close

వార్తలు / కథనాలు

మ్యాచ్‌కు వరుణుడే కాదు సూర్యుడూ అడ్డంకే

బాంబు, ఎలుక, పంది, మాడిన బ్రెడ్డు, పాము, హలాల్‌ ఆహారంతో ఆగిన మ్యాచ్‌లు

ఈనాడు.నెట్‌ ప్రత్యేకం

మ్యాచ్‌కు వరుణుడే కాదు సూర్యుడూ అడ్డంకే

హైదరాబాద్‌: అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటి వరకు వేల సంఖ్యలో మ్యాచ్‌లు జరిగాయి. అందులో వందల మ్యాచ్‌లు వరుణుడి కారణంగా నిలిచిపోయాయి. ఇది అందరికీ తెలిసిన సంగతే. నేపియర్‌ వేదికగా భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వన్డే సూర్యుడి అడ్డంకితో తాత్కాలికంగా నిలిపివేయడం మాత్రం విచిత్రంగా అనిపించింది. న్యూజిలాండ్‌లో ఇలాంటి పరిస్థితులు సహజం.

సాధారణంగా అన్ని దేశాల మైదానాల్లో పిచ్‌లు ఉత్తర, దక్షిణ అభిముఖంగా ఉంటాయి. నేపియర్‌లో మాత్రం తూర్పు, పడమర ముఖంగా ఉంటాయి. దీంతో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో బ్యాట్స్‌మెన్‌ బంతులు ఎదుర్కోవడం కష్టం. సూర్య కిరణాలు నేరుగా కళ్లలో ప్రసరించడంతో ఇబ్బంది అవుతుందని మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ‘నా 15 ఏళ్ల అంపైరింగ్‌ కెరీర్‌లో ఇలాంటిది మునుపెన్నడూ చూడలేదు’ అని షాన్‌ జార్జ్‌ అన్నారు. అసలు క్రికెట్‌లో విచిత్ర సంఘటనల వల్ల మ్యాచ్‌ల్ని నిలిపేసిన సందర్భాలను ఓ సారి చూద్దామా!

బాంబు కలకలం

అది రెండో ప్రపంచ యుద్ధ సమయం. 1944, జులైలో లార్డ్స్‌లో సైన్యం, రాయల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. అప్పుడే జర్మనీ యుద్ధ విమానం డూడుల్‌బగ్‌ మైదానంలో దిగేలా కనిపించింది. వెంటనే ఆటగాళ్లంతా మైదానంలో పడుకున్నారు. అభిమానులను మైదానాన్ని ఖాళీ చేశారు. 2007, జూన్‌లో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో లాంకాషైర్‌ విజయానికి చేరువైంది. వెంటనే రెండు ఫైర్‌ అలారాలు మోగాయి. వంటగదిలో వంటకం మాడిపోయి వాసన రావడంతో సెన్సర్లు పనిచేయడం ఆగిపోయాయి. దాంతో మ్యాచ్‌ను కాసేపు ఆపేశారు.

మ్యాచ్‌కు వరుణుడే కాదు సూర్యుడూ అడ్డంకే

సూర్యగ్రహణంతో రెస్ట్‌డే

బీసీసీఐ స్వర్ణోత్సవం సందర్భంగా 1980లో బొంబాయిలో ఇంగ్లాండ్‌, భారత్‌ మధ్య ప్రత్యేక టెస్టు నిర్వహించారు. రెండో రోజు సంపూర్ణ సూర్య గ్రహణం ఉండటంతో ఆటకు సెలవిచ్చారు. తొలి రోజు ఇయాన్‌ బోథమ్‌ 6/58తో చెలరేగాడు. విశ్రాంతి లభించడంతో శతకం చేసి, మరో ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌ గెలిచింది. 1957లో ఎలుక పిచ్‌పైకి రావడంతో కెంట్‌ ఛాంపియన్‌షిప్‌లో మ్యాచ్‌ ఆగింది. లార్డ్స్‌లో 1962లో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ టెస్టు మ్యాచ్‌ జరిగింది. అప్పుడూ ఓ ఎలుక ఇలాగే ఇబ్బంది పెట్టడంతో ప్రముఖ పిల్లి పీటర్‌ దాన్ని పట్టుకుంది. ప్రపంచంలో సత్కారం పొందిన తొలిపిల్లి ఇదే కావడం గమనార్హం.

కాలిన బ్రెడ్డు ఆగిన మ్యాచ్‌

మరో 18 పరుగులు చేస్తే విజయం సాధిస్తుందనగా న్యూసౌత్‌ వేల్స్‌ 30 నిమిషాల వరకు బ్యాటింగ్‌ ఆపాల్సి వచ్చింది. బ్రిస్బేన్‌లోని అలన్‌ బోర్డర్‌ మైదానంలో ఫైర్‌ అలారం రావడమే ఇందుకు కారణం. 2017-18 షెఫీల్డ్‌ షీల్డ్‌ సీజన్‌లో ఇది చోటు చేసుకుంది. ఆసీస్‌ స్పిన్నర్‌ నేథన్‌ లైయన్‌ బ్రెడ్డు ముక్కను కాలుస్తుంటే పొగలు రావడంతో అలారం వచ్చింది.

పిచ్‌ మధ్యలో కారు

గతేడాది దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌ రంజీ మ్యాచ్‌ ఆడుతుండగా ఓ వ్యక్తి తన కారును మైదానంలోకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా నిషేధిత ప్రాంతమైన పిచ్‌ మధ్యలో వాహనాన్ని నిలిపివేశాడు. దీంతో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపేశారు. రిఫరీ పిచ్‌ను పరిశీలించి ఆడేందుకు బాగుందన్న తర్వాతే మ్యాచ్‌ ఆడించారు.

మ్యాచ్‌కు వరుణుడే కాదు సూర్యుడూ అడ్డంకే

హలాల్‌ ఆహారం ఆలస్యం

బ్లోమ్‌ఫోంటీన్‌లో బంగ్లాదేశ్‌, దక్షిణాఫ్రికా టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నాయి. తొలి రోజు భోజనం ఆలస్యమైంది. పర్యాటక జట్టైన బంగ్లాకు హలాల్‌ చేసిన ఆహారం అందించడంలో గందరగోళం ఏర్పడింది. వారికి ఆహారం అందించే వంటవారు ఆహార జాబితాను తప్పుగా ముద్రించడంతో గంటన్నర పాటు బంగ్లా అదనంగా బౌలింగ్‌ చేయాల్సి వచ్చింది. భోజన విరామం ఆలస్యంగా తీసుకున్నారు. దీంతో మ్యాచ్‌కు కాసేపు అంతరాయం కలిగింది.

ముళ్లపంది, పాము అడ్డంకి

గ్లూసెస్టర్‌లో 1957, జులైలో ముళ్లపంది వల్ల డెర్బీషైర్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌ను కాసేపు ఆపేయాల్సి వచ్చింది. పిచ్‌పై పరుగెడుతున్న ముళ్లపందిని పట్టుకోవడంలో ఆటగాళ్లు విఫలమయ్యారు. కాగా డెర్బీషైర్‌ వికెట్‌ కీపర్‌ జార్జ్‌ డాక్స్‌ తన చేతులకున్న గ్లౌజులతో దానిని జాగ్రత్తగా పట్టుకొని మైదానం బయట విడిచిపెట్టాడు. 2009లో సిడ్నీ సమీపంలోని బ్లాక్‌టౌన్‌లో అండర్‌-17 మ్యాచ్‌ జరుగుతుండగా ఎర్రరంగు పొట్ట, పైభాగం నల్లరంగుతో ఉన్న పాము కనిపించింది. మ్యాచ్‌ 20 నిమిషాలు నిలిపేశారు. కొన్నేళ్ల ముందు సైతం పాము కనిపించడంతో తర్వాతి బంతి పడుతుండగా బ్యాట్స్‌మన్‌ క్రీజు దాటొచ్చి దానిపై బ్యాటుతో దెబ్బవేశాడు. కీపర్‌ బంతి అందుకొని స్టంపింగ్‌ చేయడానికి ముందుకొచ్చాడట.

బంతిని వేడి చేసేందుకు 

ఇంగ్లాండ్‌లో మంచు కురువడం వల్ల ఒక మ్యాచ్‌ నిలిచింది. సిగరెట్‌ తాగొద్దంటూ ఓ వ్యక్తి సిగరెట్‌ తరహాలో దుస్తులు ధరించి లీడ్స్‌ మ్యాచ్‌కు వచ్చాడు. బౌలర్‌ వెనకాల  నిలబడటంతో దయచేసి ‘సిగరెట్‌ మనిషి’ కూర్చుంటారా అని అక్కడ చెప్పారు. 1889లో వార్సెస్టర్‌షైర్‌, డెర్బీషైర్‌ మ్యాచ్‌ మధ్యలో పంది రావడంతో మ్యాచ్‌ ఆగింది. పార్ల్‌లో 1995లో  కర్రీకప్‌ మ్యాచ్‌ జరిగింది. బ్యాట్స్‌మెన్‌ సిక్సర్‌ బాదడంతో బంతి గ్రిల్స్‌లో ఇరుక్కుపోయింది. దానికి ఉన్న గ్రీజును త్వరగా పోగొట్టేందుకు బంతిని వేడిచేశారు. అప్పటి వరకు మ్యాచ్‌ నిలిచిపోయింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు