close

వార్తలు / కథనాలు

ప్రేమ కోసం ఆరేళ్లు శిక్ష అనుభవించాడు

హమీద్‌ నేహాల్‌ అన్సారీ ప్రేమకథ

ప్రేమ కోసం ఆరేళ్లు శిక్ష అనుభవించాడు

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ప్రేమ కోసం ఎల్లలు దాటాడు. శత్రుదేశంలో అడుగుపెట్టాడు. ప్రేయసి జాడ కోసం అన్వేషిస్తూ.. అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. గూఢచర్యం నెపంపై ఆ ప్రేమికుడికి అక్కడి సైనిక న్యాయస్థానం మూడేళ్ల విచారణ అనంతరం 36 నెలల జైలు శిక్ష విధించింది. ఆ యువకుడి కోసం సరిహద్దులు ఆవల కన్నపేగు తరుక్కుపోయింది.  ఆ విషయం తెలిసి సాయం చేయడానికి ప్రయత్నించిన శత్రుదేశంలోని యువ పాత్రికేయురాలు రెండేళ్లపాటు అదృశ్యమైంది. చివరగా అన్ని ప్రయత్నాలు ఫలించి ఆరేళ్ల తర్వాత స్వదేశంలోకి దేశ యువకుడు అడుగుపెట్టాడు. ఇది సినిమా కథ కాదు.. కల్పనా అనిపించే వాస్తవ ప్రేమగాథ. ఫేస్‌బుక్‌ ప్రేమను నమ్మి.. పాకిస్థాన్‌కు వెళ్లి..  అక్కడి సైన్యానికి పట్టుబడి.. ఇటీవల విడుదలైన ప్రేమ ఖైదీ హమీద్‌ నేహాల్‌ అన్సారీ కథ.

ముంబయిలో నివసించే అన్సారీ దంపతులకు ఇద్దరు సంతానం. హమీద్‌ సోదరుడు దంతవైద్యుడు. నేహాల్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. నలుగురు సంతోషంగా జీవించేవారు. సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో 2012 ఫేస్‌బుక్‌ ప్రేమ పెను ప్రకంపనలు సృష్టించింది. హమీద్‌ అన్సారీ పాకిస్థాన్‌లోని కొహాట్‌కు చెందిన యువతితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకుని ప్రేమలో పడ్డాడు. ఆమెకోసం పాకిస్థాన్ బయలుదేరాడు. తల్లిదండ్రులకు అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఇంటర్వ్యూ అని చెప్పి బయలుదేరిన హమీద్‌ నేహాల్‌.. కాబూల్‌ నుంచి నకిలీ ధ్రువపత్రాలతో రోడ్డు మార్గం ద్వారా పాకిస్థాన్‌లో ప్రవేశించాడు. కాబూల్‌ నుంచి సరైన పత్రాలు లేకుండానే హమీద్‌ జలాలబాద్‌ చేరుకుని అక్కడ సరిహద్దు దాటి టొర్కోం మీదుగా పాక్‌లోని కరాట్‌ చేరుకున్నాడు. అక్కడే రెండు రోజులపాటు ఉన్న నేహాల్‌ హమాజ్‌ పేరుతో నకిలీ గుర్తింపుకార్డు సృష్టించాడు.

కైబర్ ‌పంక్తుబ్వా ప్రావిన్సులోకి అడుగుపెట్టిన హమీద్‌ నేహాల్‌ ప్రేయసిని వెతుక్కుంటూ కొహాట్‌కు చేరుకున్నాడు.  అక్కడ ప్రియురాలి జాడ కోసం వెతుకుతున్న సమయంలో కొహాట్‌ పోలీసులకు పట్టుబడ్డాడు. భారత్‌ నుంచి వచ్చిన యువకుడు కావడంతో నేహాల్‌ వాదనను పట్టించుకోకపోవడంతో గూఢచర్యం నేరం మోపారు. సైనిక కోర్టుకు అప్పగించారు. అయితే కాబుల్‌ వెళ్లిన తన కొడుకు మూడేళ్లైనా తిరిగి రాకపోవడంతో అతని తల్లి వేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ పై స్పందించిన పాక్‌.. హమీద్‌ గూఢచర్యం నేరంపై తమ అదుపులో ఉన్నాడని తెలిపింది. ఆ తర్వాత కొద్దిరోజులకే 2015 డిసెంబర్‌లో నేహాల్‌కు పాక్‌ న్యాయస్థాన్‌  మూడేళ్ల జైలు శిక్ష విధించింది. పెషావర్‌లోని మర్దాని జైలులో హమీద్‌ నేహాల్‌ మూడేళ్లపాటు శిక్ష అనుభవించాడు.

ప్రేమ కోసం ఆరేళ్లు శిక్ష అనుభవించాడు

ఓ అమ్మాయి కోసం పాక్‌ వెళ్లిన విషయం.. అతడి ల్యాప్‌టాప్‌ను పరిశీలించిన తర్వాతనే అన్సారీ కుటుంబానికి తెలిసింది. ప్రేమకోసం శత్రుదేశం పాక్‌లో అడుగు పెట్టి చిక్కుల్లో పడిన  హమీద్‌ను కాపాడేందుకు జీనత్‌ షాహజాదీ అనే స్థానిక యువ‌ పాత్రికేయురాలు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో 2015 ఆగస్టులో లాహోర్‌లో ఆమె కిడ్నాప్‌కు గురైంది. ఆ తర్వాత రెండేళ్లకు అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఆమెను విడిపెట్టారు. ఈ రెండేళ్లలో ఆమె కుటుంబం తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. సోదరి అదృశ్యంతో కుంగిపోయిన ఆమె తమ్ముడు బలవనర్మణానికి పాల్పడ్డాడు. తిరిగొచ్చిన తర్వాత జీనత్‌ కుటుంబం మీడియాకు దూరంగా ఉంది.

భారతీయులను గూఢచర్యం నెపంతో అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్‌ వారిని విడుదల చేసిన దాఖలాలు లేవు. ఆ విషయమే నేహాల్‌ తల్లిదండ్రులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ డిసెంబర్‌ 15కి నేహాల్‌ శిక్ష ముగుస్తుండగానే.. ముందుగా తమ కుమారుడి కోసం పోరాటం మొదలుపెట్టిన నేహాల్‌ తల్లిదండ్రులు అన్ని వేదికల నుంచి తమ బాధను పాక్‌ ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం చేశారు. భారత పాత్రికేయురాలు కూడా అన్సారీ విషయాన్ని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ దగ్గర ప్రస్తావించారు. పెషావర్‌ న్యాయస్థానంలో ఓ స్థానిక న్యాయవాది హమీద్‌ తరపున వ్యాజ్యం దాఖలు చేయగా.. శిక్ష పూర్తైన నెలలోగా అతడిని భారత్‌కు పంపాలని న్యాయస్థానం ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు డిసెంబర్‌ 16న మర్దాని జైలు నుంచి లాహోర్‌కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య  హమీద్‌ను తీసుకువచ్చిన పాక్‌ పోలీసులు వాగా- అట్టారీ సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగించారు. 27 ఏళ్ల వయస్సులో ప్రేయసి కోసం పాక్‌కు వెళ్లి ప్రేమఖైదీగా మారి ఆరేళ్లపాటు జైల్లో గడిపిన  హమీద్‌.. 33 ఏళ్ల వయస్సులో భారత్‌లో అడుగు పెట్టగానే తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాడు. ఫేస్‌బుక్‌ ప్రేమ కోసం పాక్‌ వెళ్లి చిక్కుల్లో పడ్డ హమీద్‌ను నేహాల్ అన్సారీని అమ్మ ప్రేమే రక్షారేకుగా మారి కాపాడుకుంది. తిరిగి స్వదేశానికి చేర్చింది.  

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు