడుతున్న జర్మన్‌కి చెందిన ఓ సర్కస్‌ విచిత్రంగా ఆలోచించింది. సర్కస్‌లోని సింహాల మలం విక్రయించి డబ్బులు సంపాదిస్తోంది. సింహాం మలమా? ఛీ.. అనుకుంటున్నారా? నిజమేనండి సింహాల మలం ఇప్పుడు సర్కస్‌కు మంచి ఆదాయవనరుగా మారింది. 

జర్మనీలోని మ్యూనిచ్‌లో క్రోనే పేరుతో ఓ సర్కస్‌ ఉంది. లాక్‌డౌన్‌కి ముందు నిత్యం సందర్శకులతో కళకళలాడేది. కానీ, లాక్‌డౌన్‌ వల్ల పూర్తిగా మూతపడిపోయింది. కొన్ని నెలలపాటు సర్కస్‌ సిబ్బంది చాలా కష్టాలు పడ్డారు. ఇప్పట్లో సర్కస్‌ తిరిగి ప్రారంభించే అవకాశాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల కోసం ఆలోచించారు. అప్పుడే ఈ వింత ఆలోచన తట్టింది. సింహాల మలాన్ని విక్రయించాలని సర్కస్‌ సిబ్బంది నిర్ణయించారు. సర్కస్‌లోని 26 సింహాలు, పులుల మలాన్ని జార్‌లో నింపి అమ్మకానికి పెట్టారు. ఇందుకోసం సర్కస్‌ ముందే ఓ స్టాల్‌ ఏర్పాటు చేశారు. ఒక్కో జార్‌ ఐదు యూరోలు చొప్పున విక్రయిస్తున్నారు. ఇది ఇంటి గార్డెన్‌లో పురుగుల మందులా ఉపయోగపడుతుందని, అలాగే ఇది ఉన్న చోటకు పిల్లులు రావని చెబుతున్నారు. మొదట్లో ఎవరు దీనిని పెద్దగా పట్టించుకోపోయినా.. సర్కస్‌ సిబ్బంది ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న అక్కడి ప్రజలు వారికి అండగా నిలిచారు. సింహాం మలాన్ని కొనుగోలు చేస్తూ సర్కస్‌కు తమవంతు సాయం చేస్తున్నారు. క్రమంగా వాటికి డిమాండ్‌ పెరిగింది. దీంతో ఇప్పుడు ఏకంగా ఆన్‌లైన్‌ సరఫరాను మొదలుపెట్టారు. ఆలోచన విచిత్రం.. కొనుగోలు మరింత విచిత్రం కదా..!


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న