close

వార్తలు / కథనాలు

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

ఇంటర్నెట్‌డెస్క్: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భద్రతపరంగా‌ ఇటీవల చాలా సమస్యలు ఎదుర్కొంటోంది. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతోందంటూ ఈ మధ్యకాలంలో పెద్ద దుమారమే రేగింది. దీని సెగలు సంస్థ సీఈవో మార్క్‌ జూకర్‌ బర్గ్‌నూ తాకి, క్షమాపణలు కూడా చెప్పించాయి. సాంకేతికపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ యూజర్లు హ్యాకింగ్‌ భూతానికి తారసపడక తప్పడం లేదు. కొందరు హ్యాకర్లు సమాచారాన్ని దొంగలిస్తే.. మరికొందరు అసభ్యకర సందేశాలను మీ అకౌంట్‌ ద్వారా పంపించి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే హ్యాకర్ల బారినుంచి తప్పించుకోవచ్చు. అవేంటో చూద్దామా మరి?

 
 

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

 
 
 
 
 
 
 
హ్యాకింగ్‌కు గురైందని తెలుసుకోవడమెలా?

 

మన ఖాతా హ్యాకింగ్‌కు గురైందని తెలిస్తే ఏదోవిధంగా జాగ్రత్త పడొచ్చు. అసలు మనం దీని బారిన పడినట్లు గుర్తించడమెలా? ఇది చాలా సులభం. మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత మెనూ- సెట్టింగ్స్‌- సెక్యూరిటీ అండ్‌ లాగిన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ మీరు ఇప్పటి వరకు ఏయే డివైస్‌ నుంచి లాగిన్‌ అయ్యారో డిస్‌ప్లే అవుతుంది. ఒక వేళ ఇతరులు మీ ఖాతాలోకి చొరబడితే ఇక్కడ తెలిసిపోతుంది.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

పాస్‌వర్డ్‌ మార్చేయండి!

సాధారణంగా మీ ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసిన వెంటనే అవతలి వ్యక్తి పాస్‌వర్డ్‌ను మార్చేస్తాడు. ఒక వేళ అలా జరగకపోతే... వెంటనే మీరు మార్చేయండి. దీనికోసం సెట్టింగ్స్‌- సెక్యూరిటీ లాగిన్‌- చేంజ్‌ పాస్‌వర్డ్‌ ఎంపిక చేసుకొని, పాత పాస్‌వర్డ్‌, కొత్తపాస్‌ వర్డ్‌ ఎంటర్‌ చేసిన తర్వాత ‘సేవ్ సెట్టింగ్స్‌’ పై క్లిక్‌ చేయాలి.‌ అనంతరం ‘లాగ్‌ అవుట్‌ ఆఫ్‌ ఆల్‌ సెషన్స్‌’ ఎంచుకోవాలి. దీనివల్ల మరోసారి హ్యాకర్‌ మీ ఖాతాలోకి ప్రవేశించలేడు.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

అలాకాకుండా హ్యాకర్‌ మీ పాస్‌వర్డ్‌ను మార్చేశాడు అనుకుందాం. అయినా భయపడాల్సిన పని లేదు. పేస్‌బుక్‌ హోం పేజీలో లాగిన్‌ ఆప్షన్‌ దిగువన ఉన్న ‘ ఫర్‌గాట్‌ పాస్‌ వర్డ్‌’ అప్షన్‌ను ఎంచుకోండి. ఫేస్‌బుక్‌ ఖాతాకు అనుసంధానించిన ఈ మెయిల్‌, మొబైల్‌ నెంబర్‌ ద్వారా కొత్త పాస్‌వర్డ్‌ను జనరేట్‌ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మీ ఖాతాను గుర్తించాలి. మొబైల్‌ నెంబర్‌ లేదా ఈ మెయిల్‌ అడ్రస్‌ను ఉపయోగించి అకౌంట్‌ను సెర్చ్‌ చేయాలి. మీ అకౌంట్‌ను గుర్తించి.. దానికి అనుసంధానించిన మెయిల్‌కు రికవరీ కోడ్‌ను పంపడం ద్వారా పాస్‌వర్డ్‌‌ను మార్చుకునే అవకాశముంది.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

ఫేస్‌బుక్‌కు రిపోర్ట్‌ చేయండి

మీ అకౌంట్‌ను హ్యాక్‌ చేసి.. దాని నుంచి మీ స్నేహితులకు అనుచిత సందేశాలు, వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తున్నారు అనుకుందాం. వెంటనే దీనిపై మీరు ఫేస్‌బుక్‌కు రిపోర్టు చేయాలి. వారు మీ సమస్యను విశ్లేషించి పరిష్కారం చూపిస్తారు. దీనికోసం సెట్టింగ్స్‌ ఆప్షన్‌ ఎంచుకొని పేజీ దిగువ భాగంలో ఉన్న ‘హెల్ప్‌’పై క్లిక్‌ చేయాలి. అనంతరం పాలసీ‌ అండ్‌ రిపోర్టింగ్‌- హ్యాక్‌ అండ్‌ ఫేక్‌ అకౌంట్స్‌- హ్యాక్డ్‌ అకౌంట్స్‌- విజిట్‌ దిస్‌ పేజ్‌’ ఎంపిక చేసుకొని, మనం ఎదుర్కొంటున్న సమస్యకు సరైన పరిష్కారాన్ని పొందొచ్చు.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

అనుమానిత అప్లికేషన్లను తొలగించండి

హ్యాకర్స్‌ మన ఖాతాలను తస్కరిస్తారు. కానీ, కొన్ని సార్లు మనమే వారికి ఆ అవకాశాన్ని కల్పిస్తుంటాం. ఎలా అంటే.. మన ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసినప్పుడు రకరకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. అందులో వైరస్‌ ఫైల్స్ కలిగిన ప్రకటనలు‌ కూడా ఉండొచ్చు. పొరపాటునైనా మనం దానిపై క్లిక్‌ చేస్తే.. సదరు అప్లికేషన్‌ మన డివైస్‌లో ఇన్‌స్టాల్‌ అయిపోతుంది. అది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్‌ అవుతూ‌ వ్యక్తిగత విషయాలను దొంగలిస్తుంది. అందువల్ల డివైస్‌లో ఏవైనా అనుమానిత అప్లికేషన్లు ఉన్నట్లు గుర్తిస్తే.. వెంటనే వాటిని తొలగించాలి. దీనికోసం ‘సెట్టింగ్స్‌- యాప్స్‌ అండ్‌ వెబ్‌సైట్స్‌- యాక్టివ్‌ యాప్స్‌ అండ్ వెబ్‌సైట్స్‌’ ఎంచుకోవాలి. ఏవైనా అనుమానిత యాప్స్‌ ఉన్నట్లయితే వాటిని సెలెక్ట్ చేసుకొని డిలీట్‌ చేయవచ్చు.

నష్ట నివారణ చర్యలు చేపట్టండి

మీ అకౌంట్‌ హ్యాకింగ్‌ బారిన పడి, మీరు లాగిన్‌ కాలేకపోతున్నట్లయితే... వెంటనే నష్ట నివారణ చర్యలు ప్రారంభించండి. మీ అకౌంట్‌ హ్యక్‌ అయినట్లు ఈ మెయిల్స్‌ లేదా ఫోన్‌ ద్వారా మ్యూచువల్‌ ఫ్రెండ్స్‌కి సమాచారం అందించండి. దీనివల్ల హ్యాకర్‌ మీ అకౌంట్‌ ద్వారా అనుచిత సందేశాలు పంపించినప్పటికీ మిమ్మల్ని ఎవరూ అపార్థం చేసుకునే వీలుండదు.

ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయితే..

మరింత భద్రత అవసరం

హ్యాకింగ్‌కు గురైన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ మళ్లీ మీ ఆధీనంలోకి వచ్చాక. దానికి మీరు దానికి మరింత భద్రత కల్పించాలి. జనరల్‌ సెట్టింగ్స్‌ కేటగిరీలో మీ కాంటాక్ట్‌, అదనపు రికవరీ ఈమెయిల్‌, ఫోన్‌ నెంబర్‌లను అప్‌డేట్‌ చేసుకోండి. ‘సెక్యూరిటీ అండ్‌ లాగిన్‌ సెట్టింగ్స్‌’ ద్వారా అదనపు రక్షణ కల్పించండి. దీనివల్ల మీ అకౌంట్‌లోకి ఇతర బ్రౌజర్ల నుంచి లాగిన్‌ అయినట్లయితే అలెర్ట్‌ మెసేజ్‌ వస్తుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్‌ లిస్ట్‌ నుంచి మూడు నుంచి ఐదుగురు నమ్మదగిన ఫ్రెండ్స్‌ని ఎంపిక చేసుకోండి. మీ అకౌంట్‌ లాక్‌ అయితే వారి ద్వారా అన్‌లాక్‌ చేసుకునే వీలుంటుంది. ‘ప్రైవసీ సెట్టింగ్స్‌’ ద్వారా మీ పోస్టులను కొంత మందికి మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు