ప్రభుత్వం కోసం చూడకుండా..ప్రాణాలు కోల్పోకుండా!

వార్తలు / కథనాలు

ప్రభుత్వం కోసం చూడకుండా..ప్రాణాలు కోల్పోకుండా!

దాతల సొమ్ముతో 13 గ్రామాల ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్‌

ఆదర్శంగా నిలుస్తున్న మొహాలీ డిప్యూటీ కమిషనర్‌ ఆలోచన

ఇంటర్నెట్‌ డెస్క్: ఓ పక్క కరోనా మహమ్మారి ప్రళయాగ్నిలా వ్యాపిస్తోంది. దాని నుంచి తప్పించుకుందామన్నా వ్యాక్సిన్‌ల కొరత వేధిస్తోంది. కాస్తోకూస్తో పలుకుబడి ఉన్నవాళ్లు ఏదో విధంగా టీకా వేయించుకుంటున్నా.. సామాన్యులకు అవసరమైనంత మేర వ్యాక్సిన్‌ లభ్యం కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని మొహాలీ డిప్యూటీ కమిషనర్‌ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. ఎంతో మంది అభాగ్యులకు ఉచితంగా టీకాలు వేయిస్తూ శభాష్‌ అనిపించుకుంటున్నారు. ఈ ఆపత్కాలంలో నేనున్నానంటూ అందరికీ భరోసా ఇస్తున్నారు. అయితే అది ఆయన ఒక్కరి వల్లే సాధ్యం కాలేదు.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా టీకా ప్రాధాన్యత ప్రత్యేకించి చెప్పక్కనర్లేదు. ఎడారిలో ఒయాసిస్‌లా ప్రాణాలపై ఆశలు పుట్టిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌కు కొరత ఏర్పడినప్పటికీ మొహాలీలోని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రం అసలు వ్యాక్సిన్‌ సమస్యే కనిపించడం లేదు. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది. డిప్యూటీ కమిషనర్‌ గిరీశ్‌ దయాలన్‌ ఆలోచనే దీనికి కారణం. కొవిడ్‌ సోకి సకాలంలో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆయన్ని కలచి వేశాయి. అందరికీ వ్యాక్సిన్‌ వేయడమే దీనికి సరైన పరిష్కారమని అనుకున్నారాయన. అయితే సొంత డబ్బుతో వ్యాక్సిన్లు కొనుగోలు చేసి వేయించడం అంత సామాన్యమైన పని కాదు. ఎవరో వచ్చి వ్యాక్సిన్లు వేస్తారనుకుంటే ఈలోగా ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయో తెలియదు. దీంతో ప్రయోగాత్మకంగా తోటి అధికారులతో కలిసి ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ ఊర్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేయించారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించి అక్కడి నుంచే సొంత డబ్బుతో వ్యాక్సిన్లు కొనుగోలు చేశారు. ఆ విషయం ఆ నోటా ఈ నోటా చుట్టుపక్కలా వ్యాపించింది.

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద ప్రైవేటు సంస్థలు, కొందరు వ్యక్తులు కొంత మొత్తాన్ని ఖర్చు చేస్తుంటారు. గిరీశ్‌ దయాలన్‌ ఆలోచనను మెచ్చిన కొందరు ఆయనకు బాసటగా నిలిచారు. సీఎస్‌ఆర్‌లో జమచేయాల్సిన మొత్తాన్ని వ్యాక్సిన్‌ కొనుగోలు చేసేందుకు గిరీశ్‌కు అందించారు. దీంతో తన సేవలను మరింత విస్తృతం చేసే అవకాశం లభించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎలా జరుగుతుందో ఆయా గ్రామాల్లో పర్యటించి, చూసే అవకాశం కూడా దాతలకు గిరశ్‌ కల్పించారు. వారు స్వయంగా ఆయా గ్రామాలకు వెళ్లి వ్యాక్సినేషన్‌ తీరును పర్యవేక్షించేలా చిన్నపాటి బాధ్యతను అప్పగించారు. దీంతో తమ సొంత డబ్బుతో ప్రజలకు టీకాలు వేయగలుగుతున్నామన్న ఆత్మసంతృప్తి వారిలో కలిగింది. దీంతో మరికొందరు దాతలు మరి కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం మొదలు పెట్టారు. ఇలా ఒక గ్రామంతో మొదలైన వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండు వారాల్లో 13 గ్రామాలకు విస్తరించింది.

కనీసం ఒకరికి వ్యాక్సిన్‌ వేయించాలనుకునేవారు ఒక డోసుకు రూ.430 చెల్లించాలి. అదే డోసు ప్రైవేటుగా కొంటే దాదాపు రూ.1000 వరకు ఉంటుంది. అందువల్ల వ్యాక్సిన్‌ ప్రైవేటుగా కాకుండా నేరుగా కేంద్రం నుంచి రూ.430కే కొనుగోలు చేసి సామాన్య ప్రజలకు అందిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలే అందరికీ వ్యాక్సిన్‌ వేయాలంటే కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఈలోగా ఎంత ప్రాణనష్టం జరుగుతుందో ఊహించడం కష్టం. కానీ, ఈ విధంగా సామాజిక బాధ్యతగా కొందరు ముందుకు వస్తే వ్యాక్సినేషన్‌లో జాప్యం లేకుండా చేయవచ్చనడంలో ఎలాంటి సందేహం లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న