రువాండా.. మహిళలదే ఆధిక్యం..

వార్తలు / కథనాలు

రువాండా.. మహిళలదే ఆధిక్యం..

రువాండా.. మధ్య ఆఫ్రికాలోని ఒక చిన్నదేశం.. ఆఫ్రికా దేశాల్లో పురుషాధిపత్యం ఎక్కువగా ఉంటుంది. మహిళలపై దాడులు సాధారణం.. అయితే రువాండా పార్లమెంటులో మహిళల ప్రాతినిథ్యం దాదాపు 64 శాతానికి మించివుండటం గమనార్హం.  వాస్తవానికి రువాండాలో30 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్‌ చేశారు. కానీ అంతకంటే ఎక్కువగా మహిళలు ప్రాతినిథ్యం వహిస్తుండటం విశేషం. ప్రపంచంలో మహిళల హక్కులకు ఐస్‌లాండ్‌, స్వీడన్‌, నార్వే , ఫిన్లాండ్‌ దేశాలు అగ్ర పీఠం వేస్తున్నాయి. రువాండా రికార్డు ఈ దేశాల్లోనూ సాధించకపోవడం ఆశ్చర్యకరమే.

ఎలా సాధ్యమైంది..
1994లో రువాండాలో జాతుల ఘర్షణ జరిగింది. ఈ మారణహోమంలో దాదాపు 10 లక్షలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని లక్షలమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి.  అనంతరం  అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు పాల్‌ కిగామే సారథ్యంలో దేశంలో సంస్కరణలు తీసుకువచ్చారు.  సమాజంలో సంకుచిత భావాల నుంచి బయటపడాలంటే మహిళలకు విద్యతో పాటు అధికారం ముఖ్యమని ఆయన భావించారు. దీంతో దేశం నలుమూలల్లో బాలిక విద్యకు అధికారయంత్రాంగం రంగంలోకి దిగింది. తరువాత 2003లో కొత్త రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకువచ్చారు.  దీని ప్రకారం దిగువ సభ ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీస్‌లో మొత్తం 84 సీట్లు ఉండగా 24ను మహిళలకు రిజర్వ్‌ చేశారు.  జాతుల ఘర్షణలతో లక్షలమంది పురుషులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహిళల జనాభా పెరిగింది. బాలికా విద్యతో పాటు పలు చైతన్య కార్యక్రమాలతో మహిళలు రాజకీయ రంగంలోకి ప్రవేశించారు. ఓటర్లు కూడా మహిళల నాయకత్వంపై నమ్మకముంచారు. దీంతో వారి ప్రాతినిధ్యం పెరిగింది. దీంతో పాటు పలు కీలక పోస్టుల్లో మహిళలను నియమించారు. 

శ్రమశక్తిలోనూ వారే..

దేశంలోని మొత్తం శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం 80 శాతానికి పైగా ఉంది.  శ్రామిక రంగంలో ఉన్న మహిళలు తమ కుటుంబబాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నారు. పార్లమెంటులోనూ మహిళలు ఎక్కువగా ఉండటంతో మహిళల అభ్యున్నతికి అవసరమైన చట్టాలు తీసుకువచ్చారు. వేతనంతో కూడిన 90 రోజుల సెలవును ప్రసూతిసెలవు కింద ఇస్తున్నారు. రాజకీయ రంగంలోనూ మహిళల ప్రాతినిధ్యం పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతుల ఘర్షణలో సర్వం కోల్పోయిన రువాండా మళ్లీ సగర్వంగా అంతర్జాతీయ వేదికపై దూసుకువచ్చిందంటే అందుకు మహిళలే ప్రధాన కారణం.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న