close

వార్తలు / కథనాలు

ఐపీఎల్‌ బ్రాండ్‌ @ రూ.43,000 కోట్లు

భారత ఆర్థిక రంగ వృద్ధికి ఊతం

 ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ అంటే అందరికీ తెలిసింది అద్భుతమైన ఆట, నరాలు తెగే ఉత్కంఠ, స్టేడియం పైకప్పును తాకే సిక్సర్లు, సొగసైన బౌండరీలు, ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్‌. మరి వ్యాపారవేత్తల మాటేంటో తెలుసా?కాసుల గలగలలు, సిరుల పంట, ఆటగాడు సిక్సర్‌ బాదితే వచ్చేదెంత? క్యాచ్‌ మిస్‌ చేస్తే పోయేదెంత?ఇంకా చెప్పాలంటే వారి దృష్టిలో ఐపీఎల్‌ అంటే ‘ఇండియన్‌ ప్రాఫిటబుల్‌ లీగ్‌’. 

ఓ వైపు ఆటతో మరో వైపు ఆర్జనతో అదరగొడుతోందీ లీగ్‌. ఆటగాళ్ల, యాజమాన్యాల సంపదను ఏటా రెట్టింపు చేస్తోంది. పరుగుల వరదతో తడిసిన మైదానాల్లో సిరుల పంట పండిస్తోంది. అంతేనా! ప్రపంచంలోనే అత్యధిక బ్రాండ్‌ విలువ కలిగిన టాప్‌-5 లీగుల్లో ఒకటి. ఇంకా చెప్పాలంటే భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి కారకం అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. మౌలిక సదుపాయాలు, రవాణా, కొనుగోలు, మార్కెటింగ్‌, వ్యాపార నిర్వహణ, ప్రచారం అనేక రంగాల్లో కొన్ని వందల మందికి ఉపాధి అందించిన కల్పవల్లి. ఆర్థిక వృద్ధికి తోడ్పాటునందిస్తూ తన బ్రాండ్‌ విలువను పెంచుకుంటోంది.

ఇంతింతైన ‘బ్రాండ్‌ విలువ’

ఐపీఎల్ ఇంతింతై వటుడింతై అన్నచందంగా ఎదిగింది. ఒక పాదంతో పృథ్వీ మండలాన్నీ మరో పాదంతో వినీలాకాశాన్నీ తాకిన వామనుడిలా మారింది. అప్పటి బీసీసీఐ ఉపాధ్యక్షుడు లలిత్‌ మోదీ మానస పుత్రికైన ఐపీఎల్‌ రంగప్రవేశమే ఓ సంచలనం. 2008లో కేవలం 723.59 మిలియన్‌ డాలర్లతో ఆరంభమైన ఈ లీగ్‌ బ్రాండ్‌ విలువ 2018కి 6.3 బిలియన్‌ డాలర్లకు అంటే దాదాపు రూ.43,000 కోట్లకు చేరుకుంది. అంతేనా, 2015లో దేశ స్థూల జాతీయోత్పత్తికి రూ.1,150 కోట్లు (182 మిలియన్‌ డాలర్లు) అందించింది. ప్రత్యక్ష, పరోక్ష లావాదేవీలను కలుపుకుంటే ఈ మొత్తం రూ.2,650 కోట్లుగా (418 మిలియన్‌ డాలర్లు) ఉంటుంది. అలా దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఓ కారకంగా మారింది ఐపీఎల్‌. 2019 సీజన్‌ పూర్తైతే లీగ్‌ బ్రాండ్‌ విలువ దాదాపు రూ.50,000 కోట్లైనా ఆశ్చర్యం లేదు. 

అంబాని ఫ్రాంచైజీకే అగ్రస్థానం 

ఐపీఎల్‌ బ్రాండ్‌ విలువను ఫ్రాంచైజీల ఆధారంగా లెక్కిస్తారు. ఒక ఫ్రాంచైజీ విలువ పెరగాలంటే అందుకెన్నో కారకాలు ఉంటాయి. ఆటగాళ్లు, జట్టు ప్రదర్శన, యాజమాన్యం, వ్యాపార నిర్వహణ, సహాయక సిబ్బంది, మెరుగైన వసతులు, అభిమానుల అండ వంటివి మరెన్నో ఉంటాయి. ఇలా చూస్తే లీగ్‌లోని ఎనిమిది జట్లలో ముంబయి ఇండియన్స్‌దే అగ్రస్థానం. 2017లో 106 మిలియన్‌ డాలర్లుగా ఉన్న ముంబయి బ్రాండ్‌ విలువ 7% పెరిగి 2018లో 113 మిలియన్‌ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ విలువ 2017లో 99 మిలియన్‌ డాలర్ల కాగా 5% వృద్ధితో 104 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీలు 2018లో 98 మిలియన్‌ డాలర్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. బెంగళూరు అంతకు ముంది ఏడాదితో 11% వృద్ధి సాధించింది. ఇక సన్‌రైజర్స్‌ విలువ ఏకంగా 25% పెరగడం విశేషం. 2017లో  56 మిలియన్‌ డాలర్లు ఉండగా అదిప్పుడు 70 మిలియన్‌ డాలర్లకు చేరుకుంది. దిల్లీ డేర్‌డెవిల్స్‌, కింగ్స్‌ ఎలెవన్‌ సంయుక్తంగా 6వ స్థానం దక్కించుకున్నాయి. 18% వృద్ధితో దిల్లీ 44 నుంచి 52, 27% వృద్ధితో పంజాబ్‌ 41 నుంచి 52 మిలియన్‌ డాలర్లకు విలువను పెంచుకున్నాయి. రాజస్థాన్‌ రాయల్స్‌ 43 మిలియన్‌ డాలర్లతో ఆఖరి స్థానంలో నిలిచింది. 

ఎవరికెంత దక్కిందంటే

లీగ్‌లో 11 సీజన్లు ముగిశాయి. దాదాపు 694 మంది పారితోషికాలు అందుకున్నారు. ఫ్రాంచైజీలన్నీ దాదాపు రూ.4,284 కోట్లకు పైగా ఆటగాళ్లకు చెల్లించారు. 426 మంది భారత ఆటగాళ్లు రూ.2,354 కోట్లు వేతనంగా అందుకున్నారు. మొత్తం చెల్లింపుల్లో ఇది 54.95% అన్నమాట. ఇక 268 మంది విదేశీ క్రికెటర్లకు రూ.1,930 కోట్లు దక్కింది. వీరిలో అత్యధికంగా ఆర్జించింది కంగారూలే. 84 మంది ఆసీస్‌ క్రికెటర్లు రూ.653 కోట్లు (15.26%) అందుకున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన 52 మంది రూ.428 కోట్లు తీసుకున్నారు. 26 మంది వెస్టిండీస్‌ క్రికెటర్లు రూ.279 కోట్లు, 26 మంది లంకేయులు రూ.191 కోట్లు, న్యూజిలాండ్‌ 22 మంది క్రికెటర్లు రూ.151 కోట్లు తీసుకున్నారు. ఇక లీగ్‌లో టాప్‌-10 ఆటగాళ్లకు దక్కిన మొత్తం రూ.821 కోట్లు. అంటే పారితోషికంలో 19.18%, ఇందులో ఎంఎస్‌ ధోనీ, రోహిత్‌ శర్మ, కోహ్లీ తలో రూ.100 కోట్లు సంపాదించారు. గంభీర్‌, రైనా, యువీకి రూ.80 కోట్లకు పైగా అందుకున్నారు. టాప్‌-20 క్రికెటర్లకు అయిన ఖర్చు రూ.1,305 కోట్లు (31.52%). టాప్‌ 11-20 క్రికెటర్లకు రూ.5,28 కోట్లు (12.32%) చెల్లించారు.

‘స్టార్‌’ మార్క్‌

ప్రసార హక్కుల్లోనూ ఐపీఎల్‌ దిమ్మతిరిగే షాకులిచ్చింది. స్టార్‌ ఇండియా ఐదేళ్ల కాలానికి రూ.16,347 కోట్లకు (2.55 బిలియన్‌ డాలర్లు) అంతర్జాతీయ ప్రసార హక్కుల్ని గెలుచుకుంది. ఇందుకోసం జరిగిన బిడ్‌లో ఫేస్‌బుక్‌, రిలయన్స్‌, జియో, భారతీ ఎయిర్‌టెల్‌, సోనీ నెట్‌వర్క్‌ తీవ్రంగా పోటీపడ్డాయి. అంటే ఒక ఐపీఎల్‌ మ్యాచ్‌ ప్రసారానికి స్టార్‌ రూ.54 కోట్లు చెల్లిస్తోంది. కాగా భారత్‌ తలపడే మ్యాచ్‌లకు చెల్లిస్తున్న మొత్తం రూ.43 కోట్లు కావడం గమనార్హం. ప్రసార హక్కుల అంశంలో ప్రపంచంలోని ప్రముఖ క్రీడా లీగులతో పోలిస్తే ఐపీఎల్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఈపీఎల్‌ మూడేళ్ల ప్రసారానికి 13.4 బిలియన్‌ డాలర్లు (ఏడాదికి 4.4), ఎన్‌ఎఫ్‌ఎల్‌కు తొమ్మిది ఏళ్లకు 39.6 బిలియన్‌ డాలర్లు (ఏడాదికి 4.4), ఎన్‌బీఏకు తొమ్మిదేళ్లకు 24 బిలియన్‌ డాలర్లు (ఏడాదికి 2.6) తర్వాతి స్థానం ఐపీఎల్‌దే. ఏడాదికి 0.5 బిలియన్‌ డాలర్లు స్టార్‌ చెల్లిస్తోంది. 

మేనియాకు తార్కాణం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ బ్రాండ్‌ విలువ ఎందుకు పెరుగుతుందో తెలియాలంటే దానికున్న క్రేజ్‌ తెలియాలి. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఇదెలా మంచి చేస్తుందో ఓ సారి పరిశీలిద్దాం. 2014లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తొలి 20 మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించారు. దాంతోనే దుబాయ్‌ ఆర్థిక వ్యవస్థలోకి అదనంగా 275 మిలియన్ల దిర్హమ్స్‌ ప్రవహించాయి. 2009లో దక్షిణాఫ్రికాలోనూ ఇలాగే జరిగిందని కేపీఎంజీ అధ్యయనం తెలిపింది. ఐపీఎల్‌ జరిగిన సమయంలో అక్కడి హోటళ్లలో దాదాపు 22,000 గదులు బుక్‌ అయ్యాయి. 10,000 దేశీయ విమాన ప్రయాణ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇక ఆహారం, పానీయాలు, రవాణా, కొనుగోళ్లపై ఎంత రాబడి వచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్‌ వల్ల దక్షిణాఫ్రికా పర్యాటక రంగానికి ఓ కొత్త కళ వచ్చిందనడంలో సందేహం లేదు.

www.eenadu.net ప్రత్యేకం


Tags :

మరిన్ని