close

వార్తలు / కథనాలు

ఓ ఆరు నెలలు అలా చేస్తే ..ఖుషీ ఖుషీ

ఆఫీసులో విపరీతమైన పని భారం. అలసి సొలసి ఇంటికొస్తాం. ఆలుమగల మధ్య అన్యోన్యత బాగుంటే సరేసరి. లేదంటే అసలు సమస్య ఇక్కడే  మొదలవుతుంది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో చుట్టుముడతాయి. తెల్లారితే మళ్లీ భుజాన బ్యాగేసుకొని బయలు దేరాల్సిందే. నిత్యం ఇలానే ఉంటే ఆ  జీవితం నిరాశగా ఉంటుంది. అలా కాకుండా నిత్యం నూతనోత్సాహంతో ఉండాలంటే మీ అంతర్గత  శక్తి సామర్థ్యాలను సరిగ్గా వినియోగించుకుంటే  సరిపోతుందంటున్నారు నిపుణులు. కనీసం ఆరు నెలల పాటు వీటిని పాటిస్తే.. ఆనందం మీ సొంతమని చెబుతున్నారు. ఆ చిట్కాలేంటో చూసేద్దామా..?

రెండు పరిష్కారాలు

ఎదైనా సమస్య ఎదురవుతుందని భావించినప్పుడు ముందే దానికి రెండు పరిష్కారాలను కనుక్కోండి. వాటి పర్యవసానాలపై కూడా ఓ అంచనాకు రండి. ఏ మార్గం ద్వారా సమస్య సులువుగా పరిష్కారమవుతుందో దానినే ఆచరణలో పెట్టండి.

చర్చా కార్యక్రమాలతో..

టీవీల్లో రకరకాల కార్యక్రమాలు వస్తుంటాయి. వాటిలో రాజకీయ చర్చా కార్యక్రమాలను చూడటానికి ప్రాధాన్యతనివ్వండి. అందులో రాజకీయ విశ్లేషకులు ఎదుటివారి ప్రశ్నలకు ఎలా సమాధానాలిస్తున్నారో గమనించండి. ఒక వేళ మీరు ఆ స్థానంలో ఉంటే ఏం చెబుతారో ఓ అంచనాకు రండి.  దీని వల్ల మనకు ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా ఎలా పరిష్కరించుకోవాలో తెలుస్తుంది.

కొత్త విషయాలపై ఆసక్తి

సాధారణంగా చాలా మంది కొత్త విషయాలపై ఆసక్తి చూపిస్తారు. జీవితంలో నిస్సత్తువ ఆవహించిన వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. దీని నుంచి బయట పడేందుకు గాంధీజీ జీవిత చరిత్ర చదవండి. నిజ జీవితంలో ఆయన ఎలా వ్యవహరించేవారో సొంతంగా విశ్లేషించండి. అంతేకాకుండా  మీకు ఇష్టమైన  అంశాన్ని ఇంటర్నెట్‌లో శోధించి దాని గురించి మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

అభిప్రాయాలను గౌరవించండి

మీ సమక్షంలో ఏదైనా అంశం చర్చకు వచ్చినప్పుడు ముందుగా ఎదుటి వారు చెప్పేది సావధానంగా వినండి. ఆ తర్వాతే  మీ అభిప్రాయాన్ని బయటపెట్టడండి. అవతలి వారు మీ కంటే మంచి సలహా ఇచ్చినపుడు దానిని స్వీకరించడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడవద్దు. దీనివల్ల ఇతరులకు మీపై సదాభిప్రాయం కలుగుతుంది. భవిష్యత్‌లో ఎదైనా సమస్య ఎదురైతే వారంతా మీకు అండగా ఉంటారు.

పనిపై పట్టుదల

మీరు  చేస్తున్న పనిని ఇష్టంగా పట్టుదలతో చేసేందుకు ప్రయత్నించండి. మీకు అప్పగించినదాన్ని సమర్థంగా నిర్విర్తించండి.  ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానిని చేరుకునే క్రమంలో ఎదురైన అవాంతరాలను అంచనా వేయండి. అంతేకాకుండా వాటిని అధిగమించడానికి అవలంబించాల్సిన పద్ధతులను కూడా పరిశీలించండి.

ప్రేమను వ్యక్తం చేస్తూ..

జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు మరపురాని తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. సందర్భాన్ని బట్టి మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను చిన్న చిన్న బహుమతులతో ఆశ్చర్యపరచండి. తద్వారా మీరు వారిలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు. ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎంతో సహాయపడుతుంది. ఇతరుల్లో మీరు గమనించిన శక్తిసామర్థ్యాలను వారికి ప్రత్యక్షంగా చెప్పండి. ఇది మీపై సానుకూల దృక్ఫథం ఏర్పరచేలా చేస్తుంది.

దయతో చేరదీయండి

మనకు నిత్య జీవితంలో ఎంతో మంది కనిపిస్తుంటారు. అందులో రకరకాల మనస్తత్వం గలవాళ్లు, కలిమి లేములతో ఉన్నవాళ్లూ ఉంటారు. జీవితంలో అందర్నీ కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్న పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి వారిని ప్రేమతో పలకరించండి. ఏదైనా అనాథ శరణాలయానికో, వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడి వారితో కాసేపు ముచ్చటించండి. మీ మనసు చాలా తేలికవుతుంది.

నిర్ణయం తీసుకునే ముందు..

ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిదానంగా ఆలోచించండి. అది ఎంత సులభంగా తీసుకున్నదైనప్పటికీ పూర్తిగా ఆలోచించిన తర్వాతే  కార్యాచరణ ప్రారంభించాలి. ఆ రోజు చేయాల్సిన పనుల్నింటినీ ఒక పేపర్‌పై రాసుకొని, ప్రతి గంటకు  ఏమేం చేయదలచుకున్నామో  స్పష్టంగా అవగాహనకు రావాలి. మనం ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం పని పూర్తవుతోందా? లేదా? అని ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవాలి. 

మీ కుటుంబ పరిస్థితులు, మీకెదురయ్యే అనుభవాల ప్రకారం పై చిట్కాల్లో అవసరమైన వాటిని కనీసం 6 నెలలు క్రమం తప్పకుండా పాటించినట్లయితే మానసిక ఉల్లాసాన్ని తిరిగి పొందే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని