close

వార్తలు / కథనాలు

వానా.. వానా.. ఎందుకు రాలేదప్పా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రైతుల మనస్సులను పులకరింప చేయాల్సిన  నైరుతి రుతుపవనాలు దాగుడుమూతలాడుతున్నాయి. కేరళను తాకి ఐదారు రోజులవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వాటి పత్తా లేదు.  భౌగోళిక పరిస్థితుల ఆధారంగానే రుతుపవనాల గమనం ఉంటుంది.   కానీ, గత రెండు మూడేళ్లుగా  రుతుపవనాల రాకలో జాప్యం జరుగుతోంది. దీనికి గల కారణాలను ఓ సారి పరిశీలిస్తే..!

గ్లోబల్‌ వార్మింగ్‌ 

సాధారణంగా వేసవి కాలంలో సముద్ర జలాలు వేడెక్కి.. అవిరై పైకిపోయి మేఘాలు ఏర్పడతాయి. ఇవి గాలితో పాటు ప్రయాణిస్తూ ఉంటాయి. చల్లని గాలులు తగిలి అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు ఈ మేఘాలు వర్షిస్తాయి. కానీ, తాజా పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు. రోజు రోజుకూ భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీనికి గ్లోబల్‌ వార్మింగ్‌ కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల గాలిలోని  తేమ శాతం తగ్గిపోయి రుతుపవనాల గమనానికి ప్రతికూలంగా తయారవుతోంది.

ప్లాస్టిక్‌ వాడకం

ప్రపంచంలో నానాటికీ ప్లాస్టిక్‌ వాడకం పెరిగిపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఏడాదికి 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నారని పరిశోధనల్లో తేలింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రంలో గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. అంతేకాకుండా సముద్రంలో ఏర్పడిన అకాల తుపానులు కూడా సాధారణ వాతావరణ పరిస్థితులను దెబ్బ తీస్తున్నాయి. ఫలితంగా రుతుపవనాల కదలికల్లో తేడాలొస్తున్నాయి.

చెట్ల నరికివేత

పారిశ్రామికీకరణ పేరుతో అడవులను నరికివేస్తున్నారు. ఎక్కడిక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. దీంతో వాయు, జలకాలుష్యం జరుగుతోంది. అంతేకాకుండా వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్‌ శాతం పెరిగిపోయి గ్లోబల్‌ వార్మింగ్‌కు దారితీస్తోంది.  దీని ప్రభావం వల్ల కాలాలు, రుతువుల్లో తేడాలొస్తున్నాయి. అకాల వర్షాలు, తుపానులు ఏర్పడటానికి కూడా ఇదే కారణమంటున్నారు శాస్త్రవేత్తలు.

ఎల్‌నినో ప్రభావం

రుతుపవనాలు సరైన సమయంలో రాకపోవడానికి ఎల్‌నినో కూడా కారణమంటున్నారు శాస్త్రవేత్తలు. దక్షిణ అమెరికా పశ్చిమ దిశలోని పసిఫిక్‌ మహా సముద్రం ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోవడాన్ని ఎల్‌నినో అంటారు. దీనివల్ల గాలులు వీచే తీరులో తేడాలు వచ్చి భారత్‌, ఇండోనేషియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో రుతుపవనాలు బలహీనపడి వర్షపాతం తగ్గుతుంది.

విచ్చలవిడిగా గనుల తవ్వకం..

 

అనాదిగా దేశంలోని కొండలు, గుట్టలు, పర్వతాలపై ఉన్న పచ్చదనం రుతుపవనాలు వర్షించేందుకు వీలుగా అవకాశం కల్పిస్తున్నాయి. అయితే గత మూడు దశాబ్దాలుగా అభివృద్ధి పేరుతో వీటిని ధ్వంసం చేస్తున్నారు. గనుల తవ్వకం పేరుతో విలువైన ఖనిజాలను తరలిస్తున్నారు. దేశ రాజధాని దిల్లీకి వాయువ్యంలో సరిహద్దుగా ఉండే ఆరావళి పర్వతాల్లో కనీసం 30కు పైగా గుట్టలను అక్రమార్కులు కనుమరుగు చేశారని అధ్యయనంలో వెల్లడయింది. ఇదే తరహా విధ్వంసం దేశమంతటా జరుగుతోంది. దీంతో వర్షపాతానికి అనుకూలమైన వాతావరణం లేకపోవడంతో రుతుపవనాలు వర్షించడం లేదు.

అధిక ప్రభావం భారత్‌పైనే..

నైరుతి రుతుపవనాల ప్రభావం భారత్‌పైనే ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా దక్షిణభారత దేశంలో నైరుతి రుతుపవనాల ప్రకారమే ఇక్కడి  రైతులు వ్యవసాయం చేస్తుంటారు. ఖరీఫ్‌ సీజన్‌ అంతా నైరుతి వర్షాధారంపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జూన్‌ తొలి వారంలోనే రుతుపనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అక్కడి నుంచి కర్ణాటక మీదుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విస్తరిస్తాయి. ఒడిశా, పశ్చిమబెంగాల్‌ మీదుగా ప్రయాణం సాగిస్తాయి.  

ఈ నెల 8న కేరళ తీరాన్ని దాటాయి. అయితే అరేబియా సముద్రంలో  ఏర్పడిన ‘వాయు’ తుపాను కారణంగా  వీటి గమనం మందకొడిగా కొనసాగుతోంది. కర్ణాటకలో ప్రవేశించి ఈ నెల 19, 20 తేదీల్లో తెలుగు రాష్ట్రాలకు విస్తరించవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు