close

వార్తలు / కథనాలు

మాకొద్దు.. మా వారసులకే టికెటివ్వండి!

ఇంటర్నెట్‌ డెస్క్ ప్రత్యేకం‌: ఏపీలో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. పార్టీలు అభ్యర్థుల జాబితాపై దాదాపుగా ఇప్పటికే కసరత్తు పూర్తి చేసి విడుదలకు సిద్ధమవుతున్నాయి. పెండింగ్‌లో ఉన్న జాబితా ఎంపిక బాధ్యతను ఆ పార్టీ సీనియర్ల నాయకులతో నియమించిన సమన్వయ కమిటీలకు అప్పగిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ముఖ్యంగా తెదేపా నుంచి తమ వారసులను బరిలోకి దించాలని కొంత మంది నాయకులు అధినేత చంద్రబాబును కోరుతున్నారు. కొన్ని చోట్ల అధినేత ససేమిరా అంటున్నా మరికొన్ని చోట్ల స్పష్టత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ తమ వారసులను రంగంలోకి దించాలని యోచిస్తున్న నేతలెవరో ఓసారి చూద్దాం..!

జేసీ బ్రదర్స్‌: అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్‌కు గట్టి పట్టుంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇద్దరూ చాలా ఏళ్లుగా కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికలకు ముందు మాత్రం వీరిద్దరూ తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. జేసీ దివాకర్‌రెడ్డిని అనంతపురం ఎంపీ స్థానంలో.. ప్రభాకర్‌రెడ్డిని తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో తెదేపా బరిలోకి దించడం.. వారిద్దరూ విజయం సాధించడం జరిగిపోయాయి. అయితే తాజా ఎన్నికల్లో జేసీ సోదరులిద్దరూ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమ స్థానంలో వారసులకు అవకాశం కల్పించాలని అధినేతను కోరుతున్నారు. ఎంపీ దివాకర్‌రెడ్డి తన తనయుడు పవన్‌కుమార్‌ రెడ్డిని.. ఎమ్మెల్యే ప్రభాకర్‌ రెడ్డి తన కుమారుడు అస్మిత్‌ రెడ్డిని ఎన్నికల బరిలో దించాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు కలిసి తమ స్థానాల్లో వారిద్దరికీ అవకాశం కల్పించాలని కోరారు. దీంతో అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో పవన్‌కుమార్‌రెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ స్థానంలో అస్మిత్‌రెడ్డిలను దించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఎస్పీవై రెడ్డి: గత ఎన్నికల్లో నంద్యాల నుంచి వైకాపా ఎంపీగా గెలుపొందిన ఎస్పీవై రెడ్డి అనంతరం తెదేపాలో చేరారు. గత కొద్దికాలంగా అనారోగ్యం కారణంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు. ఎస్పీవై రెడ్డికి చెందిన పార్టీ వ్యవహారాలను ఆయన అల్లుడు, తెదేపా రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌రెడి పర్యవేక్షిస్తూ వచ్చారు. ఇటీవల ఎస్పీవై రెడ్డి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనారోగ్యం కారణంగా తాను ఎన్నికల్లో పోటీ చేయలేనని.. మహిళా కోటాలో తన కుమార్తె సుజలకు నంద్యాల ఎంపీ స్థానాన్ని కేటాయించాలని కోరారు. అయితే దీనిపై చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

టీజీ వెంకటేశ్‌: తెదేపా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేశ్‌.. ఈ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ టికెట్‌ను తన కుమారుడు భరత్‌కు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఆ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిని నిర్ణయిస్తామని చంద్రబాబు టీజీ వెంకటేశ్‌కు స్పష్టం చేశారు.

పరిటాల సునీత: సొంత నియోజకవర్గం అనంతపురం జిల్లా రాప్తాడు నుంచి తన తనయుడు శ్రీరామ్‌ను బరిలోకి దించాలని భావిస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత చెబుతున్నారు. తమ కుటుంబం, పరిటాల అభిమానుల ఆకాంక్ష మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని.. ఈ విషయాన్ని అధినేతకు చెప్పామని ఆమె తెలిపారు. తమ కుటుంబానికి రెండు సీట్లు కేటాయించాలని చంద్రబాబును కోరామని.. అలా వీలుకాని పక్షంలో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ బరిలో ఉంటారని సునీత స్పష్టం చేశారు.

అయ్యన్నపాత్రుడు: మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నానని.. తన స్థానంలో  కుమారుడు చింతకాయల విజయ్‌కు నర్సీపట్నం నుంచి అవకాశం కల్పించాలని చంద్రబాబును ఆయన కోరుతున్నారు. నర్సీపట్నం కుదరని పక్షంలో అనకాపల్లి లోక్‌సభ సీటు అయినా ఇవ్వాలని అయ్యన్న విజ్ఞప్తి చేస్తున్నారు.

కేఈ కృష్ణమూర్తి: పత్తికొండ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఈసారి తన తనయుడు కేఈ శ్యామ్‌బాబును బరిలోకి దించాలని భావిస్తున్నారు. వయోభారం రీత్యా రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని..తన స్థానంలో శ్యామ్‌బాబు పోటీ చేస్తారని ఇప్పటికే కేఈ కార్యకర్తలకు స్పష్టం చేశారు. కేఈ కృష్ణమూర్తి నిర్ణయానికి అనుగుణంగానే చంద్రబాబు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నుంచి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన కుమారుడు సుధీర్‌కు టికెట్‌ ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారు. క్రియాశీల రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నానని.. అందుకే తన కుమారుడికి టికెట్‌ కేటాయించాలని బొజ్జల చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు.

మురళీమోహన్‌: ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్‌ ఇప్పటికే ప్రకటించారు. తన ట్రస్ట్‌ కార్యకలాపాల పర్యవేక్షణను దృష్టిలో ఉంచుకునే ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ఇదివరకే చంద్రబాబుకు ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో మురళీమోహన్‌ కోడలు మాగంటి రూపను రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దించేందుకు తెదేపా ప్రయత్నాలు చేస్తోంది. తొలుత మురళీమోహన్‌ దీనికి కూడా అంగీకరించలేదు.. అయితే చంద్రబాబు చెప్పడంతో ఆయన ఒప్పుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు