
వార్తలు / కథనాలు
ఇంటర్నెట్ డెస్క్ : ఇకనుంచి రాత్రిపూట మనం ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు, చందమామే కాకుండా కొన్ని కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు కనిపించనున్నాయి. టీవీ తెరపై కనిపించే ఆ ప్రకటనలు ఇప్పుడు చంద్రుడి పక్కన చేరే అవకాశం ఉంది. అసాధ్యమనే పదాన్ని తుడిచివేస్తూ ప్రతి ఆలోచనను సుసాధ్యం చేసే ఆ ఘనత సైన్స్‌కు ఉంది మరి. రష్యన్ స్టార్టప్ ‘స్టార్ట్ రాకెట్’ 2020 కల్లా బిల్ బోర్డు స్టైల్ ప్రకటనలను నింగిలోకి తీసుకురానున్నట్లు ఓ మీడియా సంస్థకు వెల్లడించింది. ఇప్పుడు కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్, కొకొకోలా..ఇలా ప్రతి యాడ్ నక్షత్రాల సముదాయంగా ఆకాశంలోనే దర్శనమివ్వనున్నాయి.
స్టార్ట్ రాకెట్ ఈ ప్రాజెక్టును 2020లో ప్రారంభించనుండగా, ప్రకటనలు మాత్రం 2021 నుంచి దర్శనమివ్వనున్నాయని తెలిపింది. 400 నుంచి 500 కిలో మీటర్ల ఎత్తులో క్యూబ్ శాట్స్‌ను కక్ష్యలోకి ప్రవేశ పెట్టనుంది. భూమి మీద నుంచి చూసే వారికి సదరు యాడ్ ఆరు నిమిషాల పాటు కనిపిస్తుందని ఆ స్టార్టప్ ప్రతినిధి వెల్లడించారు. అయితే ఒక ప్రకటనకు ఎంతమేర ఖర్చవుతుందో మాత్రం వెల్లడించలేదు. స్పేస్ అండ్ శాటిలైట్ చట్టాలపై నిపుణులైన రాండీ సెగల్ మాట్లాడుతూ..సాంకేతికంగా ఈ ప్రాజెక్టు సాధ్యం కావచ్చు. కానీ, చట్టపరంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. మొదటి సమస్య వైమానిక నియంత్రణ సంస్థల నుంచే ఎదురుకావొచ్చన్నారు.