close

వార్తలు / కథనాలు

సింగిల్‌ హ్యాండ్‌ బాక్సర్‌ వాగ్గెలిస్‌ ఛాజిస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: అతడు మూడు నెలల పసిపిల్లాడిగా ఉన్నప్పుడే కుడి చెయ్యికి క్యాన్సర్‌ సోకింది. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్సలో భాగంగా ఆ చెయ్యి మణికట్టు నుంచి తొలగించారు. దీంతో ఎడమచెయ్యి ఒక్కటే పూర్తిగా ఉంది. కుడి చెయ్యి లేకపోడంతో అవిటి వాడిగా మారాడు. అతడు పెరిగే కొద్దీ తోటి విద్యార్థులు హేళన చేయడం, మానసికంగా బాధించడంతో అతడిలో కోపం పెరిగిపోయింది. చీటికీమాటికీ అందరితో గొడవలు పడటం, యుక్తవయసు వచ్చేసరికి వ్యసనాలకు అలవాటుపడటం జరిగాయి. ఇక అవే జీవితం అనుకొని బతికేస్తుండగా అతడి జీవన గమనం మారిపోయింది. ఆ గమనం వైపు వేసిన అడుగులు ఇప్పుడతడిని విజేతగా నిలబెట్టాయి..

వాగ్గెలిస్‌ ఛాజిస్‌.. ప్రపంచంలో ఒకే ఒక్క చేయి కలిగిన ప్రొఫెషనల్‌ బాక్సర్‌. ఎంతటి దుర్భర జీవితం అనుభవించాడో ఇప్పుడంతటి విజేతగా మారాడు. వాగ్గెలిస్‌ తన గురించి మట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. ఒక అందమైన అమ్మాయిని చూస్తే.. మొదటి చూపులోనే ప్రేమ ఎలా పుడుతుందో అలానే నేను కూడా బాక్సింగ్‌తో ప్రేమలో పడ్డాను. దశాబ్ధం క్రితం నేను ఇంగ్లండ్‌ వెళ్లినప్పుడు అక్కడ నాకు నా మొదటి కోచ్‌ టోనీ లాంగ్‌ పరిచయమయ్యారు. ఆయనకు ఓ బాక్సింగ్‌ జిమ్‌ ఉండడంతో శిక్షణ మొదలెట్టాను. టీవీలో బాక్సింగ్‌ చూడటమంటే నాకు చాలా ఇష్టం కాని ఇంత తక్కవ సమయంలోనే నేను ఇలా రింగ్‌లోకి దిగి ప్రత్యర్థులను చిత్తు చేస్తాననుకోలేదు. అని అంటారు వాగ్గెలిస్‌. అన్ని అడ్డంకులను అధిగమించి వాగ్గెలిస్‌ 2015లో ఏథెన్స్‌లో తన మొదటి బాక్సింగ్‌ మ్యాచ్‌ను ఆడారు. దాదాపు మూడు వేల మంది వీక్షకుల మధ్య జరిగిన తొలిపోరులోనే చరిత్ర సృష్టించారు వాగ్గెలిస్‌.

అనంతరం రెండో మ్యాచ్‌లో ఓడిపోయి తీవ్ర గాయాలపాలయ్యాడు. తిరిగి రెండున్నరేళ్లు బాక్సింగ్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. తిరిగి కష్టపడి సాధన చేసి 2018లో మళ్లీ బాక్సింగ్‌ గ్లౌజులు తొడిగాడు. ఈ సారి సెర్బో బాస్నియన్‌ బాక్సర్‌ మిక్రో డ్రాజ్డోను ఓడించి తన సత్తా చాటాడు. వాగ్గెలిస్‌ మాట్లాడుతూ.. నాకు 35 ఏళ్లు వచ్చే వరకు నేను బాక్సింగ్‌ ఆడతాను. నాలాంటి వారికి శిక్షణ ఇచ్చి వారిలోని వైకల్యాన్ని మరిచిపోయి విజేతలుగా మార్చాలన్నదే నా ఆశ. నేను చివరగా ఒక్కటే చెప్పదల్చుకున్నాను. మీకు ఉన్న వైకల్యాన్ని మరిచిపోయి మీ కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించండి. ఎవరి మాటా వినొద్దు నీ మనసు మాట విని ముందుకు సాగిపో.. విజయమే నిన్ను వరిస్తుంది అని తన విజయ గాధను తెలియజేశారు వాగ్గెలిస్‌.


Tags :

మరిన్ని