close

వార్తలు / కథనాలు

ఓటమి సహజమే..కానీ మరీ ఇలా అయితే వేదనే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నికల్లో గెలుపోటములు సహజం. కానీ.. మరీ తక్కువ ఓట్ల వ్యవధిలోనే పరాజయం పాలైతే మాత్రం ఆ అభ్యర్థుల వేదన అంతా ఇంతా కాదు. పార్టీ టికెట్‌ దక్కించుకోవడం నుంచి ఎన్నికల్లో ప్రచారం.. పోలింగ్‌ రోజు వరకు వరకు వారికి ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. చివరికి అన్నింటినీ అధిగమించి గెలుపుకోసం ఎదురుచూస్తున్న తరుణంలో అతి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయామని తెలిస్తే ఆ బాధ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రచారంలో ఎక్కడో లోటుపాట్లు జరిగాయనో.. కొన్ని వర్గాల ఓట్లు సాధించడంలో విఫలమయ్యామనో అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలు వేసుకుంటుంటారు. ఎన్ని లెక్కలు వేసుకున్నా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయుంటుంది. ఏపీలో గత ఎన్నికల్లోనూ కొంతమంది అభ్యర్థులు అతి స్వల్ప ఓట్ల వ్యత్యాసంతోనే ఎమ్మెల్యే పదవికి దూరమయ్యారు. అలాంటి నేతలు, వారు పోటీ చేసిన స్థానాల వివరాలు ఓసారి పరిశీలిస్తే..

మంగళగిరి: గత ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యంత తక్కువ మెజారిటీ నమోదైంది ఈ నియోజకవర్గంలోనే.   గుంటూరు జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ మాత్రమే ఎక్కువసార్లు గెలుపొందాయి. పార్టీ స్థాపించిన తొలినాళ్లలో ఒకే ఒకసారి (1985) మాత్రమే తెదేపా అక్కడ విజయం సాధించింది. మళ్లీ ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ఆ స్థానాన్ని కేటాయించడం తదితర కారణాలతో పసుపు జెండా అక్కడ ఎగిరే అవకాశమే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఆ అవకాశం తెదేపాకు వచ్చినట్లే వచ్చి చేజారింది. 2014లో తెదేపా అభ్యర్థి గంజి చిరంజీవిపై వైకాపా అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వైకాపా తరుఫున మళ్లీ రామకృష్ణారెడ్డే బరిలో ఉండగా.. తెదేపా నుంచి మంత్రి  నారా లోకేశ్ పోటీ చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో లోకేశ్‌ బరిలోకి దిగడం ఇదే తొలిసారి.

రాజాం: శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గంలో తెదేపా-వైకాపా-కాంగ్రెస్‌ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. తెదేపా అభ్యర్థిగా మాజీ స్పీకర్‌ కావలి ప్రతిభాభారతి, వైకాపా నుంచి కంబాల జోగులు, కాంగ్రెస్‌ నుంచి అప్పటి మంత్రిగా ఉన్న కొండ్రు మురళీమోహన్‌ పోటీ చేశారు. తెదేపాలోనే ఉన్న కంబాల జోగులు వైకాపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తెదేపా నుంచి పోటీ చేసిన ప్రతిభా భారతిపై జోగులు 512 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. కొండ్రు మురళి బలమైన నేత, సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయినప్పటికీ రాష్ట్ర విభజన తదితర అంశాల కారణంగా కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల కొండ్రు తెదేపాలో చేరారు. తాజా ఎన్నికల్లో ప్రతిభాభారతికి కాకుండా అతనికే తెదేపా టికెట్‌ను ఖరారు చేసింది. వైకాపా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కంబాల జోగులు తిరిగి పోటీ చేస్తున్నారు.

కొత్తపేట: తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో గత మూడు సాధారణ ఎన్నికల్లోనూ ఇద్దరు అభ్యర్థులే ప్రధాన ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఒకరు చిర్ల జగ్గిరెడ్డి కాగా.. మరొకరు బండారు సత్యానందరావు. 2004, 2009, 2014 ఈ మూడు ఎన్నికల్లోనూ వీరిద్దరి మధ్యే పోరు జరిగింది. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన చిర్ల జగ్గిరెడ్డి.. తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన బండారు సత్యానందరావుపై గెలుపొందారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో సత్యానందరావు ప్రజారాజ్యం తరఫున బరిలోకి దిగి జగ్గిరెడ్డిపై విజయం సాధించారు. అనంతరం జగ్గిరెడ్డి వైకాపాలో చేరారు. 2014లో వైకాపా తరఫున పోటీ చేసిన చిర్ల .. బండారుపై 713 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లోనూ వీరిద్దరే మళ్లీ ప్రత్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.

నగరి: గత ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరిలో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. తెదేపా నుంచి దివంగత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు బరిలోకి దిగగా.. వైకాపా నుంచి ఆర్కే రోజా పోటీ చేశారు. ముద్దుకృష్ణమపై ఆమె కేవలం 858 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అనారోగ్యంతో గాలి ముద్దుకృష్ణమ నాయుడు మృతిచెందడంతో ఈసారి ఆయన కుమారుడు గాలి భానుప్రకాశ్‌కు తెదేపా టికెట్‌ ఇచ్చింది. వైకాపా నుంచి రోజాయే బరిలో నిలిచారు.

పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టులోనూ పోరు హోరాహోరీగానే జరిగింది. చివరికి తెదేపా అభ్యర్థి  లలిత కుమారిపై వైకాపా అభ్యర్థి ఎం.సునీల్‌ కుమార్‌ 902 ఓట్ల మెజారిటీతో గట్టెక్కారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సునీల్‌కు వైకాపా ఈసారి టికెట్‌ నిరాకరించిది. ఆయన స్థానంలో ఎమ్మెస్‌ బాబును అభ్యర్థిగా నిలిపింది. ఈ విషయంలో సునీల్‌ తీవ్ర మనస్తాపం చెందారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌కు వెళ్లి ఆ పార్టీ అధినేత జగన్‌ను కలవాలని ప్రయత్నించినప్పటికీ ఆయనకు అనుమతి లభించలేదు. ఈక్రమంలో సునీల్‌ ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమైన ఓ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టింది. మరోవైపు టికెట్‌ ఖరారు విషయంలో తెదేపాది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆ పార్టీ తొలుత తెర్లాం పూర్ణంకు టికెట్‌ కేటాయించింది. దీంతో అప్పటి వరకు అక్కడ తెదేపా ఇన్‌ఛార్జ్‌గా ఉన్న లలిత కుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ మంత్రి అమరనాథరెడ్డితో మొర పెట్టుకున్నారు. ఈ క్రమంలో చివరికి పూర్ణంను తప్పించి లలితకుమారికే తెదేపా టికెట్‌ను ఖరారు చేశారు.

చోడవరం: విశాఖ జిల్లా చోడవరంలో తెదేపా విజయం సాధించింది. వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీపై 909 ఓట్ల ఆధిక్యంతో తెదేపా అభ్యర్థి కలిదిండి సూర్యనాగ సన్యాసిరాజు గెలుపొందారు. 2009 ఎన్నికల్లోనూ సన్యాసిరాజునే విజయం వరించింది. అప్పుడు ధర్మశ్రీ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. తాజా ఎన్నికల్లోనూ వారిద్దరే ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. ఎన్నికల్లో తలపడటం వరుసగా వారికిది మూడోసారి.

సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తెదేపా అభ్యర్థి, ప్రస్తుత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు గెలుపొందారు. వైకాపా అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్ల మెజారిటీతో కోడెల విజయం సాధించారు. తెదేపా ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల (1983) నుంచి కోడెల నరసరావుపేట నుంచే పోటీ చేస్తూ 1999 వరకు వరుసగా గెలుపొందుతూ వచ్చారు.  అనంతరం 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో మాత్రం కోడెల సత్తెనపల్లి స్థానం నుంచి బరిలోకి దిగారు. మరోవైపు వైకాపా నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం అదే తొలిసారి. ప్రస్తుత ఎన్నికల్లోనూ తెదేపా నుంచి కోడెల, వైకాపా నుంచి అంబటే పోటీ చేస్తున్నారు.

కదిరి: అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో వైకాపా జెండా ఎగిరింది. అయితే ఆ ఆనందం పార్టీకి ఎంతో కాలం నిలవలేదు. వైకాపా ఎమ్మెల్యేగా గెలిచిన చాంద్‌బాషా 2016లో తెదేపాలో చేరారు. 2014 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్‌పై చాంద్‌బాషా 968 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చాంద్‌బాషాకు చంద్రబాబు టికెట్‌ నిరాకరించారు. ఆ నియోజకవర్గంలో తొలి నుంచి పార్టీ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న కందికుంట ప్రసాద్‌వైపే ఆయన మొగ్గు చూపి టికెట్‌ ఖరారు చేశారు. అటు వైకాపా డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డిని ఈసారి బరిలోకి దించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు