close

వార్తలు / కథనాలు

ఆండ్రాయిడ్‌ 10 గురించి... 10 విషయాలు

మే7న అధికారిక ప్రకటన!

మరో మూడు నెలల్లో కొత్త ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ విడుదల కాబోతోంది. ఎప్పటిలాగే గూగుల్‌ ఆసక్తికరమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్‌ ‘క్యూ’ అలియాస్‌ ఆండ్రాయిడ్‌ 10ను తీసుకురాబోతోంది. మే 7న జరగబోయే గూగుల్‌ I/Oలో ఆండ్రాయిడ్‌ క్యూ గురించి పూర్తి వివరాలు తెలియొచ్చు. ఇప్పటికైతే పేరేంటనే విషయంలో చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో కొత్త ఫీచర్లు ఇవిగో... అంటూ కొన్ని విశేషాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. వాటన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి.. ఇలా మీ ముందుంచాం.

 

ముదురు రంగుల్లోకి...

స్మార్ట్‌ ఫోన్‌ల స్క్రీన్‌ వెలుతురు మన కంటిపై చాలా ప్రభావం చూపెడుతుంది. రాత్రి సమయాల్లో బ్రైట్‌నెస్‌ ఎక్కువగా ఉండటం వల్ల కంటిపై దీని ప్రభావం ఎక్కువ. దీనికి విరుగుడుగా చాలా మొబైల్‌ సంస్థలు డార్క్‌ మోడ్‌, నైట్‌ మోడ్‌, రీడర్‌ మోడ్‌ అంటూ కొన్ని ఫీచర్లను యాప్‌ల వారీగా అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటి వల్ల మొత్తం ఫోన్‌ డార్క్‌ మోడ్‌లోకి వెళ్లడం లేదు. ఇప్పుడు గూగుల్‌ కూడా ఈ తరహాలో ఆలోచిస్తోంది. అదే డార్క్‌ స్క్రీన్‌. అయితే దీని ద్వారా ఫోన్‌ మొత్తాన్ని నైట్‌ మోడ్‌లో పెట్టుకొని వాడుకోవచ్చు.

 

పాత వెర్షన్‌లోకి...

వాట్సాప్‌ యాప్‌ అప్‌డేట్‌ వచ్చింది కదా అని చేసుకున్నారు... కానీ అది వినియోగానికి అంత సౌకర్యవంతంగా లేదు. మళ్లీ పాత వెర్షన్‌కు వెళ్లిపోదామనుకుంటే వీలుపడటం లేదు. దీంతో ఇబ్బందులు వచ్చినా కొత్త వెర్షనే వాడుతుంటారు. ఇలాంటి వాళ్ల కోసమే ఆండ్రాయిడ్‌ ‘క్యూ’లో కొత్త ఆప్షన్‌ తీసుకొస్తున్నారు. ఒక వేళ అప్‌డేట్‌ నచ్చకపోతే తిరిగి పాత వెర్షన్‌లోకి వెళ్లిపోవచ్చు. దీని వల్ల మీకు నచ్చినప్పుడు మాత్రమే కొత్త వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. పొరపాటున ఆటో అప్‌డేట్‌ అయిపోయినా మళ్లీ వెనక్కి రావొచ్చన్నమాట.

 

వాడుతున్నంతసేపే...

యాప్‌ వాడాలంటే... దానికి కొన్ని పర్మిషన్లు ఇవ్వాలి. స్కానర్‌ యాప్‌ని ఇన్‌స్టాల్ చేశామనుకోండి. స్కానర్‌ స్క్రీన్‌ ఆన్‌ అవ్వాలంటే కెమెరా పర్మిషన్‌ ఇవ్వాలి. టెక్స్ట్‌ కంపోజింగ్‌కి కీబోర్డ్‌ పర్మిషన్‌ ఇవ్వాలి. ఇలా ప్రతీ దానికి ఒక పర్మిషన్ ఇవ్వాలి. యాప్‌ వాడటం ఆపేశాక.. వాటికి ఆ పర్మిషన్లు ఆగిపోవాలి... మీ ఆలోచనా ఇదే కదా. కొత్త ఆండ్రాయిడ్‌లో ఇలాంటి ఆప్షనే తీసుకొస్తున్నారు. యాప్‌ని వాడుతున్నంతసేపే ఆ పర్మిషన్స్‌ పనిచేయేస్తాయట.. తర్వాత క్లోజ్‌ అవుతాయి. మళ్లీ ఆ యాప్‌ వాడాలంటే కొత్తగా పర్మిషన్లు ఇవ్వాల్సిందే.

 

మొబైల్‌ టు కంప్యూటర్‌...

కంప్యూటర్‌పై చేయవలసిన చాలా రకాల పనులు నేడు స్మార్ట్‌ఫోన్‌లో చిటికెలో చేసేస్తున్నాం. అయితే మొబైల్‌లో ఆడే ఆటలు, వాడే యాప్‌లు కంప్యూటర్‌ తెరపై కనిపిస్తే బాగుంటుంది కదా. ఆండ్రాయిడ్‌ ‘క్యూ’లో ఇలాంటి ఆప్షనే అందుబాటులో ఉంటుందంటున్నారు నిపుణులు. డేటా కేబుల్‌తో కంప్యూటర్‌కి కనెక్ట్‌ చేసి ఫోన్‌లో డెస్క్‌టాప్‌ మోడ్‌ ఆప్షన్‌ ఆన్ చేస్తే చాలు.. ఫోన్‌లోని ప్రతి ఆప్షన్‌... కంప్యూటర్‌పై కనబడుతుంది. ఇప్పటికే ఈ తరహా ఫీచర్‌ను శాంసంగ్‌ తీసుకొచ్చింది.

 

ఆకారాలు... అక్షరాలు

ఎప్పుడూ మన ఫోన్‌ ఒకే రకంగా ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఐకాన్స్‌ విషయంలో మరీనూ. వీటిని మార్చాలంటే థర్డ్‌ పార్టీ ఐకాన్లు, ఫాంట్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఆండ్రాయిడ్‌ ‘క్యూ’లో ఈ ఇబ్బంది లేకుండా... చాలా రకాల ఐకాన్‌లు ఉంటాయట..! వాటి ద్వారా మనకు నచ్చినట్లుగా ఐకాన్లు, అక్షరాలను మార్చుకోవచ్చు. కొత్త ఆండ్రాయిడ్‌లో రౌండెడ్‌ రెక్టాంగిల్‌, స్క్వేర్‌, సర్కిల్‌, టియర్‌ డ్రాప్‌ లాంటి ఐకాన్లు ఉంటాయి. వాటిలో నుంచి మీకు నచ్చినది ఎంచుకోవచ్చు. ఫాంట్‌ల విషయంలోనూ ఇదే శైలి ఉంటుందని తెలుస్తోంది.

 

కాపీ... పేస్ట్‌... డిలీట్‌

స్మార్ట్‌ ఫోన్‌లో ఓ యాప్‌లో టెక్ట్‌ని మనం కాపీ చేసుకొని... మరో యాప్‌లో వాడుకుంటాం. ఇలా చేసేటప్పుడు ఆ టెక్ట్స్‌ ఇంటర్నల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోర్‌ అయి ఉంటుంది. దీంతో కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు వస్తాయి. బ్యాంకు ఖాతా పాస్‌వర్డ్‌ కాపీ చేసిన, ఓటీపీ కాపీ చేసిన అది ఇంటర్నల్‌గా అలాగే ఉండిపోతుంది. అలా కాకుండా మనకు అవసరమున్నంత సేపే ఆ టెక్ట్‌ మెమొరీలో ఉండి... తర్వాత డిలీట్‌ అయితే బెటర్‌ కదా..! ఆండ్రాయిడ్‌ ‘క్యూ’లో ఈ ఆప్షన్‌ ఉంటుందని నిపుణులు అంటున్నారు. మనకు నచ్చిన యాప్స్‌లోనే కంటెంట్‌ కాపీ అయ్యి... క్లిప్‌ బోర్డుకు వెళ్లేలా ఈ ఆప్షన్‌తో మార్చుకోవచ్చు కూడా.

 

మరింత భద్రత కోసం...

మొబైల్స్‌ అన్‌లాక్‌ చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఉపయోగిస్తున్న ఫీచర్‌ ఫింగర్‌ ప్రింట్‌. ఫేస్‌ అన్‌లాక్‌ ఇప్పుడిప్పుడే వృద్ధి చెందుతోంది. అయితే ఇది ఎక్కువగా కస్టమ్‌ రామ్‌ ఫోన్లలో ఉంటూ వస్తోంది. గూగుల్‌ 10.0లో ఈ ఫీచర్‌ను ఇన్‌బిల్ట్‌గా తీసుకురానుంది. ఇది మీ ముఖాన్ని 360 డిగ్రీల్లో రీడ్‌ చేస్తుంది. అలాగే కచ్చితత్వంతో పని చేస్తుంది. దీని ద్వారా ఫోన్లలకు మరింత భద్రత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

 

ఐదో తరం..

ఇప్పటికే దేశమంతటా ఇంటర్నెట్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మన దేశం అంతర్జాల వినియోగంలో రెండో స్థానంలో ఉంది. అన్ని టెలికాం‌ కంపెనీలు తక్కువ ధరలకే ఎక్కువ డేటాను అందిస్తున్నాయి. త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దానికి అనుగుణంగా గూగూల్ ‘క్యూ’ను 5జీ అనుకూల వెర్షన్‌గా తీర్చిదిద్దారట. దీని ద్వారా మెరుగైన 5జీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని గూగూల్‌ భావిస్తోంది.

 

నాణ్యత కోసం...

గూగుల్‌ మ్యాప్స్‌లో నావిగేషన్‌ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి. మ్యాప్‌లో ఐకాన్‌ కదలకపోవడం, ఒక చోట ఉంటే ఇంకో చోట చూపించడం లాంటివి జరుగుతున్నాయి. దీనికి చెక్‌ పెడుతూ గూగుల్‌ ‘క్యూ’లో నాణ్యమైన నావిగేషన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం మీద మరింత స్పష్టత రావాల్సి ఉంది.

 

ఇక సులభం...

ప్రస్తుతం స్టాక్‌ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలో స్క్రీన్‌ రికార్డర్‌ సౌకర్యం లేదు. థర్డ్‌ పార్టీ యాప్స్‌తో అయితే రికార్డ్‌ చేసే అవకాశం ఉంది. కస్టమ్‌ రామ్‌తో వస్తున్న షామీ, ఒప్పో, వీవో లాంటి మొబైల్స్‌లో ఈ ఫీచర్‌ ఇన్‌బిల్ట్‌గా వస్తోంది. అయితే ఆండ్రాయిడ్‌ ఇన్‌బిల్ట్‌గా స్క్రీన్‌ రికార్డర్‌ సౌకర్యాన్ని కల్పించాలని చూస్తోంది. గూగూల్‌ ‘క్యూ’లో ఇన్‌బిల్ట్‌గా స్క్రీన్‌ రికార్డర్‌ యాప్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.. ఫుల్‌ స్క్రీన్‌.. మంచి నాణ్యతతో ఈ రికార్డర్ ఉంటుందట.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు