close

వార్తలు / కథనాలు

అదే కంపెనీ.. అదే ప్రమాదం..

ఇంటర్నెట్‌డెస్క్‌: గనుల నిర్వహణలో కార్పొరేట్‌ సంస్థల నిర్లక్ష్యంపై ప్రపంచవ్యాప్తంగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యర్థుల ప్రోద్బలంతో జరిగే ఆందోళనలని వీటిని కార్పొరేట్‌ సంస్థలు తీసి పారేస్తుంటాయి. భారీ స్థాయిలో జరిగే మైనింగ్‌ కార్యకలాపాల్లో నిర్లక్ష్యం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందనడానికి బ్రెజిల్‌లో బ్రమాడినో వద్ద ఆనకట్ట ప్రమాదమే నిదర్శనం. పొట్ట కూటి కోసం వచ్చిన మైనింగ్‌ కార్మికులతోపాటు వందల మంది అమాయకులు ఐరన్‌ ఓర్‌ బురద కింద సజీవసమాధైపోయారు. సాధారణంగా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు మృతుల సంఖ్యను చెప్పడం కష్టమవుతుంది. కానీ బ్రెజిల్‌లో డ్యామ్‌ కూలిన ఘటనలో ఎంత మంది మృతి చెందారో ఇప్పటి వరకు అధికారులు కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. అతి కొద్ది మందిని మాత్రమే రక్షించగలిగారు. దాదాపు 300 మందికి పైగా ఆచూకీలేకుండా పోయారు.

గనుల వద్ద టైలింగ్స్‌ ఆనకట్టలు నిర్మిస్తారు. వీటిని గనుల్లో వచ్చే వ్యర్థాలు, ఉపఉత్పత్తులను నిల్వ చేసేందుకు వాడతారు. వీటిల్లో ఉండే పదర్థాలు అత్యంత కాలుష్య కారకాలై ఉంటాయి. ఈ వ్యర్థాలు బురద రూపంలో, ఘన రూపంలో ఉండవచ్చు. బురద రూపంలో ఉన్నవాటిని టైలింగ్‌ ఆనకట్టల్లో నిల్వ చేస్తారు. ఘన రూపంలో ఉన్నవాటిని గని రోడ్లకు, ఆకృతుల్లో వాడేస్తారు. 

నాటి ప్రమాదంలో...

వాలే ఎస్‌.ఎ. బ్రెజిల్‌లో అతిపెద్ద మైనింగ్‌ దిగ్గజం. ఈ కంపెనీ ముడి ఇనుము, మాంగనీస్‌, కాపర్‌, ఫర్టిలైజర్స్‌ ఇలా కీలక వ్యాపారాలను నిర్విహిస్తుంది. ఈ కంపెనీ ఆస్ట్రేలియాకు చెందిన బీహెచ్‌పీతో కలిసి సమార్కో అనే పేరుతో కంపెనీని ప్రారంభించింది. ఈ కంపెనీ బెంటో రోడ్రిగస్‌ అనే గ్రామానికి సమీపంలో ఐరన్‌ ఓర్‌ను వెలికి తీయడం మొదలుపెట్టింది. అనంతరం మిగిలిన వ్యర్థాలను వేయడానికి ఒక డ్యామ్‌ను నిర్మించాయి.  2015 నవంబర్‌ 5వ తేదీన ఈ డ్యామ్‌ బద్దలు కావడానికి గంట ముందు సిబ్బంది పసిగట్టారు. కానీ ఆ లోపే డ్యామ్‌ నుంచి భారీగా విషపూరితమైన బురద బెంటో రోడ్రిగస్‌ మీదకు దూసుకొచ్చింది. అప్పటికే సమాచారం తెలియడంతో చాలా మంది  సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఈ ఘటనలో 19 మంది మృతి చెందగా.. దాదాపు 1469 హెక్టార్ల రిపరియన్‌ అటవీ ప్రాంతం బురదకింద కూరుకుపోయింది. ముడి ఇనుము వ్యర్థం రియోడాకో నదిలో కలిసింది. దీంతో దాదాపు 230 పట్టణాలు అత్యంత కలుషితమైన నీటిని వాడుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ బురద అట్లాంటిక్‌ మహా సముద్రంలో కలిసి ఆ ప్రాంతం మొత్తాన్ని కాలుష్య కాసారంగా మార్చేసింది. దీనికితోడు బెంటో రోడ్రిగస్‌కు వెళ్లటానికి ఉన్న ఏకైక మార్గం మూసుకుపోయింది. దీంతో హెలికాప్టర్ల సాయంతో 600 మందిని అప్పట్లో రక్షించారు. దీనికి సంబంధించిన కొన్ని కేసులను గత ఏడాది 5.4 బిలియన్‌  డాలర్లకు సెటిల్‌ చేసుకొంది. ఇంత జరిగినా వాలే సంస్థ అప్రమత్తంగా వ్యవహరించలేకపోయింది.

తాజాగా పరవోపెబపై డ్యామ్‌ కూలి

తాజాగా ఇదే వాలే కంపెనీ ఆధ్వర్యంలో పరావోపెబ నదిపై ఉన్న ఆనకట్ట సమీపంలో ఐరన్‌ ఓర్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. శుక్రవారం ఇక్కడ వ్యర్థాలు‌ బురదగా మారి ఆనకట్టలోకి దూసుకొచ్చాయి. ఫలితంగా ఆనకట్టపై ఒత్తిడి పెరిగిపోయి ఒక్కసారిగా బద్దలైపోయింది. ఫలితంగా కొన్ని వందల ప్రాణాలు బురద కింద చిక్కకుపోయాయి. మృతుల సంఖ్య, నష్టం ఇప్పుడే అంచనాలకు అందే పరిస్థితి లేదు. దీనికితోడు బ్రుమాడినో నగరానికి సమీపంలోని కొర్రేగో డి ఫెయిజియో గనుల వద్ద ‘వలే’ కంపెనీకి చెందిన మరో ఆనకట్టలో కూడా నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇప్పుడు దీనిని సరిదిద్దుకోవడానికి బ్రెజిల్‌ అధికారులు నానాతిప్పలు పడుతున్నారు.

నిబంధనలు ఏవీ..

వాలే సంస్థకు ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మైనింగ్‌ అండ్‌ మెటల్స్‌(ఐసీఎంఎం)లో సభ్యత్వం ఉంది. ఈ సంస్థ అత్యున్నత ప్రమాణాలను పాటించేలా నిబంధనలు , మార్గదర్శకాలను సభ్యులకు అందజేసింది. 2015లో సమార్కో ప్రమాదం తర్వాత కొత్త మార్గదర్శకాలను కూడా సభ్యులకు జారీ చేసింది. ఈ డ్యామ్‌లో నీటి నిల్వను తగ్గిస్తే ప్రమాదం జరిగేది కాదని కొందరు ఇంజినీర్లు వాదిస్తున్నారు. దీనికి తోడు నిబంధనల అమలుకు మైనింగ్‌ కంపెనీలపై ప్రభుత్వ ఒత్తిడి కూడా తగ్గింది. తాజా బాధ్యతలు చేపట్టిన జైల్‌ బోల్సోనరో కార్పొరేట్‌ ఒత్తిళ్లకు తలొగ్గారనే ఆరోపణలు ఉన్నాయి. చివరికి కొన్ని వందల నిండు ప్రాణాలు బురదలో కూరుకుపోయాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు