close

వార్తలు / కథనాలు

ఫుట్‌బాల్‌.. దేశాన్ని ఏకం చేసింది..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోట్లాది మంది అనురక్తితో వీక్షించే ఆట ఫుట్‌బాల్‌. నిజానికి ఫుట్‌బాల్‌ అనే పదం కొంతమందికి ఓ ఎమోషన్‌.. మరికొంతమందికి గుండె చప్పుడు. ఇలా అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. జాత్యహంకారాన్ని, వర్ణ వివక్షను అంతం చేసిన చరిత్ర ఈ ఆటకుంది. ఎన్నో లక్షల కుటుంబాల జీవితాల్ని మార్చివేసిన ఘనత ఈ ఆట సొంతం. అలా ఈ ఆట కొన్ని దేశాల్లో ఓ సంస్కృతిగా మారిపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచ దేశాలపై ఫుట్‌బాల్‌ ప్రభావం అంతాఇంతా కాదు. అయితే రువాండా ఉదంతం మాత్రం ఫుట్‌బాల్‌ ఆటకే ఓ గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆ దేశ ప్రజల్ని ఏకం చేసి తన గొప్పతనాన్ని తానే ఇనుమడింపజేసుకుంది ఫుట్‌బాల్‌. దారుణ మారణకాండ నంచి తేరుకోవడంలో కీలక పాత్ర పోషించింది. అసలు ఆ చరిత్ర ఏంటో ఓసారి చూద్దాం...

దారుణ హత్యాకాండ...
1962కి ముందు రువాండా వలస పాలనలో ఉండేది. రువాండా, బురుండి, కాంగోలాంటి దేశాల్ని జర్మనీ, బెల్జియం పాలించాయి. ఆ సమయంలో రువాండాలో హుటు, టుట్సీ అనే రెండు జాతులుండేవి. వీరిలో హుటులు అధిక సంఖ్యలో.. టుట్సీలు మైనారిటీలుగా ఉండేవాళ్లు. అయితే బెల్జియం పాలకులు స్థానిక పాలనలో టుట్సీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. దీంతో టుట్సీలు తమని తాము ఉన్నతంగా భావించుకునే వారు. పైగా రెండు జాతులను గుర్తించేలా గుర్తింపుకార్డు విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఇలా రెండు జాతుల మధ్య జాతివివక్ష పెరిగిపోయింది. దీన్ని మెజార్టీలుగా ఉన్న హుటులు ఏమాత్రం సహించలేకపోయారు. ఇలా ఇరు జాతుల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. హుటులు తమ పోరాటం టుట్సీలపైనే కాకుండా బెల్జియం పాలనకు వ్యతిరేకంగానూ సాగింది. ఎట్టకేలకు 1962లో స్వాతంత్ర్యం సిద్ధించింది. కానీ ఈ రెండు జాతుల మధ్య వైరం మాత్రం తగ్గలేదు. పైగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం తరచూ తలపడేవారు. మధ్యలో అంతర్జాతీయ జోక్యంతో శాంతి ఒప్పందాలు జరిగినా అంతర్గతంగా పోరాటాలు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే 1994లో హుటుల నాయకుడు, అప్పటి రువాండా అధ్యక్షుడు హబ్యరిమానా ప్రయాణిస్తున్న విమానాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో వీరి మధ్య వైరం మరింత తీవ్రమైంది. తమ నాయకుడి మృతికి టుట్సీ తిరుగుబాటుదారులే కారణమని హుటులు బలంగా విశ్వసించారు. టుట్సీలు ఎక్కడ దొరికితే అక్కడ చంపేయాలని హుటు తిరుగుబాటుదాలు బహిరంగంగా పిలుపునిచ్చారు. దీంతో నెలరోజుల పాటు దేశవ్యాప్తంగా ఘోర హత్యాకాండ జరిగింది. దాదాపు 10లక్షల మంది ఊచకోతకు గురయ్యారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

టుట్సీ అయినా ‘టోటో’ని హుటులే కాపాడుకున్నారు..
అయితే అంతటి మారణకాండలోనూ ఓ టుట్సీని మాత్రం హుటులు స్వయంగా తామె రక్షించుకున్నారు. ఆయన ఎవరో కాదు రేయాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కి గోల్‌కీపర్‌గా వ్యవహరిస్తున్న మురాంగ్వా అలియాస్‌ టోటో. రువాండా వ్యాప్తంగా అతనికి విపరీతమైన అభిమానులుండేవారు. అందులో హుటులు కూడా ఉన్నారు. అయితే హత్యాకాండలో భాగంగా ఒక్కొక్కరినీ చెరబడుతూ ఓ రోజు హుటు తిరుగుబాటుదారులు టోటో ఇంటికి వెళ్లారు. అక్కడ అధ్యక్షుడి నుంచి ట్రోఫీ అందుకుంటున్న టోటో ఫొటో ఓ తిరుగుబాటుదారునికి తారసపడింది. నిజానికి అతను టోటోకి పెద్ద అభిమాని. అతను టోటోని గుర్తించి ఎలాగైనా రక్షించాలని నిర్ణయించుకున్నాడు. హుటు తిరుగుబాటు నాయకుడు జుజు కూడా టోటో అభిమానే. జుజునే స్వయంగా టోటోని తన ఇంట్లో ఆశ్రయమిచ్చి కాపాడుకున్నాడు. అలా మొత్తానికి తన కుటుంబసభ్యుల్ని పోగొట్టుకున్నా టోటో మాత్రం బతికిపోయాడు. అలా ఫుట్‌బాల్‌ రెండు జాతుల మధ్య సత్సంబంధాలకు పునాది వేసింది.

ఫుట్‌బాలే రెండు జాతుల్ని ఏకం చేసింది...
వరుసగా 100 రోజుల హత్యాకాండ తర్వాత అంతర్జాతీయ దేశాలు, ఐరాస జోక్యంతో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. కానీ, మనసులోని వైషమ్యాలు మాత్రం తొలగిపోలేదు. టోటో ఆ చీకటి రోజుల నుంచి కోలుకొని తిరిగి రేయాన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌కి ఆడడం ప్రారంభించాడు. అలా ఓసారి స్థానిక ఫుట్‌బాల్‌ టీంకి రేయాన్‌ క్లబ్‌కి మధ్య మ్యాచ్‌ జరిగింది. దీనికి జాతులతో సంబంధం లేకుండా అభిమానులు విపరీతంగా తరలివచ్చారు. టోటో అభిమానులైన హుటులు, మరోవైపు టుట్సీలు ఇద్దరూ రేయాన్‌ గెలవాలని కోరుకున్నారు. కేరింతలు, ఈలలతో జట్టుని ఉత్సాహపరిచారు. ఈ క్రమంలో రెండు వర్గాలు కలిసిపోయాయి. ఆ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ఎట్టకేలకు టోటో ఆడిన రేయాన్ టీం గెలిచింది. దీంతో అతడి అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఇరు వర్గాలు తమ మధ్య వైరుధ్యాల్ని మరచి సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి ఫుట్‌బాల్‌కి ఆదరణ మరింత పెరిగింది. ఇలా ఇరు వర్గాల మధ్య సయోధ్యకు తద్వారా ఒక దేశాన్నే ఏకం చేసేందుకు ఫుట్‌బాల్‌ ఓ కారణమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు తమ జాతుల్ని ఎక్కడా ప్రస్తావించరు. నిజానికి ఇప్పటి తరానికి వారు ఏ జాతికి చెందినవారో కూడా తెలియకుండా పెంచుతున్నారు. ప్రస్తుతం ఆ హత్యాకాండను తలచుకోవడమే నేరంగా ప్రకటించింది ఆ దేశం. అలా ఫుట్‌బాల్‌ ఆట ఓ దేశచరిత్రనే మలుపుతిప్పింది.


Tags :

మరిన్ని