close

వార్తలు / కథనాలు

లైట్‌ లైట్‌గా.. లైట్ యాప్స్‌

మీ ఫోన్‌ కోసం ఏడు అప్లికేషన్లు

స్మార్ట్‌ఫోన్లు మానవ జీవితాల్లో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. ఎంతగా అంటే అవి లేకపోతే ఏ పని జరగలేనంతగా. మరి ఈ ఫోన్లను ఇంకా అందంగా మలిచాయి రకరకాల అప్లికేషన్లు. ఇప్పుడు ఈ అప్లికేషన్లతో ఎన్నో సేవలు మనకు అందుతున్నాయి. వీటిల్లో చాలా వరకు నిత్య జీవితంతో ముడిపడి ఉన్నవే. అయితే మన స్మార్ట్ ఫోన్‌లో ‘ర్యామ్‌’ మెమొరీ ఆధారంగానే అప్లికేషన్లు ఇన్‌స్టాల్‌ చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఒక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే అది ఎంత మెమొరీ ఉందన్న విషయాన్ని వాకబు చేసిన తర్వాతే ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. యాప్‌ అవసరమై ఉండి ఎక్కువ మెమొరీ ఆక్రమిస్తేనే అసలు సమస్య. కొన్ని యాప్స్‌ ఇంటర్నెట్‌ వేగం ఎక్కువగా ఉంటేనే పని చేస్తాయి. మరికొన్ని మీ ఫోన్‌ బ్యాటరీ కాలాన్ని హరించి వేస్తాయి. ఇలాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని తక్కువ మెమొరీ, సాధారణ ఇంటర్నెట్‌ వేగం, బ్యాటరీని తక్కువగా వాడే కొన్ని యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ టాప్‌లో ఉన్న ఏడు యాప్స్‌ గురించి ఓ లుక్కేద్దామా..

‘ఉబర్‌ లైట్‌’ తో ప్రయాణం తేలిక

మారుతున్న రోజుల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు ప్రయాణించడం చాలా సులభమైంది. క్యాబ్‌ బుక్‌ చేయాలంటే ఒకప్పుడు ఎక్కువ మెమొరీ ఉన్న యాప్స్‌ను వాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయా కంపెనీలు యాప్స్‌ను తక్కువ మెమొరీతోనే యాప్స్‌ను తీసుకొచ్చాయి. అందులో మొదటిది ‘ఉబర్‌ లైట్’ యాప్‌. కేవలం 5ఎంబీతోనే ఇది మీ ఫోన్‌లో రన్‌ అవుతుంది. దీంతో ప్రయాణికులు తేలికగా రైడ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఇండియాలో ‘ఉబర్ లైట్’ ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.

‘ఓలా లైట్‌’.. మీరు రైట్‌ రైట్

‘ఉబర్‌ లైట్‌’ యాప్‌ మాదిరిగానే ‘ఓలా లైట్‌’ కూడా రైడ్ బుక్‌ చేసుకునే యాప్‌. మీ ఇంటి నుంచి ఆఫీస్‌కో, మరో ప్రదేశానికో, టూర్‌కు వెళ్లేందుకో ‘ఓలా లైట్’ను ఉపయోగించి క్షణాల్లో రైడ్‌ను బుక్‌ చేసుకోవచ్చు. ఈ యాప్ కేవలం 1ఎంబీ మెమొరీతోనే పనిచేయడం దీని ప్రత్యేకత. నెట్‌వర్క్‌ స్లోగా ఉన్నా ఈ యాప్‌ ఎలాంటి అడ్డంకులు లేకుండా పని చేస్తుంది. 

‘ఓయో లైట్‌’తో హాయిహాయిగా

పని నిమిత్తం నగరానికి వెళ్లినప్పుడో.. పర్యాటక ప్రదేశాలు సందర్శించేందుకు దూర ప్రదేశాలకు వచ్చినప్పుడో.. విశ్రాంతి కోసం హోటల్‌లో గదిని బుక్‌ చేసుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. అయితే ‘ఓయో’ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మీరు ఎక్కడున్నా.. ఏ హోటల్లోనైనా గది బుక్ చేసుకోవచ్చు. అయితే డేటా తక్కువగా ఉంది.. నెట్‌వర్క్‌ అంత స్పీడ్‌గా లేదు. అలాంటప్పుఉ ‘ఓయో లైట్‌’ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ యాప్‌ కేవలం 800కేబీ మెమొరీతోనే రన్‌ అవుతుంది. 

మ్యూజిక్‌ కోసం ‘స్పోటిఫై లైట్‌’

సంగీత ప్రేమికులకు మన దేశంలో కొదవ లేదు. పనిలో వేగం పెరగాలన్నా.. శరీరం ఉత్సాహంగా ఉండాలంటే పాటలు వినేవాళ్లు కోకొల్లలు. ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో పాటల కోసం ఏదో ఒక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటూనే ఉంటారు. ఇది గమనించిన ‘స్పోటిఫై’ కేవలం 11ఎంబీ మెమొరీతోనే ‘స్పోటిఫై లైట్‌’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో వినియోగదారులు ఎలాంటి అంతరాయాలు లేకుండా పాటలు వింటూ సంగీత మాధుర్యంలో మునిగి పోవచ్చు. 

ఫొటోలకు ఉందిగా ‘ఇన్‌స్టాగ్రామ్ లైట్’

మన భావాలు, అభిరుచులు, ఇష్టాలు, ఫొటోలు, వీడియోలు పంచుకునే వేదిక ‘ఇన్‌స్టాగ్రామ్‌’ యాప్‌. ఒక సెలబ్రిటీ గురించి లేటెస్ట్ ఫొటోలు చూడాలన్నా, వారి సంగతులు తెలుసుకోవాలన్నా ఇప్పుడు అందరూ సందర్శించింది ‘ఇన్‌స్టాగ్రామ్‌’ అంటే నమ్మశక్యం కాదు. మరి ఇంతలా ప్రాచుర్యం పొందిన ఈ యాప్‌ను ఫొన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలంటే ‘ర్యామ్‌’లో 32ఎంబీ మెమొరీని వెచ్చించాల్పిందే. దీంతో వినియోగదారుల కోసం ‘ఇన్‌స్టాగ్రామ్‌’ కేవలం 500కేబీ మెమొరీతోనే ‘ఇన్‌స్టాగ్రామ్‌ లైట్’ను వాడకంలోకి తెచ్చింది. దీంతో యాప్‌ యూజర్స్‌ కూడా పెరిగిపోయారు.

వీడియోలకు ‘యూట్యూబ్‌ గో’

తక్కువ డేటా, ఇంటర్నెట్ వేగం సరిగా లేక వీడియోలను వీక్షించలేకపోతున్నారా? అయితే మీ కోసం మరో లైట్ యాప్‌ ఉంది. అదే ‘యూట్యూబ్‌ గో’. 1ఎంబీ మెమొరీతోనే పనిచేసే ఈ యాప్‌తో పాటలు, వీడియోలు, ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్, సినిమాలు, టీవీ షోలను ఆటంకాలు లేకుండా చూడవచ్చు. ఈ యాప్ నుంచి వీడియోలను మీ మెమొరీ కార్డ్ లేదా ఫోన్‌లోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

‘కిండల్‌ లైట్‌’తో చదువుకోండి నిశ్చితంగా

ఉరుకులు పరుగుల జీవితం. ప్రశాంతంగా ఇష్టమైన బుక్‌ను చదివే తీరిక లేక చాలా మంది తమ కోరికను మనసుకే పరిమితం చేస్తుంటారు. ఒకవేళ సమయం చిక్కినా.. ఈ డిజిటల్‌ యుగంలో పుస్తకాన్ని చేతిలో పట్టుకుని చదివే తీరుబాటు వారికి ఉండటంలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు అరచేతిలో ఉండే ఫోనే అన్నీ. మరి ఫోన్‌లోనే బుక్స్‌ చదివేయాలనుకుంటున్నారా? అయితే ‘కిండల్‌ లైట్‌’ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిందే. దీంతో ఎప్పుడైనా మీకు ఇష్టమైన బుక్స్‌ను నిశ్చింతగా చదువుకోవచ్చు. ప్రయాణంలో, పరీక్షల సమయంలో.. ఇలా ఎప్పుడైనా మీకు కావాల్సిన బుక్స్‌ను 2ఎంబీతో డౌన్‌లోడ్‌ చేసుకుని ‘కిండల్‌ లైట్‌’ యాప్‌తో ఏం చక్కా చదివేయండి మరి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు