మాకు తెలుసులే.. పని చూసుకో..!

వార్తలు / కథనాలు

మాకు తెలుసులే.. పని చూసుకో..!

 చైనాకు భారత విదేశాంగశాఖ షాక్‌

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

తన హద్దులు మర్చిపోయి ఉపదేశాలు ఇవ్వబోయిన చైనాకు భారత విదేశాంగశాఖ గట్టి షాక్‌ ఇచ్చింది. ‘ఇదేమీ చైనా కాదు.. భారత్‌ ఇక్కడ మీడియా స్వేచ్ఛగా రిపోర్టింగ్‌ చేస్తుంది’ అని వెనకేసుకొచ్చింది. అప్పటికే తైవాన్‌ కూడా స్పందించి డ్రాగన్‌ తీరుపై దుమ్మెత్తి పోసింది. అసలే లద్దాఖ్‌ పరిణామాలతో మంచి కాకమీదున్న భారత్‌పై ఏదో పెత్తనం చేయాలనుకొని డ్రాగన్‌ పరువు పోగొట్టుకుంది.

అసలేం జరిగింది..

ఈ నెల 7వ తేదీన చైనా ఎంబసీ నుంచి మీడియాకు ఓ లేఖ విడుదలైంది. రానున్న ‘తైవాన్‌ జాతీయ దినోత్సవం’ను ఎలా కవర్‌ చేయాలో మీడియాకు జాగ్రత్తలు చెప్పింది. అసలు తైవాన్‌ అనేదే లేదు. ఉన్నా అది చైనాలో భాగం అని పేర్కొంది. ‘రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’, ‘దేశం’ అని రాయకూడదని పేర్కొంది. తైవాన్‌ అధ్యక్షురాలిని  ‘ప్రెసిడెంట్‌’ అని సంబోధించకూడదని జాగ్రత్తలు చెప్పింది. అలా చేయకపోతే సాధారణ ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని పేర్కొంది. భారత్‌ కూడా ‘వన్‌ చైనా పాలసీ’కి కట్టుబడి ఉందని గుర్తు చేసింది. 

అదే రోజు తైవాన్‌, చైనాలకు మధ్య మాటల యుద్ధం జరిగింది. తైవాన్‌ విదేశాంగ శాఖ కూడా ఓ ట్వీట్‌ చేసింది. ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో అద్భుతమైన మీడియా ఉంది. స్వేచ్ఛను ప్రేమించే ప్రజలున్నారు. కమ్యూనిస్టు చైనా తన సెన్సార్‌షిప్‌ నిబంధనలను అక్కడ కూడా అమలు చేయాలనుకుంటోంది. భారత్‌లోని తైవాన్‌ మిత్రులు దీనికి ‘గెట్‌లాస్ట్‌’ అని ఒక్కే ఒక్క సమాధానం చెప్పండి’ అని ట్వీట్‌లో పేర్కొంది. ఇది జరిగిన మర్నాడే చైనా దౌత్యకార్యాలయ అధికార ప్రతినిధి జి రోంగ్‌ ఓ ట్వీట్‌ చేశారు. అందులో కూడా చైనా ఒక్కటే ఉందని గుర్తు చేశారు. తైవాన్‌ దానిలో అంతర్భాగమన్నారు. భారత్‌ కూడా దీనికి కట్టుబడి ఉండటాన్ని అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘తైవాన్‌ స్వతంత్ర్యం అనేది కేవలం ఊహల్లో విషయమే’ అని ఎద్దేవా చేశారు. 

షాకిచ్చిన విదేశాంగ శాఖ..

చైనా దౌత్యవేత్తల నోరు మూయించాలని భారత విదేశాంగశాఖ నిర్ణయించింది. వెంటనే దాని అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ పీటీఐతో మాట్లాడుతూ..‘‘ భారత్‌లో మీడియా స్వేచ్ఛగా ఉంది. వివిధ అంశాలపై అది సరైనది అనుకున్నవి రిపోర్టు చేస్తుంది’’ అని చెప్పారు. 

డ్రాగన్‌కు ఇది కొత్తకాదు..

నాలుగు నెలల క్రితం జి రోంగ్‌ ఇటువంటి ట్వీటే చేశారు. అప్పట్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశాలు జరగనుండటంతో తైవాన్‌కు స్థానం దక్కకుండా చేసేందుకు ఇలా వ్యవహరించింది. తాజాగా 10వ తేదీన ‘నేషనల్‌ డే ఆఫ్‌ తైవాన్‌’  ఉండటంతో.. ముందు నుంచే ఆయా దేశాలు తైవాన్‌కు సంఘీభావం తెలపకుండా చైనా తాటాకు చప్పుళ్లను మొదలుపెట్టింది.

వన్‌ చైనా పాలసీని గౌరవించాలని డ్రాగన్ కోరుతుంది.. కానీ, భారత్‌లో కశ్మీర్‌ అంతర్భాగం అని మాత్రం అంగీకరించదు. పాకిస్థాన్‌కు ఎప్పుడూ తన మద్దతు తెలుపుతుంటుంది. చైనా దౌత్య అధికారులు భారత్‌ పత్రికల్లో ఏకపక్షంగా తమ దేశ లక్ష్యాలను పూర్తిచేసేలా ఓప్‌ఎడ్‌లు రాస్తుంటారు. కానీ, భారత అధికారులు చైనా పత్రికల్లో ఓప్‌ఎడ్‌ రాయడం మాత్రం చాలా కష్టమైన పని. సవాలక్ష ఆంక్షలు.. సెన్సార్‌షిప్‌ను దాటుకొని రావాలి. భారత్‌ మీడియాపై పెత్తనం చేయాలనుకున్న చైనాకు విదేశాంగ శాఖ ఎట్టకేలకు నేడు షాక్‌ ఇచ్చింది


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న