close

వార్తలు / కథనాలు

రోజారోజా.. రోజారోజా.. నిన్ను చూసి..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమికుల దినోత్సవం రోజున ‘ప్రేమ పువ్వు’ వికసిస్తుంది. అవును, భారత్‌ నుంచి ఈ ఏడు సుమారు రూ. 27 కోట్ల విలువైన గులాబీలు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయని అంచనా. గత ఏడాది రూ.23 కోట్ల విలువైన గులాబీలు ఎగుమతి అయ్యాయి. 2017లో ఈ మొత్తం రూ.19 కోట్లు మాత్రమే.

లండన్‌కే అత్యధికం..

భారత్‌ నుంచి వెళ్లే గులాబీల్లో అత్యధిక భాగం బ్రిటన్‌కు చేరుకొంటాయి. ఆ తర్వాత స్థానాల్లో మలేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, జపాన్‌లు ఉన్నాయి. ఇటీవలే మలేసియాకు భారత్‌ గులాబీల ఎగుమతి మొదలైంది. అప్పుడే ఇక్కడ భారత గులాబీలకు భారీ డిమాండ్‌ వచ్చింది. మహారాష్ట్రలోని తలేన్‌గావ్‌‌ ప్రాంతం నుంచి ఇవి అత్యధికంగా ఎగుమతి అవుతాయి. ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో చలి పెరగడంతో ప్రేమికుల దినోత్సవం నాటికి సగానికి పైగా మొగ్గలు పవ్వులుగా మారే పరిస్థితి లేదు. దీంతో జనవరి 25 తర్వాత మొదలు కావాల్సిన ఎగుమతులపై ప్రభావం చూపింది. కానీ అదృష్టవశాత్తు చివరి మూడురోజుల్లో ఎండలు రావడంతో భారీగా గులాబీలు అందుబాటులోకి వచ్చాయి. వాలెంటైన్స్‌డేతో పాటు వివాహ ముహుర్తాలూ ఉండటంతో రోజాపూల డిమాండ్‌ పెరిగిపోయింది.

భారీగా పెరిగిన ధర..

వాలెంటైన్స్‌ డే, వివాహ ముహూర్తాలతో రోజాపూల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూదిల్లీలలో ఒక్కో పువ్వు ధర రూ.15 వరకు పలుకుతోంది. గతేడాది వీటిధర రూ.7-9 మధ్యలో ఉంది. 20 పువ్వుల బొకే ధర రూ.250 నుంచి రూ.350 మధ్యలో ఉంది. లండన్‌ మార్కెట్లో భారత్‌కు చెందిన ఒక్కో గులాబీకి సగటున రూ.28 ధర లభిస్తోంది. గులాబీ రైతులకు గత ఏడాది ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చింది. ఈసారి ఇది మరింత పెరగవచ్చని అంచనా. భారత్‌లో 2017లో పువ్వుల మార్కెట్‌ విలువ రూ.13వేల కోట్లు.. 2023నాటికి ఇది 39,400 కోట్లకు చేరుతుందని అంచనా. వీటిల్లో సగభాగం రోజాపూలదే. ‌

ఇథియోపియా నుంచి భారత్‌కు..

ఎగుమతులే కాదు, కొన్ని రకాల గులాబీలను భారత్‌ దిగుమతి కూడా చేసుకుంటోంది. కాకపోతే వీటి సంఖ్య చాలా తక్కువ. ముఖ్యంగా ఇథియోపియా, కెన్యా, ఈక్వెడార్‌ వంటి దేశాల నుంచి భారత్‌కు గులాబీలు వస్తుంటాయి. ఒక్కో పువ్వుకు రూ.5-5.50 మధ్యలో చెల్లిస్తారు. వీటిని మార్కెట్లోకి రూ.15 వరకు విక్రయిస్తారు. భారత్‌లో ఉన్న మొత్తం డిమాండ్‌లో దిగుమతి చేసుకొన్న పూల వాటా కేవలం 2 నుంచి 3 శాతమే.


Tags :

మరిన్ని