
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్: మనిషి పొందే ప్రతి అనుభూతికి అక్షరాలుంటాయేమో కానీ ప్రేమకు మాత్రం ఉండవనేది చాలా మంది భావన. కొందరి విషయంలో ఇది నిజం కూడా కావచ్చు. అందుకే ఏడాదిలో వీరికంటూ ఓ రోజును కేటాయించారు. వాస్తవానికి నిజంగా ప్రేమలో ఉన్నవారికి రోజూ ప్రేమికుల పండగే. ఇంకా చెప్పాలంటే ఈ ప్రేమికుల దినోత్సవం మన భారతీయ సంప్రదాయమే కాదు. ఇదో పాశ్చాత్య పండగ. ఎప్పుడు, ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ మధ్య కాలంలో పాశ్చాత్య దేశాలకంటే ఎక్కువగా భారతదేశంలో జరుపుకొంటున్నారు. అయితే ఈ ప్రేమికుల దినోత్సవాన్ని ఆస్వాదించేవాళ్లు ఎంతమంది ఉన్నారో వ్యతిరేకించే వాళ్లు అంతకంటే ఎక్కువే. అందుకే వారి వ్యతిరేకతకు, నిరసనకు ఉదాహరణగా ప్రేమికుల రోజుకు ప్రత్యామ్నాయంగా ఫిబ్రవరి 14న వివిధ ‘డే’లు నిర్వహిస్తున్నారు. ఇంతకీ అవేంటో ఓ సారి తెలుసుకుందాం!
*మాతృ-పితృ పూజా దినోత్సవం..
ప్రేమికుల రోజును వ్యతిరేకించే వాళ్లలో దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తరాదిలో ఎక్కువని మొన్నామధ్య ఓ సర్వేలో వెల్లడైంది. ఇది యథార్థమని ఎన్నో సార్లు రుజువైంది కూడా. 2012లో ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా అఖిలేశ్ యాదవ్ ఉన్నప్పుడు ఫిబ్రవరి 14న ‘మాతృ-పితృ పూజ’ నిర్వహించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. నిజానికి ఈ ప్రతిపాదన ఆశారాం బాపూది. అప్పటి నుంచి ప్రతి ఏడాది యూపీ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పాశ్చాత్య పోకడల నుంచి యువతను రక్షించి తల్లిదండ్రులపై ప్రేమ పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆరోజున ప్రతి పాఠశాలల్లోనూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను పూజిస్తారు.
*‘బ్లాక్ డే’..
శివసేన ఫిబ్రవరి 14న ‘బ్లాక్ డే’గా నిర్వహిస్తోంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడంలో అహర్నిశలు శ్రమించిన భగత్ సింగ్తో పాటు మరో ఇద్దరికి ఈ రోజునే న్యాయస్థానం మరణశిక్ష విధిస్తున్నట్టు తీర్పు వెలువరించింది. దీంతో స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించిన, ఇప్పటికీ ప్రతి భారతీయుడి గుండెల్లో నిలిచిపోయిన భగత్ సింగ్కు శిక్ష పడిన ఆరోజును ఆనందంతో కాకుండా వారికి నివాళిగా జరుపుకోవాలనేది శివసేన అభిమతం.
*క్రమశిక్షణ దినోత్సవం...
ప్రేమికుల రోజున స్వేచ్ఛగా తిరగాలని ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరూ కోరుకోవడం సహజం.ఇందుకు చాలా మంది యువత కళాశాలనే ఫేవరెట్ ప్రదేశంగా ఎంచుకుంటారు. కానీ లఖ్నవూ విశ్వవిద్యాలయంలో ఈ పప్పులేం ఉడకవు. ఆరోజున ఏ ఒక్క విద్యార్థి కాలేజీ ఆవరణలో తిరగడానికి వీల్లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఆరోజున అక్కడ 144 సెక్షన్ విధిస్తారన్నమాట. నిబంధనలు ఉల్లంఘించినవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.2018నుంచి ఈ నియమాలను అమల్లోకి తెచ్చారు.
*ప్రేమికుల రోజే పెళ్లిరోజు కావచ్చు..
నిజమే!భజరంగ్ దళ్ కార్యకర్తలు ఈ మధ్యకాలంలో ఇలాంటి కార్యక్రమాలకే పూనుకొంటున్నారు. ప్రేమికుల రోజున రోడ్ల మీద ఎవరైనా ప్రేమజంట కనిపిస్తే వారికి అక్కడిక్కడే పెళ్లి చేసేస్తారు. సదరు వ్యక్తులకు ఇష్టం ఉన్నా లేకపోయినా వివాహం జరిపించేస్తారు. అంతేకాదు కాలం మారుతున్న కొద్దీ వీరు అనుసరించే పద్ధతిలోనూ మార్పులొచ్చాయి. గతేడాది నుంచి భజరంగ్ దళ్ సభ్యులు వారి వెంట ఓ పూజారిని కూడా వెంటబెట్టుకు తిరుగుతున్నారు.
*సిస్టర్స్ డే...
మనదేశం సంగతి పక్కన పెడితే ప్రేమికుల రోజుకి బద్ధశత్రువులు పాకిస్థాన్లో ఎక్కువగా ఉన్నారు. పాకిస్థాన్లో ఏకంగా ఆరోజును ‘సిస్టర్స్డే’గా నిర్వహించుకుంటున్నారు. పాకిస్థాన్లోని ఓ విశ్వవిద్యాలయంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 14న సిస్టర్స్డేగా నిర్వహిస్తారు. ఆ రోజున విద్యార్థినులకు అబ్బాయిలు స్కార్ఫ్లు, బురఖాలు కానుకగా ఇస్తారు. దీంతో పాటు వారికి ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని హామీ కూడా ఇస్తారు. ఈ తంతు మొత్తం ఆ విశ్వవిద్యాలయ వీసీ పర్యవేక్షణలో జరుగుతుంది.