
వార్తలు / కథనాలు
దిల్లీ : ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం మరో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ‘ఫేస్ లాగిన్’ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన టెస్టింగ్ ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే ఇక పాస్వర్డ్ అవసరం లేకుండానే స్మార్ట్‌ఫోన్ వైపు చూసి యాప్‌లోకి లాగిన్ కావొచ్చు.
సైబర్ దాడుల నుంచి వినియోగదారులకు మరింత భద్రత కల్పించేందుకే ఫేస్లాగిన్ను తీసుకొస్తున్నట్లు సంస్థ చెబుతోంది. కొత్త ఫీచర్ 10వేలకు పైగా ముఖాలను 100 శాతం కచ్చితత్వంతో గుర్తించిందని తెలిపింది. అత్యంత కచ్చితత్వంతో కూడిన ఫలితాల కోసం ముఖంపై ఉండే 200 అంశాలను ఫేషియల్ రికగ్నిషన్ మ్యాప్ చేస్తుందని పేర్కొంది.
‘ఇది పేటీఎం వినియోగదారులకు భద్రతాపరంగా ముఖ్యమైన అప్డేషన్. ఫిషింగ్ లాంటి సైబర్ దాడుల నుంచి రక్షణ పొందేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. పదేపదే పాస్‌వర్డ్‌లను మార్చుకునే బాధ కూడా తప్పుతుంది.’ అని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. పేటీఎం ఇప్పటికే పిన్, పాస్వర్డ్, ప్యాటర్న్, ఫింగర్ప్రింట్లతో లాగిన్ అయ్యే అవకాశాలను కల్పిస్తోంది.
అయితే సమస్య ఏంటంటే.. ఫేషియల్ రికగ్నిషన్ అనేది ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో పూర్తి భద్రతతో కూడుకున్నది కాదు. యాపిల్ సంస్థ ట్రూడెప్త్ సెన్సర్, 3డీ మ్యాపింగ్‌ను ఉపయోగిస్తుండగా.. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇందుకోసం 2డీ మ్యాపింగ్నే వినియోగిస్తున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఫోన్‌ను అన్‌లాక్ చేయడానికి సురక్షితమైన బయోమెట్రిక్ టూల్ కాదని కొన్ని స్మార్ట్ఫోన్ల సంస్థలు ముందుగానే తెలియజేస్తున్నాయి. వన్‌ప్లస్ సంస్థ గతంలో ఈ సిస్టమ్ 100 శాతం సురక్షితం కాదని చెప్పగా.. శాంసంగ్ తన గెలాక్సీ నోట్9లో మరింత భద్రత కోసం ఫేషియల్ రికగ్నిషన్‌తో పాటు ఐరిష్ స్కానర్‌ను కలిపి ఉపయోగించాలని సూచించింది.