close

వార్తలు / కథనాలు

ఎవరీ కింగ్స్‌.. ఏంటీ వీళ్ల కథ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ది కింగ్స్‌’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు. సాధారణ వ్యక్తుల దగ్గరి నుంచి బాలీవుడ్‌ అగ్రహీరోల వరకూ అందరూ ‘ది కింగ్స్‌’ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల జరిగిన ‘వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌’ ఈవెంట్‌లో విజేతలుగా నిలిచి అందరి హృదయాలను గెలిచిన బృందమే ఈ ‘కింగ్స్‌ యునైటెడ్‌’. అంతేకాదు, భారతదేశం తరపున ఈ ఈవెంట్‌లో గెలిచిన తొలి బృందం ‘కింగ్స్‌ యునైటెడ్‌’ కావడం విశేషం. మరో విశేషమేమిటంటే, ఫైనల్‌ రౌండ్‌లో పవన్‌ కల్యాణ్ నటించిన ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లోని ‘వాడెవడన్నా.. వీడెవడన్నా..’ అనే పాటను రీమిక్స్‌ చేసి డ్యాన్స్‌కు న్యాయ నిర్ణేయతలు జెన్నిఫర్‌ లోపేజ్‌, నీ-యో, డెరిక్‌ హాగ్‌తో పాటు, అది చూసిన ప్రేక్షకులు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వందకు వంద పాయింట్లు సాధించి, మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌మనీ సైతం సొంతం చేసుకున్నారు. 

‘కింగ్స్‌ యునైటెడ్‌’ ప్రస్థానం ఇలా సాగింది...!
* ముంబయికి చెందిన హిప్‌-హాప్‌ డ్యాన్స్‌ బృందమే ‘కింగ్స్‌ యునైటెడ్‌’ . ఇందులో మొత్తం 14 మంది సభ్యులున్నారు. 

* వీరంతా ముంబయి సమీపంలోని నాలాసోపర ప్రాంతానికి చెందిన యువత.

* ‘కింగ్స్‌ యునైటెడ్‌’ బృందాన్ని 2009లో సురేష్‌ ముకుంద్‌, వెర్నన్‌ మోంట్రియో కలిసి ఏర్పాటు చేశారు. 

* మొదట్లో ఈ బృందం ‘ఫిక్టీషియస్‌’ అనే పేరుతో పోటీల్లో పాల్గొనేది. 

* ఆరంభంలో లోకల్ డ్యాన్స్‌ పోటీల్లో పాల్గొని రూ.500 నగదు బహుమానాన్ని ఈ గ్రూప్ గెలుచుకుంది. ఆ డబ్చే వారికి రియల్టీ షోలల్లో పాల్గొనేందుకు సహాయపడింది. 

* దేశవ్యాప్తంగా జరిగే అనేక డ్యాన్స్‌ పోటీల్లో ఈ బృందం పాల్గొంది. ‘బూగీ ఊగీ’, ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ కే లియే కుచ్‌ బి కరేగా, ఇండియాస్‌ గాట్‌ టాలెంట్‌’ తదితర షోల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. 

* ఆ తర్వాత 2011 టాలెంట్ సీజన్ 3లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న ‘కింగ్స్‌ యునైటెడ్‌’ గ్రూపు దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. *  2012లో జరిగిన వరల్డ్‌ హిప్‌ హాప్‌ ఛాంపియన్స్‌లో కింగ్స్‌ ఫైనల్స్‌కు చేరింది. ఇదే దర్శకుడు రెమో డిసౌజ్‌ ‘ఏబీసీడీ2’ తీయడానికి స్ఫూర్తి. 2015లో ఇదే పోటీలో కాంస్య పతకం సొంతం చేసుకుంది. 

* 2016 ఐపీఎల్‌ ప్రారంభ వేడుకల్లోనూ ‘ది కింగ్స్‌’ అద్భుత ప్రదర్శన చేసింది. 

* హాలీవుడ్‌ నటి జెన్నిఫర్‌ లోపేజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ అనే అమెరికన్‌ రియాల్టీ షోను నిర్వహిస్తున్నారు. 

* ఇప్పటివరకూ మూడు సీజన్లను వరల్డ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌ పూర్తి చేసుకుంది. 

* ఇందులోని విజేతకు ఒక మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీ అందజేస్తారు. 

* మొత్తం ఇది నాలుగు విభాగాల్లో జరుగుతుంది. జూనియర్‌, అప్పర్‌, జూనియర్‌ టీమ్‌, అప్పర్‌ టీమ్‌. 

* ఉత్తమ ప్రదర్శనకు 20 పాయింట్లు, టెక్నిక్‌కు 20, కొరియోగ్రఫీకి 20, క్రియేటివిటీకి 20, ప్రెజెంటేషన్‌కు 20 ఇలా 100 పాయింట్లు ఉంటాయి.

* ఏడాది మొత్తం 12 బృందాలు ఈ పోటీలో పాల్గొనగా, దక్షిణ కొరియాకు చెందిన హీమియా, లాస్‌ ఏంజిల్స్‌కు చెందిన యునిటీ ఎల్‌ఏ, ముంబయికి చెందిన కింగ్స్‌ యునైటెడ్‌ చివరి వరకూ నిలిచాయి.


* ఇందులో ‘ది హీమియా’కు 100కి 95.3 స్కోరు సాధించగా, యునిటీ ఎల్‌ఏకు 96 మార్కులు వచ్చాయి. ఇక కింగ్స్‌ యునైటెడ్‌ వందకి వంద సాధించి, ఈ ఏడాది విజేతగా నిలిచింది. 

* ఫిబ్రవరి 26న నుంచి మార్చి 10 వరకూ జరిగిన క్వాలిఫయర్‌ రౌండ్‌లో ‘కింగ్స్‌ యునైటెడ్‌’ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ‘ధక్కా లగా బుక్కా యువ’ పాటకు డ్యాన్స్‌ చేసింది. ఈ పాటకు 97.7 స్కోరు సాధించింది. 

* తర్వాతి రౌండ్‌లో విశాల్‌ దద్లానీ ‘మల్హరి...’ పాటకు ఇచ్చిన ప్రదర్శనకు గానూ, 99.3 స్కోరు సాధించారు. 

* ఆ తర్వాత ఏప్రిల్‌ 28న జరిగిన మరో పోటీలో అనుపమ ‘యహీ రాత్‌...’ పాటకు 99.7 స్కోరు సాధించగా, ఫైనల్‌ రౌండ్‌లో ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’లోని ‘వాడెవడన్నా.. వీడెవడన్నా’ పాటకు ఇచ్చిన ప్రదర్శనకు గానూ  వందకు వంద సాధించి మిలియన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీతో పాటు, కోట్లాది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. 

* ఫైనల్‌లో వీరు చేసిన డ్యాన్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయింది. యూట్యూబ్‌లో ఇప్పటివరకూ ఈ ఫైనల్స్‌ను 6.4 మిలియన్లకు పైగా వీక్షించారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు