close

వార్తలు / కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
లాక్‌డౌన్‌ 4.0: బయట భద్రమేనా?

ఆరడుగుల దూరం, మాస్క్‌తో శ్రీరామ రక్ష

జనాల్ని కలవడం ఎంత తగ్గిస్తే అంత మంచిది 

‘లాక్‌డౌన్‌ 4.0 చాలా భిన్నంగా ఉంటుంది’- ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన మాట. భిన్నమంటే ఏంటి? గతానికి ఇప్పటికీ తేడా ఏం ఉంటుంది? ఆంక్షలను మరింత సడలిస్తారా? ప్రజా రవాణా మొదలవుతుందా? అంతర్‌ రాష్ట్ర ప్రయాణాలకు అనుమతి ఇస్తారా? అన్ని రకాల దుకాణాలు తెరవొచ్చా? అని అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది.

వైరస్‌ ప్రభావమైతే తగ్గలేదు. మరలాంటప్పుడు ఆంక్షలు సడలిస్తే వ్యాప్తి పెరగదా? 100 మంది మన పక్కనుంచే వెళ్తే భౌతిక దూరం పనిచేస్తుందా? జనాలు కిటకిటలాడే సూపర్‌ మార్కెట్లలో మాస్క్‌లు మేలు చేస్తాయా? పక్కనే కిరాణా దుకాణానికి వెళ్తే సురక్షితమా? మాస్క్‌ లేకుండా ఆరడుగల దూరం పాటిస్తే భయం లేదా? అని అందరిలోనూ సందేహాలు తలెత్తున్నాయి. మరి వీటికి జవాబులు తెలిసేదెలా??


గణాంక మోడల్‌

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు దాంతో కలిసి జీవించక తప్పదు. ఈ విషయం తెలిశాక ప్రభుత్వాలు వ్యూహాలు మారుస్తున్నాయి. సంరక్షణ జాగ్రత్తలు పాటిస్తూనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. మెల్లమెల్లగా ఆంక్షలను సడలిస్తున్నాయి. ఒకవైపు ప్రజలు, ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. వైరస్‌ ఉద్ధృతి తగ్గకపోవడంతో పైన పేర్కొన్న సందేహాలే అందరికీ వస్తున్నాయి. ఎంఐటీలో అంటువ్యాధుల గొలుసుపై పరిశోధనలో పాలుపంచుకున్న ఎలీనా పొలొజొవో ఓ గణాంక మోడల్‌ ద్వారా వీటికి సమాధానలు ఇచ్చేందుకు ప్రయత్నించారు.


ప్రమాణాలివీ..  

ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఇతరులను కలిసేందుకు వీలవ్వదు. భౌతిక దూరం, ఆరడుగుల దూరం పాటించేందుకు కుదిరింది. జన సమూహాలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఆంక్షలు సడలిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఎలీనా చెప్పాలనుకున్నారు. మన పక్క నుంచి నాలుగు అడుగుల దూరంలోనే మరొకరు వెళ్తే ఏంటి? సమావేశం సమయాన్ని బట్టి వైరస్‌ రిస్క్‌ ఎంత ఉంటుంది? ఒక భారీ సూపర్‌ మార్కెట్‌, పక్కనే కిరణా షాపులో ఏది ప్రమాదకరం? మాస్క్‌ వేసుకున్నప్పుడు ప్రమాదతీవ్రతలో మార్పు ఉంటుందా? వైరస్‌ ఉన్న ఒక ఉపరితలం ముట్టుకొని ముఖాన్ని స్పర్శిస్తే? ఒక కొవిడ్‌ రోగి మీ పక్కనుంచి వెళ్తూ నిశ్వాసిస్తే ఉండే తుంపర్ల విస్తరణ, గాల్లోని అణువుల ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ తీసుకొని పెద్ద, చిన్న గదుల్లో పరిస్థితులను ఆమె ప్రమాణాలుగా  ఎంచుకున్నారు.


సగం తీవ్రత తగ్గినట్టే 

మీరున్న ప్రాంతంలో వైరస్‌ తీవ్రత రెండు రెట్లు ఉంటే మీరు బయటకు వెళ్లినప్పుడు ఉండే రిస్క్‌ రెండు రెట్లని ఎలీనా అంటున్నారు. మీరు నడుస్తున్నప్పుడు పక్కనే నడిచే జనాలు సగం మంది తగ్గితే సగం ప్రమాదం తగ్గినట్టే. ఉపరితలాలను ఎక్కువ సార్లు శానిటైజ్‌ చేస్తే రిస్క్‌ ఇంకా తగ్గుతుంది. సర్జికల్‌ మాస్క్‌ ద్వారా 90 శాతం వైరల్‌ పదార్థాలను నివారించొచ్చు. ఇది 10 రెట్లు రక్షణ కారకం అవుతుంది. అదే టీషర్ట్‌ మాస్కైతే 70% పదార్థాలను తగ్గిస్తుంది. ఆరడుగులు/రెండు గజాల దూరం ఎప్పటికీ సురక్షితంగా ఉంచుతుంది. మీరు నడుస్తున్నప్పుడు పక్కన వెళ్లేవారు 4 అడుగుల దూరంలో ఉంటే తీవ్రత ఎక్కువ. అలా ఎందరు వెళ్తే అంత ప్రమాదం ఉంటుంది. అదే మాస్క్‌ వేసుకొని అందరూ వెళ్తే భద్రత ఎక్కువ.


పక్క నుంచి నడిస్తే 

మన పక్కనున్న వారు ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటారన్న అంశంపై ప్రమాదం తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అవతలి వారు రెండుసార్లు శ్వాస తీసుకుంటారని అనుకుంటే 10, 30, 100.. ఎంత మంది మన పక్కనుంచి వెళ్తే అంత ప్రమాదం అన్నమాట. ఆరు కన్నా నాలుగు అడుగు దూరంలోని వారు మాస్క్‌ లేకుండా దగ్గినా, తుమ్మినా రిస్క్‌ ఎక్కువ. అంటే 4 అడుగుల దూరంలో 100 మంది వెళ్తే అందరూ దగ్గితే కొవిడ్‌ సోకే అవకాశం 19% ఉంటుంది. అదే 6 అడుగులైతే ఇది 0.8 శాతానికి పడిపోతుంది. అంటే ఆరడుగులు, మాస్క్‌ ఇచ్చే రక్షణ ఎంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు.


సమావేశమైతే

సమావేశమైనప్పుడు అవతలి వారి శ్వాసను దగ్గినట్టుగా పరిగణించి లేదా కేవలం మాట్లాడితే కరోనా సోకే అవకాశం ఎంత ఉంటుందో ఎలీనా లెక్కించింది. ఒక మనిషి నిమిషానికి 16 సార్లు శ్వాస తీసుకుంటాడని ఆమె అంచనా వేసింది. 100 మంది మాస్కుల్లేకుండా అదే పనిగా దగ్గుతున్నారనుకుందాం. అప్పుడు 15 నిమిషాలతో పోలిస్తే గంట తర్వాత ప్రమాదం తీవ్రత 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. అందుకే ఎంత తక్కువ సమయం కలిస్తే అంత మంచిది. అదే ఆరడుగల దూరం ఉండి మాస్క్‌ ధరించి దగ్గకుండా మాట్లాడితే 30 సెకన్లు అయినా 3 గంటలైనా రక్షణ ఒకేలా ఉంటుంది.


కిరాణం-సూపర్‌ మార్కెట్‌ 

ఎందరు వస్తున్నారు? ఎన్ని వస్తువులను ముట్టుకుంటున్నారు? మాస్క్‌ ధరించారా లేదా? తరచూ శానిటైజ్‌ చేశారా అన్న అంశాలపై ఆధారపడి చిన్న కిరాణం లేదా సూపర్‌ బజార్‌లో ఏది సురక్షితమో చెప్పొచ్చని ఎలీనా అంటోంది. భౌతిక దూరం పాటించకుండా ఎక్కువ మంది మధ్యలో ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఒంట్లో బాగాలేని వారు ముట్టుకున్నా, దగ్గినా తీవ్రత ఎక్కువే. ఎలా చూసినా పెద్ద స్టోర్లకే జనం ఎక్కువ వెళ్తారు కాబట్టి రిస్క్‌ ఎక్కువ. అయితే శానిటైజ్‌తో ఆ ప్రమాదం తగ్గించొచ్చు. ఈ గణాంక మోడల్‌లో కొన్ని సహేతుకంగా అనిపించకపోవచ్చని ఎలీనా తెలిపింది. అయితే బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ప్రజలకు తెలియాలి. అందుకు ఈ మోడల్‌ ఉపయోగపడుతుందని ఆమె ఉద్దేశం. ఏ విధంగా చూసినా ఆరడుగుల దూరం, మాస్క్‌ చేసే మేలు అంతా ఇంతా కాదని ఆమె నొక్కి చెబుతోంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు