బైడెన్‌కు చైనా ‘అరుదైన’ స్వాగతం..!

వార్తలు / కథనాలు

బైడెన్‌కు చైనా ‘అరుదైన’ స్వాగతం..!

* అమెరికాపై డ్రాగన్‌ ఎదురుదాడి
* కీలక ఎగుమతులపై నేటి నుంచి ఆంక్షలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాకు సంబంధించిన కీలక ఎగుమతులను చైనా నిలిపివేసే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించడంతో దానికి ప్రతిగా చైనా ఈ చర్యలను చేపట్టింది. రక్షణ రంగానికి సంబంధించిన వస్తువులు.. అంశాలు దీనిలో ఉండే అవకాశం ఉంది. టిక్‌టాక్‌, హువావే, టెన్సెంట్‌ వంటి కంపెనీలపై అమెరికా ఆంక్షలతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచి అమల్లోకి వచ్చే చైనా సరికొత్త ఆంక్షలతో వాణిజ్యపోరు మరోస్థాయికి చేరనుంది. దీంతో ట్రంప్‌ శ్వేతసౌధం వీడే వరకూ వేచి చూసి ఆ తర్వాత బైడెన్‌ నిర్ణయాలకు అనుగుణంగా స్పందించే వైఖరిని డ్రాగన్‌ ఎంచుకోలేదని తెలుస్తోంది.

కొత్త చట్టంతో ఏం చేయబోతోంది..

వివిద రంగాల్లో నిషేధాలను చైనా ఎగుమతుల నియంత్రణ చట్టం అమల్లోకి తెస్తోంది. దీని కింద న్యూక్లియర్‌, మిలటరీ పరికరాలతోపాటు పౌర, మిలటరీకి వినియోగించే పరికరాలు ఉన్నాయి. ఇవన్నీ చైనా జాతీయ భద్రతకు అత్యంత కీలకమైనవిగా భావిస్తున్నారు. వీటిల్లోని పరికరాల ఎగుమతిదారులు కచ్చితంగా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఉల్లంఘిస్తే 7,60,000 డాలర్ల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. ఈ చట్టం ప్రకారం విదేశాల్లోని సంస్థలు, వ్యక్తులు దీనిని ఉల్లంఘించినా వారిని శిక్షంచే అధికారం చైనాకు దఖలు పడుతుంది. సాధారణంగా సూపర్‌ పవర్‌ అయిన అమెరికా ఇటువంటి చట్టాలను చేస్తుంటుంది. ఇప్పుడు చైనా కూడా తన బలాన్ని బహిరంగంగా ప్రదర్శించడానికి వెనుకాడటంలేదు. 

నాడు చెప్పిందే నిజమవుతోంది..

తాజా చట్టంతో చైనా నుంచి అమెరికాకు అవసరమైన రేర్‌ఎర్త్‌ ఖనిజాల ఎగుమతులకు మార్గం కష్టం కానుంది. గతంలో ఈ పనిచేస్తారని చైనా పీపుల్స్‌ డైలీ హెచ్చరించింది కూడా. ఇప్పుడు అది అమల్లోకి వచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయి. ఇదే జరిగితే అమెరికా ఆయుధ తయారీ రంగానికి భారీ షాక్‌గా చెప్పుకోవచ్చు. దీంతోపాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు కూడా నిలిచిపోయే అవకాశం ఉంది.

అరుదైన ఖనిజాల్లో చైనాకు తిరుగులేదు..

గత కొన్నేళ్లుగా చైనా అరుదైన ఖనిజాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదిగింది. ఈ దేశంలో పర్యావరణ పరిరక్షణ వంటి ఆంక్షలు లేకపోవడంతో ఇక్కడ మైనింగ్‌ పెరిగిపోయింది. ఫలితంగా 2014, 2017లో ప్రపంచంలో ఉత్పత్తి అయిన అరుదైన ఖనిజాల్లో చైనా నుంచి వచ్చిన వాటా 80శాతానికి పైమాటే. ఈ దేశం నుంచి ఏటా 160 మిలియన్‌ డాలర్ల విలువైన ఖనిజాలు ఎగుమతి అవుతున్నాయి. వీటిల్లో చాలా ఖనిజాలను ఆయుధాల తయారీకి వినియోగిస్తారు. దీంతో వీటిపై ఆంక్షలు తొలుత రక్షణ రంగాన్ని ప్రభావితం చేయనున్నాయి.

రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌(అరుదైన ఖనిజాలు) ఏమిటీ..?

17రకాల మూలకాలు ఉన్న గ్రూపును రేర్‌ ఎర్త్‌ మెటల్స్‌ అంటారు. అరుదైన అయస్కాంత, ఎలక్ట్రో కెమికల్‌ లక్షణాలు బట్టి వీటిని గుర్తిస్తారు. గడోలినియం, లాంథోనియం, సిరియం, ప్రోమెథియం వంటివి ఉన్నాయి. భూమిపై ఉన్న నిల్వల్లో అత్యధికంగా 37 శాతం చైనా వద్ద ఉన్నాయి. రక్షణ రంగంలో ఇవి అత్యంత కీలకమైనవని అమెరికా జియోలాజికల్‌ సర్వే ధ్రువీకరించింది. ఇవి చాలాచోట్ల దొరుకుతాయి. కానీ, తక్కువ మోతాదులో ఉండటంతో వెలికితీయటం ఖరీదైన వ్యవహారం. ఇవి ఎక్కువ మొత్తంలో దొరికే గనులు అత్యంత అరుదుగా ఉన్నాయి.

ఎక్కడ వినియోగిస్తారు..

వైద్య చికిత్సల్లో సర్జికల్‌ బ్లేడ్లు, పేస్‌ మేకర్లు, క్యాన్సర్‌ చికిత్స ఔషధాల్లో, టెలిస్కోప్‌ కటకాల్లో, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్లలో, ఆటో ఎగ్జాస్ట్‌ వ్యవస్థల్లో ఉత్ప్రేరకాలుగా వాడతారు. నియోడియం అనే ఖనిజాన్ని ఇన్ప్రారెడ్‌ లేజర్ల తయారీలో వినియోగిస్తారు. క్షిపణుల సెన్సర్లలో వాడతారు. అమెరికా దిగ్గజ సంస్థ ఆపిల్‌ తన ఫోన్లలో వినియోగించే కెమెరాల్లో వీటిని వాడుతుంది. కార్లలో వాడే రీఛార్జబుల్‌ బ్యాటరీల్లో కూడా వీటిని వినియోగిస్తారు. ఈ మూలకాలను రీసైక్లింగ్‌ చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ.

* అమెరికా ఎఫ్‌-35 విమానంలోని గైడెడ్‌ క్షిపణల తయారీలో వీటిని వినియోగిస్తారు. దీంతో పాటు ఒక్కో విమానంలో ఇటువంటి అరుదైన ఖనిజాలను 920 పౌండ్ల వరకు వాడతారు.

* యట్టీరియం, టెర్బియంలు లేజర్‌ గైడెడ్‌ ఆయుధాల తయారీకి వినియోగిస్తారు.

చైనా కాకుండా ఇంకెవరు ఉత్పత్తి చేస్తారు..

2010లో చైనా-జపాన్‌ల మధ్య కొన్ని వివాదాలు చోటు చేసుకొన్నాయి. దీంతో చైనా ఈ అరుదైన ఖనిజాలను జపాన్‌కు ఎగుమతి చేయడం ఆపేసింది. అదే సమయంలో ఈ ఖనిజాల నిల్వలను మలేషియా, బ్రెజిల్‌, ఏస్తోనియా, ఆస్ట్రేలియ, భారత్‌, దక్షిణాఫ్రికా, కెనడాల్లో కనుగొన్నారు. అమెరికా కూడా కాలిఫోర్నియాలో ఈ రకం ఖనిజాల గనులను కనుగొంది. కాకపోతే ఇక్కడ ఉత్పతి చేసిన ముడిఖనిజాన్ని ప్రాసెసింగ్‌ కోసం చైనాకే తరలిస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న