close

వార్తలు / కథనాలు

చందమామను చూసొచ్చి.. 50 వసంతాలైంది

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: సరిగ్గా 50 ఏళ్ల క్రితం అనంత విశ్వంలో ఓ అద్భుతం జరిగింది. భూమికి అల్లంత దూరాన మబ్బుల్లో దాగి ఉండే చందమామపై తొలిసారిగా ఓ మనిషి కాలుమోపాడు. ముగ్గురు వ్యోమగాములతో అపోలో 11 అనే వ్యోమనౌక రోదసిని చీల్చుకుంటూ చంద్రుడివైపు దూసుకెళ్లింది. జాబిల్లి రహస్యాలను తెలుసుకుని వారు తిరిగి సురక్షితంగా భూమిని చేరుకున్నారు. ఆ అడుగు ప్రపంచ గతినే మార్చేసింది. ఆ పాదముద్రకు, ఆ విజయానికి ఈ జులై 20 నాటికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా అపోలో 11 గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం.

తొలి పాదముద్ర ఆర్మ్‌స్ట్రాంగ్‌దే.. 

1962లో అమెరికా అధ్యక్షుడు జాన్‌ కెనెడీ ఈ చంద్రయాత్రకు శ్రీకారం చుట్టారు. ఎన్నో పరిశోధనలు, పరీక్షల తర్వాత 1969 జులై 16న ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్‌ సెంటర్ నుంచి శాటర్న్‌ వీ రాకెట్‌లో అపోలో 11 వ్యోమనౌక జాబిల్లిపైకి బయల్దేరింది. ఇందులో ముగ్గురు వ్యోమగాములు కూడా ఉన్నారు. వారే నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, బజ్‌ ఆల్డ్రిన్‌, మైఖెల్‌ కోలిన్స్‌. జులై 20న అపోలో 11 చంద్రుడిపైకి చేరుకుంది. నీల్‌, ఆల్డ్రిన్‌ లూనార్‌ మాడ్యూల్‌లో చంద్రుడిపై దిగగా.. కోలిన్స్‌ మాత్రం కమాండ్‌ మాడ్యూల్‌లో ఉండి కక్ష్యలో తిరుగుతూ ఉన్నారు. 

లూనార్‌ మాడ్యూల్‌ దిగగానే వ్యోమగాములు వెంటనే అందులో నుంచి బయటకు రాలేదు. దాదాపు ఆరున్నర గంటల తర్వాత కమాండర్‌ నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మాడ్యూల్‌ తలుపు తెరుచుకుని తొలిసారిగా చంద్రుడిపై కాలు పెట్టారు. ఆ తర్వాత 19 నిమిషాలకు ఆల్డ్రిన్‌ కూడా దిగారు. దాదాపు 2.15 గంటల పాటు వీరిద్దరూ జాబిల్లిపై తిరిగారు. చందమామపై అమెరికా జెండా ఎగురవేశారు. అక్కడి నుంచే దేశాధ్యక్షుడితో మాట్లాడారు. పరిశోధనల నిమిత్తం 21.5 కిలోల పదార్థాలను సేకరించారు. 

ఎన్నో సవాళ్లను దాటుకుని.. 

చంద్రుడిపైకి వెళ్లడమంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో మనోధైర్యం కావాలి. అందుకే ఎంతోమందిని పరీక్షించి నీల్‌, ఆల్డ్రిన్‌, కోలిన్స్‌ను ఈ యాత్రకు ఎంచుకుంది నాసా. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ యాత్ర ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ ముగ్గురు భూమికి తిరిగొచ్చేవరకు యావత్‌ ప్రపంచం ఊపిరి బిగబట్టి చూసింది. అయితే చంద్రుడి ఉపరితలాన్ని తాకగానే ముడుచుకోవాల్సిన మాడ్యూల్‌ కిందిభాగం అలాగే ఉండిపోయింది. దీంతో నీల్‌ నాలుగడులు ఎత్తు నుంచి దూకాల్సి వచ్చింది. ఇక తిరుగు ప్రయాణంలో ఒక సర్క్యూట్‌లోంచి స్విచ్‌ ఊడిపోయింది. అది లేకపోతే టేకాఫ్‌ సాధ్యం కాదు. దీంతో ఆల్డ్రిన్‌ తన జేబులో ఉన్న పెన్నును సర్క్యూట్‌లో పెట్టడంతో అది పనిచేసింది. అలా ఎన్నో సవాళ్లను అధిగమించి జులై 24న వారు సురక్షితంగా భూమి మీదకు చేరుకున్నారు. 

జాబిల్లిపై మాట్లాడిన తొలి మాట.. 

చంద్రుడిపై దిగగానే నీల్‌ మాట్లాడిన తొలి మాట ఏంటో తెలుసా.. ‘ఇది మనిషి వేసిన మొదటి చిన్న అడుగు. మానవజాతి వేసిన పెద్ద పురోగతి’ అని అన్నారు. ఆ తర్వాత జాబిల్లిపై నడిచి ఫొటోలు తీసుకున్నారు. తమ జాతీయ జెండాను పాతి దేశభక్తిని చాటుకున్నారు. చందమామను నిశితంగా పరిశీలించి అక్కడి నుంచి రాళ్లు, మట్టి, ఇతర పదార్థాలను భద్రంగా మూటగట్టుకుని తీసుకొచ్చారు. 

అడుగుజాడలు ఇప్పటికీ.. 

చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపి 50ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ ఆ అడుగుజాడలు కన్పిస్తాయట. గాలి లేకపోవడతో అవి చెరిగిపోలేదని శాస్త్రవేత్తలు చెబుతారు. అయితే నీల్‌ ఎగరేసిన అమెరికా జెండా మాత్రం లేదు. అంతరిక్ష నౌక బయల్దేరి వచ్చేప్పుడు వెలువడిన వేడికి అది మాడిపోయింది. 

ఎవరీ నీల్‌.. 

నీల్‌ స్వస్థలం అమెరికాలోని ఒహైయో. 1930 ఆగస్టు 30న జన్మించారు. పర్డ్యూ యూనివర్సిటీ నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదివిన నీల్‌.. కొరియన్‌ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధవిమానాలకు పైలట్‌గా ఉన్నారు. 1962లో నాసా వ్యోమగాముల కార్పొరేషన్‌లో చేరాడు. 1966లో జెమినీ 8 యాత్రకు కమాండ్‌ పైలట్‌గా చేశారు. నీల్‌కు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కంటే ముందే ఫ్లైట్‌ సర్టిఫికెట్‌ వచ్చిందట.

ఆ తర్వాత ఏమయ్యారు..

చంద్రుడిపైకి వెళ్లి తిరిగొచ్చిన తర్వాత చాలా రోజుల వరకు వీరు పెద్దగా బయటి ప్రపంచానికి కన్పించలేదని వార్తలు ఉన్నాయి. అయితే అందులో నిజం లేకపోలేదు. యాత్ర ముగించుకుని తిరిగొచ్చాక.. ఈ ముగ్గురినీ 21 రోజుల పాటు ఓ గదిలో ఉంచారట. వారి వెంట ఏమైనా వ్యాధికారక సూక్ష్మజీవులు ఉంటే అవి నశిస్తాయని అలా చేశారు. అయితే భూమికి తిరిగొచ్చాక.. తాను ఇక ఎప్పుడూ అంతరిక్షంలోకి వెళ్లనని నీల్‌ చెప్పారట. ఆ తర్వాత 1971లో నాసాకు రాజీనామా చేసిన నీల్‌.. బోధనావృత్తిలో స్థిరపడ్డారు. సిన్సినాటి యూనివర్సిటీలో ఏరోస్పేస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. రాజకీయాల్లోకి రావాలంటూ ఎంతో మంది సంప్రదించినప్పటికీ నీల్‌ ఆసక్తి చూపించలేదు. 2012 ఆగస్టులో ఆయన గుండె జబ్బుకు గురయ్యారు. బైపాస్‌ సర్జరీ చేసినప్పటికీ ఫలించలేదు. చికిత్స పొందుతూ అదే ఏడాది ఆగస్టు 25న తన 82ఏళ్ల వయసులో నీల్‌ తుదిశ్వాస విడిచారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు