close

వార్తలు / కథనాలు

అస్తమించని రేనాటి సూర్యచంద్రులు..

అడుగో వచ్చే.. ఇడుగో వచ్చే నరసింహా రెడ్డి
పళపళ పళపళ కేక వేసెరా నరసింహా రెడ్డి
చంద్రాయుధమూ చేతబట్టెనే నరసింహా రెడ్డి
ఆవుల మందలో పులి దుమికిన చందాన దూకినాడే..
ముల్లు కోల తన చేతిన ఉంటే మున్నూటికి బదులిస్తాడు
మన దేవుడినే మట్టు పెట్టుటకు వచ్చిరి తెల్లోల్లు
నీతి మాలిన తెల్లోళ్లను తెగ నరుకుదాము రారండోయ్‌

అప్పట్లో ఈ పద్యం స్థానిక జానపద కారుల నోళ్లలో నానుతూ ఉండేది. వందల మంది బ్రిటీషు సైన్యాన్ని గడగడలాడించిన ధీరుడిగా నరసింహారెడ్డి రేనాటి ప్రాంతంలో పేరు గాంచిన సంగతి తెలిసిందే. నరసింహారెడ్డి వీరమరణం అనంతరం కూడా ఆంగ్లేయులను ఎదుర్కోవడంలో ప్రజల్లో ఉద్వేగం రగిల్చేందుకు ఈ పద్యాలు వాడుకలో ఉండేవి.

ఉత్తరాది ఉయ్యాలవాడలో ఉన్నదీ ధర్మం సూడరయా
నేటికి బుడ్డా ఎంగాల రెడ్డిని దానా పెబువని తలవరయా
పచ్చి కరవులో పానము బోసేను బెమ్మ దేవుడే ఆయనయా
ఆకలి కడుపుకు అన్నము పెట్టె ధర్మ దాతయని తెలియరయా
గోవిందాయని వన్న వారికి గోవుల దానము చేసెనయా..

ఇది బుడ్డా వెంగళ రెడ్డి గురించి రచయిత గొట్టుముక్కల సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన పద్యం. గోదావరి జిల్లాల్లో డొక్కా సీతమ్మ, గుంటూరులో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, నెల్లూరులో కోడూరి బాలకోటారెడ్డి వంటివారు దాతృత్వ గుణంలో ఎంత సుప్రసిద్ధులో రాయలసీమలో బుడ్డా వెంగళ రెడ్డి అంతటివారు. మనిషి డొక్కలు సైతం వీపునకు అంటుకునేంత తీవ్రతతో సంభవించిన కరవు రోజుల్లో అన్నార్థులను ఆదుకున్న ఆయన్ను కలియుగ శిబి చక్రవర్తితో పోలుస్తారు.

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యుద్ధ వీరుడైతే.. బుడ్డా వెంగళరెడ్డి దాన కర్ణుడిగా కీర్తి గడించారు. వీరిద్దరూ రేనాటి సూర్య చంద్రులుగా ప్రసిద్ధిగాంచారు. 

తిరుగుబాటు ఇలా..
1846 జూన్‌లో ఆంగ్లేయులపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తిరుగుబాటు మొదలైంది. నరసింహారెడ్డి తాతల కాలంలో అంటే 1800 ఏడాది సమయంలోనే వారి సంస్థానాన్ని బ్రిటీషు వారు ఆక్రమించారు. అందుకు బదులుగా నెలకు కొంత సొమ్ము భరణం రూపంలో ఇచ్చేవారు. 1845 వరకూ ఈ భరణం నరసింహా రెడ్డికే వచ్చేది. ఇదిలా ఉండగా తరచూ బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రజల వద్ద విచ్చల విడిగా శిస్తులు వసూలు చేసేది. ఇవ్వని వారిని చిత్ర హింసలు పెట్టి వేధించేవారు. తెల్లవారి దాష్టీకాలను నరసింహారెడ్డి సహించలేకపోయేవాడు. అదను కోసం ఎదురు చూసేవాడు. ఈ క్రమంలో బ్రిటీషు ప్రభుత్వం నుంచి తనకు వచ్చే భరణం కోసం నరసింహారెడ్డి తన అనుచరుణ్ని కోయిలకుంట్లకు పంపాడు. తెల్లవాడైన తహసీల్దారు తనను గతంలో అవమానించాడనే నెపంతో సొమ్ము ఇవ్వకుండా నరసింహారెడ్డిని దూషించాడు. విషయం తెలిసిన రెడ్డి ఇదే అదనుగా భావించి, అవమానం భరించలేక దండయాత్రకు సిద్ధమయ్యాడు. కొందరు స్థానిక జమిందార్లు, హైదరాబాద్‌, కర్నూలుకు చెందిన సలాం ఖాన్, పాపాఖాన్, మరికొందరు బోయలు, చెంచులు నరసింహారెడ్డితో జత కలిశారు.
1846 జులైలో 500 మంది సైన్యాన్ని కూడదీసి నరసింహా రెడ్డి కోయిలకుంట్ల పట్టణంపై దండెత్తాడు. తహసీల్దారును, ధనాగారములోని కాపలా వ్యక్తిని హతమార్చి ఖజానాలో ఉన్న డబ్బు చేజిక్కించుకున్నాడు. తనకు రావల్సింది తీసుకొని మిగిలింది పేదలకు పంచిపెట్టాడు. నరసింహారెడ్డిని పట్టుకొనేందుకు బ్రిటీష్‌ ప్రభుత్వం తెల్ల సైన్యాన్ని దింపింది. ఆయన శక్తిని తక్కువ అంచనా వేసి వచ్చిన సైన్యం వెనుదిరిగిపోయింది. మరోవైపు నరసింహారెడ్డిని పట్టిస్తే రూ.వెయ్యి బహుమానం ప్రకటించింది. సైన్యం వెనుదిరగడాన్ని తన జాతికి అవమానంగా భావించిన కాకరెస్‌ అనే తెల్ల దొర తన సైన్యాన్ని నరసింహారెడ్డి ఇంటిపైకి పంపాడు. అయినా ఫలితం లేకపోయింది. నరసింహారెడ్డి ధాటికి సైన్యం దిక్కులు చూడకుండా పారిపోయింది. 
ఈ నేపథ్యంలో నరసింహా రెడ్డిని బంధించుటకు బ్రిటీష్‌ ప్రభుత్వం లెఫ్టినెంట్‌ కల్నల్‌ వాట్సన్‌ అనే ఇంగ్లీషు అధికారిని నియమించింది. అప్పటికే మందీమార్బలంతో అత్యంత శక్తిమంతుడై ఉన్న నరసింహారెడ్డితో యుద్ధం చేసి ఓటమితో వెనుదిరిగారు.

నల్లమలకు మకాం మార్పు
తెల్లవారు రెట్టించిన సైన్యంతో దాడి చేయగలరని ముందుగానే పసిగట్టిన నరసింహా రెడ్డి, నల్లమల ప్రాంతంలోని అహోబిల క్షేత్రం పరిధిలోని అటవీప్రాంతానికి మకాం మార్చాడు. ఇక్కడ రెడ్డికి కంభం తదితర ప్రాంతాల వారంతా స్వచ్ఛందంగా వచ్చి ధన, ధాన్య, వస్తువులను సమకూర్చారు. ఆ ప్రాంతంలోని ఓ భారతీయ తహసీల్దారు పదవీ కాంక్షతో నరసింహా రెడ్డి ఆచూకీ గురించిన సమాచారాన్ని తెల్లవారికి చేరవేశాడు. ఓ తెల్ల పోలీసు సూపరింటెండెంటు సాయుధబలగాలతో రెడ్డిని చుట్టు ముట్టగా.. అప్రమత్తమైన ఆయన ఒరలోని కరవాలం చేతపట్టి తరిమికొట్టాడు. ఈ వార్త విన్న ప్రభుత్వం ఇక ఆలస్యం చేయకూడదని భావించి, కెప్టెన్‌ నార్టస్‌ను బలమైన సైన్యంతో పంపింది. ఈ వార్త విన్న రెడ్డి తన సైన్యాన్ని వ్యూహాత్మకంగా అప్రమత్తం చేసి యుద్ధానికి సన్నద్ధమైయ్యాడు. ఈ యుద్ధంలో ఇరు పక్షాలకు తీరని సైనిక నష్టం జరిగింది. 
ఇదే సమయంలో నరసింహా రెడ్డి భార్య చనిపోయింది. కాశీకి పోయిన తల్లి కూడా మరణించింది. నెలల తరబడి యుద్ధం సాగింది. 
బంధించి.. ఉరి తీసి..
శత్రువులకు తన కోట వ్యూహాలు అర్థమయ్యాయని గ్రహించి మళ్లీ మకాం మార్చాడు. తర్వాత ఓ నరసింహ స్వామి ఆలయాన్ని తన స్థావరంగా ఏర్పాటు చేసుకోగా, అక్కడికి ఆయనకు ఓ వ్యక్తి భోజనం తెచ్చేవాడు. గూఢచర్యంతో విషయం గ్రహించిన బ్రిటీషు దొర వంట మనిషికి డబ్బు ఆశ చూపి ఆహారంలో మత్తు పదార్థం కలిపి పంపారు. 1846 అక్టోబరు 6న స్పృహ కోల్పోయిన రెడ్డిని బంధించారు. మరుసటి ఏడాది ఫిబ్రవరి 22న నరసింహా రెడ్డిని కలెక్టర్‌ సమక్షంలో ఉరి తీయాలని తీర్పు వెలువడింది. అంతేకాక అతని శిరస్సును కోయిలకుంట్ల బురుజుపై వేలాడదీయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. రెడ్డితోపాటు మొత్తం 901 మందిపై కేసులు పెట్టారు. రెడ్డిని ఉరి తీస్తున్న దృశ్యాన్ని 2 వేల మంది కన్నీరు కారుస్తూ చూశారని చెబుతారు.


బుడ్డా వెంగళరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వం అపర దాన కర్ణులుగా ప్రసిద్ధి చెందిన వారిలో రాయలసీమకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి ఒకరు. వజ్రానికి సహజ మెరుపులాగా పుట్టుకతోనే వెంగళరెడ్డికి దాన గుణం అబ్బిందని చెబుతారు. ఏటా ఉగాదికి ఆయన చేసే అన్నదాన కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాలన్నీ తరలి వచ్చేవి. ఓసారి గుర్రంపై వెళ్తుండగా దొంగలు అడ్డగిస్తే వారిని బుజ్జగించి ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టించి అర క్వింటాల్‌ బియ్యం దానంగా ఇచ్చాడు. ఓసారి వెంగళరెడ్డి ఇంటికి మజ్జిగ కోసం ఓ మహిళ రాగా, ఇంట్లో కుండెడు మజ్జిగ ఉన్నా అతని భార్య లేవని చెప్పింది. దీంతో వెంగళరెడ్డి ఆ మహిళకు ఆవునే దానం చేశాడు. చెప్పుకుంటూ వెంగళరెడ్డి దాతృత్వాన్ని గురించిన ఘటనలు కోకొల్లలు.
డొక్కల కరవులో ఆదుకొని..
1826 సమయంలో కడప, కర్నూలు, అనంతపురం, బళ్లారి ప్రాంతాల్లో ఏనాడు చూడని కరవు సంభవించింది. దీన్ని ‘డొక్కల కరవు’గా పిలిచేవారు. ధాన్యం నిల్వలు పూర్తిగా తరిగిపోయి ఆకలితో వేలాది మంది మరణించారు. పచ్చగడ్డి జాడ లేక ఎన్నో పశువులు కడుపు మాడి మృత్యువాత పడ్డాయి. రాజ్యాధికారులు ఏర్పాటు చేసిన గంజి కేంద్రాలు కూడా వెలవెలబోయి, ప్రజల ప్రాణాలు కాపాడలేకపోయాయి.  ఈ సమయంలో బుడ్డా వెంగళరెడ్డి తన ఆస్తి మొత్తాన్ని వెచ్చించి ప్రజలను కాపాడగలిగాడు. పూటకు 8 వేల మందికి తక్కువ లేకుండా దాదాపు మూడు నెలలు కడుపు నింపిన దాన గుణం వెంగళరెడ్డిది. ఈయన తమ్ముడు ఈశ్వరరెడ్డి కూడా తన ఆస్తిని పేదల ఆకలి తీర్చేందుకే వినియోగించాడు. 

తెల్ల దొరసాని సత్కారం 
వెంగళరెడ్డి దాన గుణం శత్రువును కూడా పరవశించేలా చేసింది. వెంగళ రెడ్డి దాన గుణాన్ని తెలుసుకున్న బ్రిటీషు మహారాణి విక్టోరియా ఆయనకు 20 తులాల బంగారు పతకాన్ని బహూకరించింది. 1900 ఏడాదిలో వెంగళరెడ్డి తన పిల్లలకు మశూచీ టీకాలు వేయించే పనిపై ఊళ్లోకి వెళ్లి వచ్చి మధ్యాహ్నం 12 గంటలకు భోజనం చేసి పడుకొని, నిద్రలోనే మరణించాడు. పుణ్యమూర్తులకే ఇలాంటి సుఖమైన మరణం సంభవిస్తుందని అప్పుడు అంతా అనుకున్నారు.

ఉయ్యాలవాడలోనే జన్మించిన యుద్ధ వీరుడు, దాన శూరుడు ఇంకా అక్కడి ప్రజల్లో అస్తమించని సూర్యచంద్రులుగా నిలిచారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు