close

వార్తలు / కథనాలు

సిక్స్‌ప్యాక్‌ వేలంవెర్రి చూశారా?

బాడీ ఫిట్‌ ఉంచుకోమని అందరూ సలహా ఇస్తుంటారు. కొందరు దానిని సరిగ్గా అర్థం చేసుకొని... కసరత్తులు చేస్తుంటే... ఇంకొందరు ఇన్‌స్టంట్‌గా ఫిట్‌నెస్‌ సాధించాలని చూస్తున్నారు. రోజులు తరబడి పొట్టకట్టుకొని... ఎక్సర్‌సైజ్‌లు చేసి సిక్స్‌ప్యాక్‌లు చేస్తున్నవాళ్లను మనం చూశాం. కానీ ఓ దేశంలో ఇన్‌స్టంట్‌గా సిక్స్‌ప్యాక్‌ తెప్పిస్తామని వైద్యులు చెబుతున్నారు. దీంతో యువత వేలంవెర్రిగా కొత్తదారి వైపు చూస్తోంది. ఇంతకీ ఆ దేశమేంటి... దాని కథేంటో చూసేయండి!

మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్నో సౌలభ్యాలు మనకు అందుతున్నాయి. దీంతో అన్ని ఇన్‌స్టంట్‌గా పొందడం మనకు అలవాటైపోయింది. అందంగా కనిపించాలంటే సహజ సిద్ధమైన సౌందర్య సాధనాలు వాడొచ్చు. కాస్త సమయం పట్టినా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ.. అప్పటివరకు ఓపిక పట్టలేక ముఖం, ముక్కు, పెదాలు ఇలా చాలా భాగాలకు ప్లాస్టిక్‌ సర్జరీలు చేయించుకుంటున్నారు. ఇప్పుడు అదే దారిలో మగవాళ్లు ఎంతో ఇష్టపడే సిక్స్‌ప్యాక్‌ చేరింది. సిక్స్‌ప్యాక్‌ కోరుకునే యువతకు కష్టపడకుండానే ఆ షేప్‌ను అందిస్తామని ఓ ఆస్పత్రి ఆఫర్‌ చేస్తోంది.

సిక్స్‌ప్యాక్‌ బాడీ తెచ్చుకోవాలంటే అంత ఈజీ కాదు. నోరు కట్టుకొని, సన్నబడి జిమ్‌లో గంటల తరబడి వర్క్‌ఔట్‌ చేయాలి. కఠిన ఆహార నియమాలు పాటించాలి. క్రమం తప్పకుండా శ్రమిస్తే తప్ప కోరుకున్న బాడీ షేప్‌ రాదు. మరి అవేవి లేకుండా చిన్న ఆపరేషన్‌తో మీరు కలలు కనే సిక్స్‌ప్యాక్‌ను పొందొచ్చంటోంది థాయ్‌లాండ్‌లోని మాస్టర్‌ పీస్‌ ఆస్పత్రి. అబ్‌డామినల్‌ ఎట్చింగ్‌ పేరుతో నిర్వహించే ఈ ఆపరేషన్‌ ద్వారా ఎవరికైనా సరే సిక్స్‌ప్యాక్‌ బాడీ వచ్చేలా చేస్తారట. ఉదర భాగంలో కండరాలు బలంగా ఉన్నవారికే ఈ ఆపరేషన్‌ విజయవంతమవుతుందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. నిజానికి అందరిలోనూ సిక్స్‌ప్యాక్‌ ఉంటుంది గానీ కొవ్వు దాన్ని కప్పేస్తుందట. ఆపరేషన్‌ ద్వారా వైద్యులు ఉదర భాగంలోని కొన్ని చోట్ల ఆ కొవ్వును తొలగించి కావాల్సిన చోట చేర్చి సిక్స్‌ప్యాక్‌ను బయటకు తెస్తారట. ఇందులో ప్లాస్టిక్‌, సిలికాన్‌ వంటివి వాడకపోవడంతో పెద్ద ఇబ్బంది ఉండదని వైద్యులు అంటున్నారు. 

‘‘ఇదేమీ కొత్త కాదు. 1990లోనే టెక్సాక్‌కు చెందిన వైద్యులు ఆపరేషన్‌ నిర్వహించారు. ఆ తర్వాత మేం అబ్‌డామిన్‌ ఎట్చింగ్‌పై అధ్యయనం చేసి, పరిశోధించి సొంత నైపుణ్యాన్ని జత చేసి ఈ ఆపరేషన్‌ చేస్తున్నాం. ఈ ఆపరేషన్‌కు రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. ఎలాంటి నొప్పి గానీ.. ప్రమాదం గానీ ఉండదు. ఈ అబ్‌డామిన్‌ ఎట్చింగ్‌ను గత 3 ఏళ్లుగా చేస్తున్నాం. ప్రస్తుతం దీనికి ఆదరణ బాగా పెరిగింది. నెలకు కనీసం 20 నుంచి 30 మంది యువకులు సిక్స్‌ప్యాక్‌ బాడీ కోసం ఈ ఆపరేషన్‌ చేయించుకుంటున్నారు’’అని మాస్టర్‌పీస్‌ ఆస్పత్రి సీఈవో రావీవట్‌ చెప్పుకొచ్చారు. 

ఏదేమైనా ఇలా ఇన్‌స్టంట్‌గా ఫిట్‌నెస్‌ కోసం ప్రయత్నిస్తే ఆరోగ్యానికి ఇబ్బందే. ఇటీవల హైదరాబాద్‌లో పొడవు పెరగడానికి కాళ్లకు శస్త్రచికిత్స చేయించుకొని  ఓ కుర్రాడు మంచం పట్టేశాడు. శస్త్రచికిత్స చేస్తే ఎత్తు పెరగడం ఖాయమని వైద్యులు చెప్పారని ఆ కుర్రాడు ఆ పని చేశాడు. ఇప్పుడు సిక్స్‌ప్యాక్‌ కోసం వైద్యం చేయించుకుంటే ఇంకేమవుతుందో! ఆలోచిస్తేనే భయమేస్తోంది కదా!

- ఇంటర్నెట్‌ డెస్క్‌

|

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు