close

వార్తలు / కథనాలు

సమస్యనా... ఈ యాప్‌లున్నాయిగా!

ప్రభుత్వ సేవలు సులభంగా ప్రజల్లోకి చేరాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా ఆరంభించింది. మన చేతిలోనే సమాచారమంతా అందేలా టెక్నాలజీ సాయంతో యాప్స్‌ తీసుకొచ్చింది. మీకు కావాల్సిన సమాచారం తెలుసుకోవాలన్నా... ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా హెల్ప్‌లైన్ల నంబర్లును అందుబాటులో ఉంచింది. అవే ఇవీ!

MADAD 

మదద్‌ యాప్‌ విదేశాల్లో ఇబ్బందుల పడుతున్న భారతీయులకు ఎంతో ఉపయోగకరం. ఇది విదేశాంగమంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో ఉంటుంది. దీనిలో వీసా, పాస్‌పోర్ట్‌, అత్యవసర నిష్ర్కమణ పత్రాలపై సమాచారం లభిస్తుంది.

Bharat ke veer

విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల కుటుంబాలకి తోడుగా భారత్‌ కే వీర్‌ యాప్‌ పనిచేస్తుంది. ప్రాణాలు కోల్పోయిన కేంద్ర సాయుధ బలగాలకు ఎవరైనా దీని ద్వారా ఆర్థిక సాయం అందించవచ్చు. ఈ యాప్‌ను కేంద్ర హోం శాఖ ప్రవేశపెట్టింది.

cVigil

సి విజిల్‌ యాప్‌ ద్వారా ఎవరైనా ఎన్నికల కమిషన్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఫొటోలు, వీడియోలను సాక్ష్యాలుగా ఈ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. ఆధారాలు రుజువైతే కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెంటనే తగిన చర్యలు తీసుకుంటుంది. ఇది కేంద్ర ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షణలో ఉంది.

UTS

యూటీఎస్‌ యాప్‌ ద్వారా రైల్వేలో సాధారణ టికెట్లని బుకింగ్‌ చేసుకోవచ్చు. బుకింగ్‌ చేసిన టికెట్లని రద్దు చేయడంతో పాటు ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ కూడా బుకింగ్‌ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు 5 కిలోమీటర్ల పరిధిలోనే ఈ వెసులుబాటు ఉంటుంది. అంటే మీరు స్టేషన్‌కు సమీపిస్తున్నప్పుడే టికెట్‌లు బుక్‌ చేయొచ్చు. ఇది కేంద్ర రైల్వే శాఖ పర్యవేక్షణలో ఉంది.

mPassport Seva

ఎమ్‌పాస్‌పోర్ట్‌ సేవా యాప్‌‌లో పాస్‌పోర్టుకి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. దీని వినియోగదారులు తమ పాస్‌పోర్ట్ తాజా వివరాలని పరిశీలించుకోవచ్చు. ఇది దగ్గరలో ఉన్న పాస్‌పోర్ట్‌ సేవ కేంద్రాల వివరాల్ని కూడా చూపిస్తుంది.

National scholarships portal (NSP)

నేషనల్‌ స్కాలర్‌షిప్స్‌ పోర్టల్‌ యాప్‌ విద్యార్థులకి ఎంతో ఉపయోగకరం. కేంద్రం, రాష్ట్రాలు అందించే వివిధ రకాల స్కాలర్‌షిప్స్‌ వివరాలను  ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఉపకార వేతనాలను నేరుగా ఫోన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చు.

Aaykar Setu

పాన్‌ కార్డు, పే టాక్స్‌ దరఖాస్తు చేసుకోవడానికి ఆయాకర్‌ సేతు యాప్‌ ఉపయోగపడుతుంది. దీనిలో వివిధ రకాల ఆదాయపన్ను శాఖ విభాగాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. ఆదాయశాఖ పన్ను శాఖపై ఉన్న సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు.

MKavach 

ఎం కవచ్‌ యాప్‌ ఫోన్‌ భద్రతకు ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో నిషేధించిన మెసేజ్‌, కాల్స్‌ వస్తుంటాయి. అలాంటివి రాకుండా ఈ యాప్‌ పనిచేస్తుంది. దీంతో పాటు డేటాను భద్రపరచడం, యాప్స్‌కి పాస్‌వర్డ్‌ పెట్టుకోవడం తదితర విషయాలకు ఉపయోగపడుతుంది.

Kisan Suvidha

కిసాన్‌ సువిధ యాప్‌ రైతులకు ఎంతో ఉపయోగకరం. మొక్కల పరిరక్షణకు చర్యలు, మార్కెట్‌ ధరలు, వాతావరణ సూచికలు, కొనుగోలుదారుల వివరాలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర విషయాలని తెలుసుకోవచ్చు.

UMANG

ఉమంగ్‌ యాప్‌లో అన్ని రకాల ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ యాప్‌ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, దరఖాస్తు వివరాలను తెలుసుకోవచ్చు. ఇది అన్ని ప్రభుత్వ సేవలను తెలుసుకునేందుకు ఒక మంచి వేదిక.

Voter Helpline 

ఓటర్‌ హెల్ప్‌లైన్‌ ఆప్ ఓటర్లకు ఎంతో ఉపయోగకరం. ఓటర్ల జాబితాలో వ్యక్తి పేరు ఉందా లేదా అని సులువుగా తెలుసుకోవచ్చు. ఓటు దరఖాస్తుపై ఏమైనా ఫిర్యాదులు ఉన్నా దీని ద్వారా చేయవచ్చు. ఓటరు వివరాలను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, షేర్‌ చేసుకోవడం లాంటివి చేయొచ్చు. కొత్తగా ఓటును రిజిస్టర్‌ కూడా చేయొచ్చు.

Incredible India

ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా యాప్‌తో దేశంలోని అన్ని పర్యాటక ప్రదేశాల వివరాలను తెలుసుకోవచ్చు. ఈ యాప్‌లో దేశంలో ఉన్న ప్రత్యేక ప్రదేశాల విశేషాలు, చేరుకునే మార్గాలు, సౌకర్యాలు, ఆహారపు అలవాట్లు  లాంటి వివరాలు ఉంటాయి.

MySpeed 

మైస్పీడ్‌ యాప్‌ ద్వారా వినియోగదారులు మొబైల్‌లో డేటా స్పీడ్‌ గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ నెట్‌వర్క్‌ కవరేజ్‌ ప్రాంతం, నెట్‌వర్క్‌ ఆలస్యం, ప్యాకెట్‌ లాస్‌ సమాచారాన్ని మదించి ట్రాయ్‌కి అందించవచ్చు. వాటిని ట్రాయ్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది.

BHIM

బ్యాంకు ఆర్థిక లావాదేవీలను సులువుగా బీమ్‌ యాప్‌తో చేయవచ్చు. ఈ యాప్‌లో మీ మొబైల్‌ నెంబరు సాయంతో బ్యాంకు ఖాతాల్ని యాడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత డబ్బులు పంపడం, తీసుకోవడం లాంటివి చేయొచ్చు. క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌, వీపీఏ ద్వారా ఈ లావాదేవీలు నిర్వహించొచ్చు.

Indian Police At Your Call App

ఇండియన్‌ పోలీస్‌ ఎట్‌ యువర్‌ కాల్‌ యాప్‌లో దగ్గరలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ను చూపిస్తుంది. దీనిలో జిల్లా కంట్రోల్‌ రూం నంబర్లు, స్థానిక పోలీసుల ఇతర ముఖ్యమైన వివరాలు ఉంటాయి.

Startup India 

స్టార్టప్‌ ఇండియా యాప్‌తో పారిశ్రామికులు అంకుర పరిశ్రమలపై ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. దీనిలో గుర్తింపు, ప్రయోజనాలు, సమాచారాల లాంటి వివరాలు ఉంటాయి.

DigiSevak

డిజీసేవక్‌ యాప్‌తో నైపుణ్యం, ఆసక్తి ఉన్న వలంటీర్లు ఆన్‌లైన్‌లో వివిధ ప్రభుత్వ విభాగాల్లో సేవలు అందించవచ్చు. దీని ద్వారా సేవలు అందించనందుకు బహుమతులు కూడా అందిస్తారు.

IRCTC

రైల్వేకి సంబంధిత అన్ని వివరాలు ఐఆర్‌సీటీస్‌లో చూడవచ్చు. దీని ద్వారా టికెట్లని  చేసుకోవడంతో పాటు రద్దు చేసుకోవచ్చు. పీఎన్‌ఆర్‌ వివరాలు, రైలులో భోజనాన్ని ఆర్డర్‌ కూడా చేసుకోవచ్చు. దీంతోపాటు ఐఆర్‌సీటీసీకి చెందిన మరికొన్ని యాప్‌ల లింక్‌లు ఈ ఆప్‌లో ఉంటాయి.

Digilocker

డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డ్‌, ఆధార్‌ వివరాలు లాంటి డిజిటల్‌ కాపీలు డిజిటల్‌ లాకర్‌లో భద్రపరుచుకోవచ్చు. వీటితో పాటు వ్యక్తిగత చిత్రాలు, పత్రాలు కూడా దాచుకోవచ్చు. ఆధార్‌ నంబరు ఆధారంగా పని చేసే ఈ యాప్‌లో పత్రాలు ఎటువంటి చింత లేకుండా సేవ్‌ చేసుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

mParivahan

డ్రైవింగ్‌ లైసెన్స్, వాహన రిజిస్ర్టేషన్‌ పత్రాలు, రవాణాకు సంబంధించిన ఇతర వివరాలు ఎమ్‌పరివాహన్‌ యాప్‌ ద్వారా డిజిటల్‌లో లభ్యమవుతాయి. ప్రజల్లోకి డిజిటల్‌ రంగాన్ని మరింత చేర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం  ఈ యాప్‌నుతీసుకొచ్చింది.

MyGov

మై గౌ యాప్‌ ద్వారా మన ఆలోచనలు, సలహాలని  మంత్రిత్వ శాఖ, దాని సంబంధిత సంస్థలతో పంచుకోవచ్చు. ప్రజలను ప్రభుత్వంలోనేరుగా భాగస్వామ్యులని చేయాలనే భావనతో ఈ యాప్‌ను తీసుకొచ్చారు.

eBasta 

ఈబాస్టా యాప్‌ విద్యారంగానికి సంబంధించింది. దీనిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆన్‌లైన్‌ పుస్తకాలని పొందవచ్చు. అధ్యయన విషయాలను కూడా రాయవచ్చు.


హెల్ప్‌ లైన్‌ నంబర్లు

    

1091 - సమాజంలో మహిళలకు రక్షణగా హెల్స్‌ లైన్‌ నంబరుని అందుబాటులోకి తెచ్చారు. ఇబ్బందులకు గురయ్యే మహిళలు దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
18001201740 - బీమ్‌ యాప్‌కు సంబంధించిన ప్రశ్నలు, ఫిర్యాదులకు ఈ నంబర్‌ను సంప్రదించవచ్చు.  24 గంటలపాటు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. 
011-1078 - వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవిస్తే సహాయం కోసం ఈ నంబరుని సంప్రదించాలి. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ కాల్స్‌ని స్వీకరిస్తుంది.
1947 - ఆధార్‌ సంబంధిత విషయాలని తెలుసుకోవాలంటే ఈ నంబరుకి కాల్‌ చేయొచ్చు. 
1800114949 - సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించిన ఫిర్యాదులకు ఈ నంబర్‌కు కాల్‌ చేయొచ్చు.
57575 - దరఖాస్తు చేసిన పాన్‌కార్డు వివరాల కోసం ఈ నంబర్‌కు మెసేజ్‌ చేసి తెలుసుకోవచ్చు. 
1098 - చిన్నారుల సంరక్షణ కోసం ఈ నంబర్‌ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. పిల్లలు పడే ఇబ్బందులపై 1098కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు. 
18002581800 - పాస్‌పోర్ట్‌కి సంబంధిత సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ నంబరు ఉపయోగపడుతుంది. దీనికి ఫోన్‌ చేసి చెప్తే సమస్య స్పందిస్తారు. 
18002666868 - భారతీయ తపాల శాఖకు సంబంధించిన ఫిర్యాదులు చేయాలన్నా, వివరాలు తెలుసుకోవాలన్నా ఈ నంబరుని సంప్రదించొచ్చు. 
1909 - చరవాణికి వచ్చే స్పామ్‌ మెసేజీలను నిలిపివేయాలంటే ఈ నంబరుకి సందేశాన్ని పంపాలి. ‘START 0’ అని 1909కి పంపిస్తే ట్రాయ్‌ స్పామ్‌ సందేశాలని నిలిపివేస్తుంది. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని