ఈ అడవి ఆత్మహత్యలకు అడ్డా..!

వార్తలు / కథనాలు

ఈ అడవి ఆత్మహత్యలకు అడ్డా..!

ఆత్మహత్య మహాపాపం అని పెద్దలంటారు. కానీ, చిన్న చిన్న కారణాలతో ఎంతోమంది విలువైన తమ ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలు ఇలా ఆత్మహత్యలు చేసుకునేవారికి అడ్డాగా మారిపోతున్నాయి. అలాంటి ప్రాంతమే జపాన్‌లో ఒకటుంది. దేశ రాజధాని టోక్యోకి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న అవుకిగహారా అటవీ ప్రాంతాన్ని అక్కడి ప్రజలు ‘సూసైడ్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో ఏటా పదుల సంఖ్యలో ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటుంటాయి.

అవుకిగహారా అటవీ ప్రాంతం 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చూడటానికి పైకి పచ్చటి చెట్లతో ఎంతో అందంగా ఉంటుంది. లోపల మాత్రం శవాలు కనిపిస్తాయి. చెట్లకు వేలాడే మృతదేహాలు, వన్యమృగాలు తినివదిలేసిన కళేబరాలు, మృతులకు సంబంధించిన వస్తువులు అటవీ ప్రాంతమంతటా దర్శనమిస్తాయి. 1950 నుంచే ఇక్కడ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయట. ఆత్మహత్య చేసుకోవాలని భావించే వారు ఈ అడవిలోకి వచ్చి చెట్లకు ఉరి వేసుకుంటారు.

ఇక్కడే ఆత్మహత్య చేసుకోవడం వెనుక కారణమూ ఉంది. జపాన్‌ పురాణాల ప్రకారం.. ఈ అడవిలో ఉండే చెట్లకు ఉరి వేసుకుంటే మృతి చెందిన తర్వాత అతీతశక్తులు వస్తాయని నమ్ముతారు. అందుకే ఈ అడవిలోనే బలవన్మరణాలకు పాల్పడుతుంటారు. దీంతో ఈ అడవిని దెయ్యాల నివాసంగా చెబుతుంటారు.

తరచూ స్థానిక పోలీసులు, వాలంటీర్లు అడవిలో మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతుంటారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడతాయి. వాటిని తీసుకొచ్చి మృతుల కుటుంబసభ్యుల వివరాలు తెలిస్తే వారికి అప్పగిస్తుంటారు. లేదా పోలీసులే దహన సంస్కారాలు చేసేస్తారు. ఆత్మహత్యలు నివారించడం కోసం పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అడవిలో ప్రవేశ ప్రాంతాల్లో ‘మీ పిల్లల గురించి, కుటుంబం గురించి కాస్త ఆలోచించండి’. ‘నీ జీవితం తల్లిదండ్రులు నీకిచ్చిన అపూర్వమైన బహుమతి’, ‘సాయం కావాలంటే మమ్మల్ని సంప్రదించండి.. ఆత్మహత్య చేసుకోకండి’ అని బోర్డులు పెట్టారు. అయినా ఆత్మహత్యల సంఖ్య ఏమాత్రం తగ్గట్లేదు.

అడవిలో సిగ్నల్స్‌ ఉండవు 

దట్టమైన ఈ అటవీ ప్రాంతంలో ఎవరైన తప్పిపోతే బయటపడటం చాలా కష్టం. ఎందుకంటే దాదాపు అన్ని చెట్లు భారీగా ఒకేలా ఉంటాయి. ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఉండవు. దిక్సూచి పనిచేయదు. దిశలను తప్పుగా చూపిస్తుంటాయట. ఇందుకు ఈ అడవి భూగర్భంలో ఉండే అయస్కాంత లక్షణాలున్న ఇనుప ఖనిజాలే కారణమట. అందుకే పర్యటకులు అడవిలోకి వెళ్తున్నప్పుడు దారిలో చెట్లకు రబ్బర్లు పెడుతుంటారు. ఎందుకంటే ఒకవేళ అడవిలో తప్పిపోయినా వాటిని గుర్తుపట్టి బయటకు వచ్చే అవకాశముంటుందట.

- ఇంటర్నెట్‌ డెస్క్


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న