close

వార్తలు / కథనాలు

థర్డ్‌ పార్టీ యాప్‌లు తస్మాత్‌ జాగ్రత్త!

ఇన్‌స్టాల్‌ చేశారో నగదు గోవింద!

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరిగిన తర్వాత ఒక బ్యాంకు ఖాతా నుంచి మరో ఖాతాకు నగదు బదిలీ చేయడం సులువైంది. దాదాపు అన్ని బ్యాంకులకు సొంత మొబైల్‌ యాప్స్‌ ఉన్నాయి. వీటి ద్వారా నగదు బదిలీ, ఇతర చెల్లింపులు చేయొచ్చు. అంతేకాకుండా, బిల్లు చెల్లింపులతో పాటు, నగదు బదిలీ తదితర సేవలకు పేటీఎం, తేజ్‌, బీమ్‌ సహా పలు యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు యాప్స్‌.. క్యాష్‌ బ్యాక్‌లు, రివార్డు పాయింట్ల పేరుతో వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే అక్రమార్కులకు వరంగా మారింది. వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని క్యాష్‌ చేసుకుని ఆన్‌లైన్‌ వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా థర్డ్‌ పార్టీ యాప్‌ల ద్వారా ఖాతాదారుల బ్యాంకు, వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి మోసాలకు తెర తీయడమూ అధికమవుతోంది. తాజాగా ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగు చూసిన నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్‌బీఐ హెచ్చరిస్తోంది. బెంగళూరుకు చెందిన మాజీ బ్యాంకు ఉద్యోగి ఒకరు ఇలాంటి థర్డ్‌ పార్టీ యాప్‌ కారణంగా లక్ష రూపాయలు కోల్పోయాడు.

సిండికేట్‌ బ్యాంకు విశ్రాంత ఉద్యోగి నారాయణ్‌ హెగ్డే ఇ-వ్యాలెట్‌ వినియోగదారుడు. తన కొత్త మొబైల్‌లో వ్యాలెట్‌ రీస్టోర్‌ చేయడానికి ఆన్‌లైన్‌ మొబైల్‌ వ్యాలెట్ల హెల్ప్‌లైన్‌ గురించి వెతగ్గా, ఎనీ డెస్క్‌ యాప్‌ కనిపించింది. ‘ఈ ఇన్‌స్టాల్‌ పూర్తయిన తర్వాత  మీకు వచ్చిన సందేశాన్ని ఫార్వర్డ్‌ చేయండి’ అని ఉండటంతో నారాయణ్ అలాగే చేశాడు. వెంటనే అతని ఖాతా నుంచి విడతల వారీగా రూ.లక్ష విత్‌ డ్రా అయినట్లు సందేశం రావడంతో వెంటనే బ్యాంకు బ్రాంచ్‌ని సంప్రదించాడు. ‘ఆదిత్య బిర్లా పేమెంట్స్‌ బ్యాంకు’ ఖాతాకు యూపీఐ ద్వారా రూ.1.24లక్షలు జమ అయినట్లు గుర్తించారు. దీంతో చేసేది లేక సైబర్‌ క్రైం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆర్‌బీఐ అన్ని బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. ‘ఆన్‌లైన్‌ మోసాలకు సరికొత్త వేదికలు వస్తున్నాయి. జాగ్రత్త’ అని సందేశం పంపింది. ఎనీ డెస్క్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారికి మోసగాళ్లు తొమ్మిది అంకెల కోడ్‌ను పంపి, దాని ఫార్వర్డ్‌ చేయడం ద్వారా ఖాతాదారుల మొబైల్‌ను సులభంగా యాక్సెస్‌ చేయగలుగుతున్నట్లు గుర్తించారు. ఎనీ డెస్క్‌ యాప్‌లాగానే మరికొన్ని యాప్స్‌ బ్యాంకు ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు ఆర్‌బీఐ గుర్తించింది. ముఖ్యంగా థర్డ్‌ పార్టీ యాప్‌లతో అందరూ జాగ్రత్తగా ఉండాలని, అధీకృతం కానీ, ఆర్బీఐ ధ్రువీకరించని యాప్‌లను అస్సలు ఇన్‌స్టాల్‌ చేయవద్దని వినియోగదారులకు సూచించింది. ఏవైనా థర్డ్‌ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసే సమయంలో బ్యాంకు ఖాతా వివరాలను, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సంఖ్యలను, ఓటీపీలను పిన్‌ నంబర్లను అడిగితే అలాంటి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయవద్దని ఆర్‌బీఐ హెచ్చరించింది.

అసలు థర్డ్‌ పార్టీ యాప్‌ అంటే ఏంటి?
మొబైల్‌ సంస్థ, ఆపరేటింగ్‌ సిస్టమ్‌ కాకుండా మూడో వ్యక్తి సొంతగా తయారు చేసిన యాప్‌లను థర్డ్‌ పార్టీ యాప్‌లు అంటారు. వీటితో ఆ సంస్థలకు, కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఒకవేళ సంస్థలే సొంతంగా యాప్‌లను తయారు చేసి అధికారికంగా విడుదల చేస్తే, దాన్ని ఫస్ట్‌ పార్టీ యాప్‌ లేదా నేటివ్‌ యాప్‌గా పిలుస్తారు. యాపిల్‌, గూగుల్‌ స్టోర్‌లో కనిపించే మెజార్టీ యాప్‌లలో థర్డ్‌పార్టీ యాప్‌లే ఎక్కువ. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్న సమయంలోనే మొబైల్‌కు సంబంధించిన వివిధ పర్మిషన్లను ఈ యాప్‌లు అడుగుతాయి. అవి అందించే సేవలు పొందాలంటే కొన్ని అనుమతులు తప్పక ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఏ యాప్‌లైతే బ్యాంకు ఖాతాల వివరాలు, క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల వివరాలు అడుగుతాయో వాటితో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి యాప్స్‌ను ఇన్‌స్టాల్‌ చేయకపోవడమే మంచిది అని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

యాప్‌స్టోర్‌లో ఉన్న థర్డీ పార్టీ యాప్‌లన్నీ ఒక్కటేనా?
దీనికి కాదనే సమాధానం చెప్పాలి. అయితే, ఈ యాప్‌లు ఒకే రకమైన రిస్క్‌ను కలిగి ఉండవు. ఉదాహరణకు గూగుల్‌ ప్లేస్టోర్‌ అన్ని దేశాల్లోనూ అందుబాటులో ఉండదు. అలాంటి వారు ఇతర స్టోర్‌ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. థర్డ్‌ పార్టీ యాప్‌లను నిరోధించడానికి ఎలాంటి నిబంధనలు లేవు. అవసరాన్ని బట్టి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, ఎక్కువ కాలం వినియోగించని యాప్‌లను అన్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పాటు, మొబైల్‌ కంపెనీ ఇచ్చే సెక్యురిటీ ప్యాచ్‌‌లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని చెబుతున్నారు.


Tags :

మరిన్ని