close

వార్తలు / కథనాలు

పబ్‌జీకి పోటీగా వచ్చేస్తున్నాయ్‌!

నలుగురు కుర్రాళ్లు కలిసి ఓ మూలన కూర్చొని మాట్లాడుకుంటున్నారు...
అది సినిమా కోసమో, క్రికెట్‌ కోసమో కాదు. అసలు అది వాళ్లలో వాళ్లు కాదు... 

వాళ్లు మాట్లాడుతోంది మొబైల్‌తో.. అవును చేతిలో ఉన్న మొబైల్‌ తోనే....
కమాన్‌ ఈస్ట్‌ 225లో చూడు... ఆ కొండరాయి వెనుక... స్మోక్‌ వేశాడు చూడు... ముందు నీ గన్‌ రీలోడ్‌ చేయ్‌.. నేను వెనకాలే వస్తున్నా!
మీకు ఇప్పటికే అర్థమైపోయుంటుంది.. వాళ్లు పబ్జీ గేమ్‌ ఆడుతున్నారని. యువతను అంతగా అలరిస్తున్న ఈ ఆట పట్ల కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ... ఆ ఆటపై యువత చూపిస్తున్న మోజు చూసి మరికొన్ని సంస్థలు తమ బ్యాటిల్‌ గేమ్స్‌ మొబైల్‌ వెర్షన్‌ను తీసుకొస్తున్నాయి. పబ్జీలానే కనిపిస్తూ... అంతకుమించి వినోదాన్ని అందిస్తున్న ఆ ఆటలు త్వరలో మీ మొబైల్స్‌లోకి రాబోతున్నాయి!

కాల్‌ ఆఫ్‌ డ్యూటీ

పబ్జీ గేమ్‌కి అదనపు హంగులతో రూపొందిన ఆట కాల్‌ ఆఫ్‌ డ్యూటీ (సీవోడీ). 2003 నుంచే ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ అది కేవలం ప్లే స్టేషన్లకే పరిమితమైపోయింది. దీనికి మొబైల్‌ వెర్షన్‌ను త్వరలో తీసుకురాబోతున్నట్లు దాని మాతృ సంస్థ టెన్సెంట్‌ ఇటీవల ప్రకటించింది. బీటా యూజర్లకు/ ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఆండ్రాయిడ్‌ యూజర్లకు ఈ గేమ్‌ అందుబాటులోకి వచ్చింది కూడా. నవంబరు 14 తర్వాత ఈ గేమ్‌ స్టేబుల్‌ వెర్షన్‌ను రిలీజ్‌ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

 

అపెక్స్‌ లెజెండ్స్‌

పబ్జీలో విమానం నుంచి పారాచ్యూట్‌తో దూకుతుంటారు. కానీ ఈ ఆటలో రాకెట్‌ సూట్‌తో దూకుతారు. పబ్జీలో అయితే పరిగెత్తడం, లేదంటే వెహికల్‌లో వెళ్లడం లాంటివి చేయొచ్చు. కానీ ఈ ఆటలో మాయమైపోవచ్చు. ఆసక్తికరంగా ఉంది ఈ ఆట ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇది అపెక్స్‌ లెజెండ్స్‌. పబ్జీ తరహాలోనే ఉండే ఈ ఆట ఇప్పుడు మొబైల్‌ వెర్షన్‌లోకీ రాబోతోంది. అయితే విడుదల తేదీ విషయంలో అధికారికంగా ఎలాంటి ప్రకటన రానప్పటికీ ఈ ఏడాది చివరిలో అపెక్స్‌ లెజెండ్స్‌ మీ మొబైల్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది.

 

హెచ్‌1 జడ్‌1: బ్యాటిల్‌ రాయల్‌

పబ్జీ ఆడుతున్నప్పుడు మిమ్మల్ని కబళించడానికి ఓ నీలం రంగు పొగ వచ్చేస్తుంటుంది. దీనిని బ్లూఫాగ్‌ అంటుంటారు. కానీ ‘హెచ్‌1జెడ్‌1’లో అయితే విషపూరిత టాక్సిక్‌ గ్యాస్‌ వస్తుంది. దానిని పీలిస్తే ఇక ఆట ఖతం. ఆసక్తికరంగా ఉంది కదా. త్వరలో మీరూ ఈ ఆట ఆడొచ్చు.  సెప్టెంబరు 2018లో డేబ్రేక్‌ గేమింగ్‌ కంపెనీ ప్లేస్టేషన్‌ కోసం ఈ ఆటను రూపొందించింది. ఇప్పుడు దీనిని అప్‌డేట్‌ చేసి మొబైల్‌ వెర్షన్‌గా తీసుకొస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్, ఐవోఎస్‌ యూజర్లకు ఈ ఏడాది అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

 

బ్యాటిల్‌ఫీల్డ్ వి: ఫైర్‌ స్టార్మ్‌

హాలీవుడ్‌ సినిమాల్లో హీరో ఓ కొత్త తరహా గ్లాసెస్‌ పెట్టుకుంటాడు. ఆ వెంటనే విలన్‌ గ్రూప్ చీకట్లో ఎంత దూరంలో ఉన్నా మెరుస్తూ కనిపిస్తారు. ఇంకేముంది హీరో స్నైపర్‌తో కాల్చిపారేస్తాడు. బాటిల్ ఫీల్డ్‌ వి: ఫైర్‌ స్టార్మ్‌ గేమ్‌లోనే ఇలాగే ఉంటుంది. ఈ ఆట కూడా అచ్చంగా పబ్జీలానే ఉంటుంది. అయితే ఆట ఆడే ప్రదేశాలు, గన్‌లు, బాంబులు కొంచెం కొత్తగా ఉంటాయి. ఇన్నాళ్లూ ప్లేస్టేషన్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఆట మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తుందనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే  ఈ గేమ్‌ రూపకర్త డైస్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ బ్యాటిల్‌ఫీల్డ్‌ను మొబైల్‌ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.  

- ఇంటర్నెట్‌ డెస్క్‌

|

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు