close

వార్తలు / కథనాలు

రోజుకు 90 నిమిషాలు ఆన్‌లైన్‌లోనే..

రోజుకు 90 నిమిషాలు ఆన్‌లైన్‌లోనే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనతో పాటు ఉండే ఏకైక వస్తువు.. స్మార్ట్‌ఫోన్‌’ అనడంలో ఎలాంటి సందేహం లేదు అనిపిస్తుంది నేటి తరంలో. అవును మరి.. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ మనకు నిత్యావసర వస్తువులా మారిపోయింది. అలారం, క్యాలెండర్‌, వాచ్‌, కెమెరా, కాలిక్యులేటర్‌, డైరీ.. ఇలా అన్నింటి కోసం మనం స్మార్ట్‌ఫోన్‌ వంకే చూస్తున్నాం. ఇక డేటా ఆఫర్లు కూడా అందుబాటు ధరల్లో ఉండటంతో స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్‌ వినియోగం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఛాటింగ్‌, బ్రౌజింగ్‌ అంటూ గంటల తరబడి ఆన్‌లైన్‌లోనే ఉంటున్నాం. మన దేశంలో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఒక రోజులో సగటున 90 నిమిషాల కంటే ఎక్కువ సేపే ఆన్‌లైన్‌లో ఉంటున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది.

భారత స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల అలవాట్లపై నీల్సెన్‌ స్మార్ట్‌ఫోన్‌ 2018 ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. ఎంట్రీలెవల్‌, మిడ్‌రేంజ్‌, ప్రీమియం ఇలా ఏ సెగ్మెంట్‌ ఫోన్లయినా యూజర్లు సగటున ఒక రోజులో 90 నిమిషాల పాటు ఆన్‌లైన్‌లోనే ఉంటున్నారని తెలిసింది. ఇక ప్రీమియర్‌ సెగ్మెంట్‌ ఫోన్లను వినియోగించే యూజర్లు అయితే ఏకంగా రోజులో 130 నిమిషాలు ఆన్‌లైన్‌లో గడుపుతున్నారట. కాగా.. ఇందులో సగం సమయం కేవలం ఛాటింగ్‌, బ్రౌజింగ్‌, సోషల్‌మీడియా కోసమే కేటాయిస్తున్నారని నివేదిక తెలిపింది.

ఈ సందర్భంగా నీల్సెన్‌ ఇండియా టెక్నాలజీ ఐపీజీ డైరెక్టర్‌ అభిజిత్‌ మత్కర్‌ మాట్లాడుతూ.. ‘తక్కువ ధరకే వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ సేవలు, బడ్జెట్‌ ధరల్లో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని చైనీస్‌, ఇండియన్‌ మొబైల్‌ తయారీ సంస్థలు రూ. 5000 కంటే తక్కువ ధరకే ఫోన్లను అందిస్తున్నాయి. దీనికి తోడు డేటా ఛార్జీలు కూడా చాలా వరకు తగ్గాయి. దీంతో చాలా మంది స్మార్ట్‌ఫోన్లకే మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ఇంటర్నెట్‌ వాడకం పెరుగుతోంది’ అని అన్నారు.


Tags :

మరిన్ని