close

వార్తలు / కథనాలు

ఈ బియ్యాన్ని వండకుండానే వడ్డించొచ్చు

భౌగోళిక గుర్తింపు సాధించిన అసోం ప్రత్యేక బియ్యం

ఈ బియ్యాన్ని వండకుండానే వడ్డించొచ్చు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సాధారణంగా అన్నం వండాలంటే 10 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఇప్పుడు రైస్‌కుక్కర్‌లు వచ్చిన తర్వాత అన్నం వండే పని మరింత సులువైందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అసోంలో పండించే ఓ రకం బియ్యాన్ని వండకుండానే తినేయ్యొచ్చట. ఎలాంటి గ్యాస్‌ స్టవ్‌, రైస్‌ కుక్కర్‌ అవసరం లేకుండా కేవలం నానబెడ్డటంతోనే ఈ బియ్యం అన్నంలా తయారవుతుంది. బొకా ఛాల్‌గా పిలిచే ఈ బియ్యం ప్రత్యేకత ఇది. అందుకే ఈ బియ్యానికి భౌగోళిక గుర్తింపు(జీఐ) ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అసోంలోని నల్బరీ, బార్పెటా, గోల్‌పరా, కామ్‌రూప్‌, ధుబ్రీ, చిరాంగ్‌, బస్కా, దరంగ్‌ తదితర ప్రాంతాల్లో ఈ బొకా ఛాల్‌ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు. మొఘలుల కాలంలో ఈ బియ్యాన్ని ఎక్కువగా సైన్యం కోసం పండించేవారు. తర్వాతి కాలంలో రైతులు తినడం మొదలుపెట్టారు. జూన్‌-డిసెంబరు మధ్య ఈ బియ్యాన్ని అసోం రైతులు పండిస్తారు. దీన్ని వండేందుకు ఎలాంటి గ్యాస్‌, పొయ్యి అవసరం లేదు. కేవలం గంటపాటు చల్లటి నీటిలో నానబెడితే సరిపోతుంది. నీటిలో నానడం వల్ల బియ్యం ఉబ్బి మెత్తగా మారుతుంది. ఆ తర్వాత ఇందులో పెరుగు, బెల్లం, అరటిపండు ఇలా కావాల్సిన పదార్థాలను కలుపుకుని నేరుగా తినేయ్యొచ్చు.

అసోంలోని కొన్ని ప్రాంతాల్లో పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంటికి వచ్చిన అతిథులకు ఈ బియ్యాన్ని వండిపెడతారు. అయితే ప్రస్తుత కాలంలో ఈ బియ్యాన్ని రైతులు కేవలం తమ కోసం మాత్రమే పండించుకుంటున్నారు. బయట వ్యక్తులకు ఇది అంతగా తెలియకపోవడంతో మార్కెట్‌ పరంగా లాభదాయకంగా ఉండదని రైతులు భావిస్తున్నారు. ఈ బియ్యం గురించి తెలుసుకున్న రెండు స్వచ్ఛంద సంస్థలు లోటస్‌ ప్రొగ్రెసివ్‌ సెంటర్‌(ఎల్‌పీసీ), సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్(సీఈఈ) దీనిపై పరిశోధనలు చేశాయి.

ఈ బియ్యాన్ని వండకుండానే వడ్డించొచ్చు

ఈ బియ్యం గురించి అందరికీ తెలియజేసి మార్కెట్‌ను పెంచాలనే ఉద్దేశ్యంతో 2016లో ఈ సంస్థలు బొకా ఛాల్‌కు భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల బొకా ఛాల్‌కు జీఐ గుర్తింపు ఇచ్చింది.

ఈ బొకా ఛాల్‌ ఆరోగ్యానికి ఎంతోమంచిదని ఇటీవల గువాహటి యూనివర్శిటీ చేసిన అధ్యయనంలోనూ తేలింది. ఇందులో 10.73శాతం ఫైబర్‌, 6.8శాతం ప్రొటీన్లు ఉన్నాయని సదరు అధ్యయనం పేర్కొంది. ఈ బియ్యం మనిషి శరీరంలోని వేడిని తగ్గింస్తోందట. అంతేగాక.. ఈ బియ్యాన్ని రసాయనాలతో కూడిన క్రిమిసంహారక మందులతో పండించడం సాధ్యం కాదట. ఒకవేళ అలాంటివి వాడితే పంట మొత్తం నాశనమవుతుందని తమ పరిశీలనలో తేలిందని ఎన్జీవోలు చెబుతున్నాయి. కేవలం బయో ఎరువులు మాత్రమే వినియోగించి రైతులు ఈ బియ్యాన్ని పండిస్తారు.

వరదలు, ప్రకృతి బీభత్సాలు లాంటి అత్యవసర సమయంలో ఈ బియ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎల్‌పీసీ, సీఈఈ ఎన్జీవోలు చెబుతున్నాయి. సహాయక చర్యల్లో భాగంగా ఆహారపదార్థాల కింద ఈ బియ్యాన్ని పంపిణీ చేస్తే వరద ప్రభావిత ప్రజలకు ఉపయుక్తంగానూ.. అసోం రైతులకు లాభదాయకం గానూ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు