close

వార్తలు / కథనాలు

-60 డిగ్రీలు.. రోజుకు ₹ 5కోట్లు

సియాచిన్‌ గురించి ఆసక్తికర విషయాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎత్తయిన మంచుకొండలు.. మైమరిపించే ప్రకృతి అందాలు. ఓ వైపు పాకిస్థాన్‌.. మరోవైపు చైనా. ఇంకోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు. ఇది సియాచిన్‌లోని పరిస్థితి. ఇటీవలే దీన్ని పర్యాటక ప్రాంతంగా భారత్‌ ప్రకటించింది. పాక్‌ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది వివాదాస్పద ప్రాంతమని, అందులో భారత్‌ పర్యాటకుల సందర్శన కోసం తెరవడమేంటని ప్రశ్నిస్తోంది. ఇంతకీ ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఏంటి? సైనికులు ఎదుర్కొనే ఇబ్బందులు ఏంటి? ఈ ప్రాంతంపై పట్టుకోసం భారత్‌-పాక్‌ ఏం చేశాయి వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..


పర్యాటక ప్రదేశం: సియాచిన్‌


ప్రత్యేకత: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం, సుమారు 76 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.


ఎక్కడుంది: లద్దాఖ్‌లో. 20వేల అడుగుల ఎత్తులో ఉంది. సియాచిన్‌ బేస్‌క్యాంప్‌ నుంచి కుమార్‌ పోస్ట్‌ ప్రాంతం వరకూ పర్యాటకులు చూడొచ్చు.


పర్యాటకం ఎప్పుడైంది?: ఇటీవల లద్దాఖ్‌లోని షియోక్ నది దగ్గర నిర్మించిన వ్యూహాత్మక ‘కల్నల్ చెవాంగ్ రించెన్ బ్రిడ్జ్’ను ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌తో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సియాచిన్‌ను పర్యాటక ప్రాంతంగా ప్రకటించారు.


ఎందుకంత కీలకం?: మధ్య ఆసియాకు భారత ఉపఖండానికి సియాచిన్‌ సరిహద్దుగా ఉంది. పాకిస్థాన్‌-చైనాను ఇది వేరు చేస్తోంది. గిల్గిట్‌, బాల్టిస్థాన్‌పై ఓ కన్నేసి ఉంచేందుకు, చైనా అడుగులను ఎప్పటికప్పుడు గమనించేందుకు భారత్‌కు ఇది పనికొస్తుంది.


లక్ష్యమేమిటి?: లద్దాఖ్‌లో పర్యాటకానికి ఊతం అందించడంతో పాటు.. అసాధారణ వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సైన్యం, ఇంజినీర్లు సాగిస్తున్న కృషిని ప్రజలు ప్రత్యక్షంగా చూసేందుకు వీలు కల్పించడం.


వాతావరణ పరిస్థితులు: సియాచిన్‌ ప్రాంతం నిజానికి ఒక హిమనీనదం. చలికాలంలో ఇక్కడ ఉష్ణోగ్రతలు మైనస్‌ 60 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతాయి.


సవాళ్లు: పాకిస్థాన్‌, చైనా మిలటరీ నుంచే కాక ఇక్కడి వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం  భద్రతా సిబ్బందికి కత్తిమీద సాములాంటిది. ఇక్కడ మంచు చరియలు నిత్యం విరిగిపడుతుంటాయి. తీవ్రస్థాయి వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ సైనికులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రత్యర్థి దాడుల కంటే ఇక్కడ వాతావరణ అననుకూల పరిస్థితుల వల్ల చనిపోయే సైనికులే అధికం.


ఇప్పటి వరకు..: 1984 నుంచి ఇప్పటి వరకు ఇక్కడి వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల 869 మంది భారత సైనికులు చనిపోయారు. మరో 2 వేల మంది పాక్‌ సైనికులు సైతం మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 2012లో సియాచిన్‌లోని గ్యారీ ప్రాంతంలో మంచుచరియలు విరిగి ఆర్మీ క్యాంప్‌పై పడిన ఘటనలో 140 మంది పాక్‌ సైనికులు మృతిచెందారు. 


నిర్వహణ: సియాచిన్‌ ప్రాంతం నిర్వహణకు రోజుకు రూ.5 కోట్లు చొప్పున భారత ఆర్మీ ఖర్చు చేస్తోంది. కేవలం పర్వత ప్రాంతంలో ధరించే దుస్తులు, సంబంధిత పరికరాల కోసం కేవలం  రూ.7,500 కోట్లు భారత్‌ ఖర్చు చేసింది. 


రెండు దేశాలు పట్టు: వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న సియాచిన్‌ ప్రాంతంపై పాక్‌ తొలుత కన్నేసింది. 1970లో పర్వతారోహణ పేరిట ఇక్కడ పాక్‌ తమ సైనికులను మోహరించింది. 1981లో భారత ఆర్మీకి చెందిన కల్నల్‌ నరేందర్‌ బుల్‌ కుమార్‌ పాక్‌ చొరబాట్లను గుర్తించారు. ఈ ప్రాంతంపై పట్టు సాధించేందుకు పాక్‌ పర్వతారోహణ పరికరాలను ఓ లండన్‌ కంపెనీకి పెద్ద ఎత్తున ఆర్డరిచ్చింది. అదే కంపెనీ భారత్‌కు కూడా వాటిని సరఫరా చేస్తోంది. దాని ద్వారా పాక్‌ ఆక్రమణ కుట్రను భారత్‌ ముందుగానే గ్రహించింది.


పాక్‌ కంటే ముందుగా..: పాక్‌ కుట్రను ముందుగా తెలుసుకున్న భారత్‌ ‘ఆపరేషన్‌ మేఘ్‌దూత్‌’ పేరిట వెంటనే భద్రతా దళాలను సియాచిన్‌లో మోహరించింది. పాక్‌ దళాల కంటే ముందే భారత దళాలు అక్కడికి చేరుకున్నాయి. వారు అక్కడకు చేరుకునేలోపే ఆ ప్రాంతంపై భారత్‌ పట్టు సాధించింది. దీని వెనుక కల్నల్‌ కుమార్‌ కృషిని గుర్తించి ఇక్కడి ఒక పోస్ట్‌కు ఆయన పేరు పెట్టారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు