close

వార్తలు / కథనాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇక్కడే 11 లక్షలమందిని చంపేశారు..

చిన్నారి షెండికి ఏమీ అర్థం కావడం లేదు.. అందరూ ఇంట్లోని సామాన్లను సర్దుకుంటున్నారు.. ఇంతలో తలుపులపై గట్టిగా శబ్దం.. త్వరగా రెడీ కావాలంటూ అధికారంతో నిండిన గొంతు హెచ్చరిక.. వెంటనే షెండి తల్లిదండ్రులు తమ వస్తువులను తీసుకొని కుమార్తెతో పాటు  బయటకొచ్చేశారు.. అది  ఐరోపాలోని ఒక చిన్న పట్టణం.. నగరంలో ఉన్న 1200 మంది యూదు జాతీయులను బయలుదేరమని జర్మన్‌ నాజీలు ఆదేశించారు.  అయితే తాము వెళ్లబోయేది మృత్యుకేంద్రానికి అని వారికి తెలియదు.. తమ దేశాన్ని ఆక్రమించిన నాజీలు తమను దూరంగా ఉండే కర్మాగారాల్లో పనిచేసేందుకు తీసుకువెళుతున్నారని వారు భావించారు. వెంటనేవారిని ఒక గూడ్సురైలులో పోలండ్‌లోని ఆష్‌విజ్‌కు తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే వేలాదిమంది యూదులున్నారు. 

ఆష్‌విజ్‌ లక్షలాది హత్యలకు వేదిక..

1939లో పోలండ్‌ను నాజీ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. ఐరోపాలోని యూదులతో పాటు నాజీ వ్యతిరేకమైన ఇతర  జాతీయులను నిర్మూలించాలన్న హిట్లర్‌ యోచన కార్యరూపం దాల్చింది. పోలండ్‌లోని ఆష్‌విజ్‌లో ఒక కర్మాగారం లాంటి బందీఖానను నిర్మించారు. యూరప్‌లోని పలు దేశాలను ఆక్రమించిన నాజీలు అక్కడ ఉన్న యూదులను కుటుంబాలతో సహా ఇక్కడకు పంపించేవారు. అక్కడ వారిని గ్యాస్‌ ఛాంబర్లకు పంపించి సామూహికంగా హత్య చేసేవారు. 

బలహీనంగా కనిపిస్తే చాలు..
 అప్పటికే గూడ్సురైలు ప్రయాణంలో నీరసపడిన యూదులు ఇక్కడకు చేరుకోవగానే వైద్య పరీక్షలు నిర్వహించేవారు. బలహీనంగా ఉన్న వారిని గ్యాస్‌ ఛాంబర్లకు పంపించేవారు. వారికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు ఎలాంటి అంటురోగాలు రాకుండా పరీక్షలకని నమ్మించేవారు. ఒక వేళ దీన్ని ఎవరైనా పసిగట్టి పారిపోవాలని యత్నిస్తే  జాగిలాలు వెంటపడేవి. వారిని సైనికులు కాల్చిచంపేవారు. 

15 నిమిషాల్లోనే 2000 మందిని చంపేవారు..

గ్యాస్‌ ఛాంబర్లలోకి ఒక్కో దఫాలో 2 వేలమంది వరకు పంపించేవారు. వీరిని చంపేందుకు నాజీలు ప్రత్యేకమైన విషవాయువులను తయారుచేశారు. దాదాపు 15 నిమిషాల్లో ఈ వాయువులను పీల్చినవారు మృత్యు ఒడికి  చేరుకునేవారు.  అనంతరం శవాలపై  బంగారు ఆభరణాలుంటే సైనికులు దోచుకునేవారు. ఇక్కడ దాదాపు 11 లక్షలమందిని చంపివేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఒక నెల బిడ్డ నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు ఎలాంటి జాలి లేకుండా చంపివేశారు.   వీరిలో యూదులతో పాటు 75 వేలమంది పోలిష్‌ జాతీయులు, 21 వేల రోమా జాతీయులు, 14 వేలమంది సోవియట్‌ యుద్ధఖైదీలు ఉన్నారు.

సోవియట్‌ ప్రవేశంతో విముక్తి..

1945లో రెండో ప్రపంచయుద్ధం ముగిసింది. లక్షలాదిమంది మృతికి కారణమైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. రష్యన్‌సేనలు  ఇక్కడ ప్రవేశం చేసి బందీలను విముక్తి చేశారు. అయినవారు అందరూ  చనిపోగా మిగిలి ఉన్న  కొందరు జీవచ్ఛవాలుగా మిగిలారు.1945 జనవరి 27న ఆష్‌విజ్‌ను రష్యన్‌ సేనలు విముక్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఊచకోతలో బలైన లక్షలాదిమంది జ్ఞాపకార్థం యూరప్, అమెరికా, ఇజ్రాయెల్‌లో పలు కార్యక్రమాలు నిర్వహించారు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు