close

వార్తలు / కథనాలు

ఆ రూ.14 వందల కోట్లు పిల్లికేనా?

పారిస్‌: ఈ ఫొటోలోని పిల్లిని చూశారా.. ఇది ప్రపంచంలోనే కోటీశ్వరురాలట. ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌ కార్ల్‌ లాగర్‌ఫెల్డ్‌ (85) ఈ పిల్లిని పెంచుకునేవారు. అది ‘బర్మీస్’‌ జాతికి చెందినది. దానికి ఆయన ముద్దుగా షౌపెట్‌ అని పేరు కూడా పెట్టుకున్నారు. ఈ పిల్లి రాజ భోగాలు అనుభవిస్తోంది. వెండి పళ్లెంలో ఆహారం తీసుకుంటుంది. 2011లో కార్ల్‌ ఈ పిల్లిని తన స్నేహితుడు, మోడల్‌ బాప్టిస్ట్ గయాబికోని నుంచి ఇష్టపడి తెచ్చుకున్నారు. కార్ల్‌ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. అద్భుతమైన డిజైనర్‌ను కోల్పోయామని ట్వీట్లు చేశారు.

కాగా మరణానికి ముందే కార్ల్‌ తనకు ఎంతో ఇష్టమైన పిల్లి బాగోగుల గురించి ఆలోచించారు. తన మరణం అనంతరం అది అంతే వైభవంగా, ఎటువంటి లోటు లేకుండా జీవించాలని కోరుకున్నారు. పిల్లి బాడీగార్డు, దాని మహిళా సేవకురాలును కొనసాగించాలని చెప్పారు. ‌‘షౌపెట్ ధనికురాలు’ అని ఓసారి ఫ్రెంచ్ టెలివిజన్‌తో కార్ల్‌ అన్నారు. దానికి తన ఆస్తి రాసిస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు పిల్లి పలు జపనీస్‌ కాస్మోటిక్‌ బ్రాండ్స్‌ ప్రకటనల్లో, జర్మన్‌ కారు‌‌ ప్రకటనల్లో కనిపించింది. దీని ద్వారా అది 3.4 మిలియన్‌ డాలర్లు సంపాదించింది. ఈ పిల్లికి సోషల్‌మీడియాలోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. అంతేకాదు షౌపెట్‌ హీరోగా ‘షౌపెట్‌: ది ప్రైవేట్‌ లైఫ్‌ ఆఫ్‌ ఎ హై ఫ్లైయింగ్‌ ఫ్యాషన్‌ క్యాట్‌’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. పిల్లిని భుజంపై పెట్టుకుని అనేక మంది సూపర్‌ మోడళ్లు ఫొటోలకు పోజులిచ్చారు.

ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ షనెల్‌కు కార్ల్‌ దుస్తుల్ని డిజైన్‌ చేశారు. ఇలా ఆయన సంపాదించిన ఆస్తిలో దాదాపు 200 మిలియన్‌ డాలర్లు (176 మిలియన్‌ యూరోస్‌) ఇప్పుడు పిల్లికి దక్కనున్నట్లు సమాచారం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు