close

వార్తలు / కథనాలు

ఓ పానీపూరీ.. నీకు ఇన్ని పేర్లా..?

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పానీపూరీ’.. ఈ మాట వినగానే చాలా మందికి నోటిలో నీళ్లూరుతాయ్‌. దానికున్న క్రేజ్‌ అలాంటిది మరి. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు వయస్సుతో సంబంధం లేకుండా ఆవురావురుమంటూ లాగించేస్తారు. పులపుల్లగా.. ఘాటు ఘాటుగా.. ఉన్న పానీపూరీని నోట్లో వేసుకోగానే.. పోయిన ప్రాణం తిరిగిగొచ్చినట్టుగా అనుభూతి చెందిన వారూ లేకపోలేదు. తొలినాళ్లలో ఉత్తర భారతంలోనే మొదలైనట్లుగా చెప్పుకుంటున్న ఈ చిరుతిండి.. క్రమేపీ భారతదేశమంతా వ్యాపించింది. అక్కడితో ఆగకుండా బంగ్లాదేశ్‌, నేపాల్‌ లాంటి పొరుగు దేశాల్లోనూ తన ఉనికి చాటుకుంది. అయితే వీటిని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. ప్రాంతాన్ని బట్టి వాటి తయారీలోనూ తేడా కనిపిస్తుంది. అవేంటో తెలుసుకుందామా?

గప్‌చుప్‌.. గప్‌చుప్‌

తెలుగు రాష్ట్రాల్లో పానీపూరీని ‘గప్‌చుప్‌’ అని పిలుస్తారు. మైదాతో చేసిన గప్‌చుప్‌ల్లో బంగాళదుంప, మసాలా, ఉప్పు, కారం మిశ్రమాన్ని వేస్తారు. అందులో పుదీనా, చింతపండు, మిరియాలు తదితర దినుసులతో  తయారుచేసిన నీటిని పోస్తారు. కొన్ని చోట్ల బంగాళదుంపల మిశ్రమానికి బదులు బఠాణీలతో చేసిన చాట్‌ను వేస్తారు.  తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఒడిశా, ఝార్ఖండ్‌లోని దక్షిణ ప్రాంతం,చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనూ గప్‌చుప్‌లనే పిలుస్తారు.

పానీ పూరీ

ఈ పదాన్ని ఎక్కువగా  మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, నేపాల్‌లోని కొన్ని చోట్ల వాడుతుంటారు. అయితే ఆయా రాష్ట్రాల్లో ఒక్కోచోట దీని రుచి ఒక్కో విధంగా ఉంటుంది. ముంబయిలో బఠాణీలను బాగా ఉడకబెట్టి వాటిని మిశ్రమంగా తయారు చేసి  పానీపూరీలో వాడుతారు. చింతపండుతో తయారు చేసిన నీటిని ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల టమాటా సాస్‌ కూడా వినియోగిస్తారు. గుజరాత్‌లో బంగాళదుంపతోపాటు ఉడికించిన పెసలు, ఖర్జూరం ముక్కలను పానీపూరీలో వేస్తారు.

పుచ్కా

పానీపూరిని పశ్చిమబెంగాల్‌, అస్సాం రాష్ట్రాల్లో ‘పుచ్కా’ అని పిలుస్తారు. బంగ్లాదేశ్‌లోని చాలా ప్రాంతాల్లోనూ ఇదే పేరు వాడుకలో ఉంది. అయితే  ఇది రుచిలో పానీపూరీ కంటే భిన్నంగా ఉంటుంది. ఇక్కడా ఉడికించిన బంగాళదుంపలనే వాడుతారు. పుచ్కాలో ఉపయోగించే నీరు కూడా అటు తియ్యగా కాకుండా...ఇటు వగరుగా కాకుండా మధ్యస్థంగా.. కాస్తా ఘాటుగా ఉంటుంది. సాధారణ పానీపూరీల కంటే ఇక్కడ వాడేవి కాస్తా పెద్దవిగా ఉంటాయి. 

గోల్‌గప్పే

ఈ పదం ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వినిపిస్తుంది. హరియాణా తప్ప మిగతా అన్ని చోట్లా పానీపూరీని ‘ గోల్ గప్పే’ అనే పిలుస్తారు. దాదాపు అన్ని వీధుల్లోనూ స్టాళ్లు దర్శనమిస్తుంటాయి. దీనిని బట్టి ఆ చిరుతిండికి  అక్కడ ఉన్న డిమాండ్‌ ఎంతో ఇట్టే అంచనాకు రావచ్చు. ఉడికించిన బంగాళదుంపలు, బఠాణీ మిశ్రమంతో పాటు, ఘాటుగా, పుల్లగా ఉండే నీటిని వాడుతారు.

పకోడి

గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పానీపూరీని ‘పకోడి’ అని పిలుస్తారు.  అలా అని మనం నూనెలో వేయించుకునే ‘ పకోడా’ గా భ్రమపడితే మీరు తప్పులో కాలేసినట్లే.  ‘పకోడి’లో టమాట సాస్‌కు బదులుగా ఘాటుదనం కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు ఉపయోగిస్తారు.

పాని కె పటాషే

ఈ పదాన్ని ఎక్కువగా హరియాణా ప్రాంతంలో వాడుతుంటారు. రుచిలో ఇవి గోల్‌ గప్పీలను పోలి ఉంటాయి. కాకపోతే పరిమాణంలో మాత్రం వాటికంటే కాస్తా చిన్నవిగా ఉంటాయి.

పటాషి

రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో పానీపూరీని ‘పటాషి’ అని పిలుస్తుంటారు. ఇంకొందరు  ‘పానీ కీ బటాషే’ అని కూడా అంటారు. ఇందులోనూ బంగాళదుంపలు, బఠాణీలు వాడుతారు. అయితే  పటాషిలో వాడే నీరు మాత్రం  ఇతర ప్రాంతాల్లో కంటే భిన్నంగా ఉంటుంది. ఈ నీటిని మామిడికాయలతో తయారు చేస్తారు. అవి అందుబాటులో లేనప్పుడు మామిడి పొడినైనా ఉపయోగిస్తారట.

ఫుల్కి

గుజరాత్‌లో చపాతీలను ఫుల్కా అని పిలుస్తుంటారు. ఆ క్రమంలోనే ఫుల్కి అనే పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతాలు, నేపాల్‌లోని కొన్ని చోట్ల ఈ పదం వాడుకలో ఉంది.  ఎక్కడైనా పానీపూరీ దాదాపు ఒకేలా ఉంటుంది. కానీ, దానిలో వేసే మిశ్రమం, నీటిని బట్టి దాని రుచి మారుతుంది.  కొన్ని చోట్ల బంగాళదుంపతోపాటు పెరుగు కూడా వేస్తారు. దీనిని దహీ ఫుల్కి అంటారు.

టిక్కి

మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో మాత్రమే పానీపూరీని ‘ టిక్కీ’ అని పిలుస్తారు. వీరు ఉడికించిన బంగాళదుంపను  మెత్తగా చేసి వాటిలో ఉప్పు, కారం వేసి గుండ్రని చక్రాల్లా చేస్తారు. దీనిని ఖాళీ పానీపూరీలో వేసి.. ఘాటుగా ఉండే నీళ్లతో తింటారు.

పడక

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలిఘర్‌లో పానీపూరీని ‘పడక’ అని పిలుస్తారు. కేవలం పేరుమాత్రమే భిన్నంగా ఉంటుంది తప్ప.. రుచిలో మాత్రం అచ్చం గోల్‌గప్పీ లాగే ఉంటుంది.

వాటర్‌ బాల్స్‌

పానీపూరీని ఏమని పిలవాలో తెలియని వారు.. కాస్తో కూస్తో ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న వారు...వీటిని వాటర్‌ బాల్స్‌ అని కూడా పిలుస్తుంటారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు