మర్చిపోయిన కూరగాయల్ని పరిచయం చేస్తున్నాడు

వార్తలు / కథనాలు

మర్చిపోయిన కూరగాయల్ని పరిచయం చేస్తున్నాడు

కాలంతోపాటు మనం జీవనశైలిలోనూ ఎన్నో మార్పులొచ్చాయి. విదేశీ పిజ్జాలు, బర్గర్లు మన ఆహార అలవాట్లలో భాగమైమయ్యాయి. దీంతో మన సంప్రదాయ కూరగాయల వంటల రుచి ఇప్పటి యువతకు పెద్దగా నచ్చట్లేదు. ప్రస్తుతం మార్కెట్‌కు వెళ్తే దొండకాయ, వంకాయ, టమాట, బెండకాయ, క్యాబేజీ ఇలా మహా అయితే ఓ 20 రకాల కూరగాయాలు ఉండొచ్చు. పూర్వం ఇవే కాదు.. మరెన్నో కూరగాయాలుండేవి. కానీ కాలక్రమంలో మనం చాలా వాటిని నిర్లక్ష్యం చేశాం. మన పూర్వీకులు వండిన వంటలను మర్చిపోయాం. ఇలా అంతరించిపోతున్న కూరగాయలు, మర్చిపోయిన వంటలను తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఇప్పుడు వెలికితీస్తున్నాడు. బామ్మల కాలం నాటి వంటలను మళ్లీ మనకు పరిచయం చేస్తున్నాడు.

చెన్నైలో ఉండే పాతికేళ్ల ఆకాశ్‌ మురళీధరన్‌ ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చేసి.. ఆ తర్వాత వంటలపై ఆసక్తితో ఇటలీలో ఫుడ్‌ డిజైన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌లో మాస్టర్‌ డిగ్రీ చేశాడు. ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసుకొని చెన్నైకి తిరిగొచ్చాడు. ఓ రోజు ఇల్లు శుభ్రం చేస్తుండగా ఆకాశ్‌ బామ్మ చేసే వంటల రెసిపీ నోట్‌బుక్‌ ఒకటి కంటపడింది. అందులో ఎప్పుడూ తను తినని, వినని కూరగాయలు, వంటల పేర్లు ఉండటం చేసి ఆకాశ్‌ ఆశ్చర్యపోయాడు. వాటిపై మరింత ఆసక్తి కలగడంతో దక్షిణ భారతంలో అంతరించిపోతున్న కూరగాయలపై పరిశోధన చేయాలని, వాటితో చేసే వంటలను అందరికి పరిచయం చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా ‘‘100 డేస్‌ ఆప్‌ కుకింగ్‌’ ప్రాజెక్టు చేపట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌ వేదికగా వంద రోజుల్లో వంద రకాల దక్షిణ భారత కూరగాయాలను నెటిజన్లకు పరిచయం చేయడంతో పాటు వాటిని ఎలా వండాలో తెలిపే నోట్‌ను పోస్టు చేశాడు. 

‘‘మా బామ్మకు చెందిన నోట్‌బుక్‌లో తుమ్మకుట్టై అనే కూరగాయ పేరు చూశా. అది దోసకాయలాగే ఉంటుంది. దాని గురించి నా స్నేహితులను అడిగితే ఎవరూ ఆ పేరే వినలేదన్నారు. మార్కెట్లలో కూడా లభించలేదు. అన్ని మార్కెట్లు గాలిస్తే ఒక చోట లభించింది’’అని ఆకాశ్‌ చెప్పుకొచ్చాడు. చిన్నతనంలో తను ఎక్కువగా వంటగదిలోనే ఎక్కువ సమయం గడిపేవాడట. తన బామ్మ చేసే వంటకాలను ఆసక్తిగా గమనించేవాడట. ఇప్పుడు 100 డేస్‌ ఆఫ్‌ కుకింగ్‌ ప్రాజెక్టు చేయడానికి తన బామ్మే స్ఫూర్తి అని ఆకాశ్‌ అంటున్నాడు. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న